నాకంత సీన్ లేదు లే అనుకున్నా!
డైరెక్టర్ అవ్వడానికి తెలివి తేటలు ఉంటే సరిపోతుంది..కానీ హీరో అవ్వడానికి తెలివితేటలు ఉన్నా సాధ్యం కానిది అని అప్పుడు నాని అభిప్రాయం.
By: Tupaki Desk | 20 Dec 2023 4:30 PM GMTనేచురల్ స్టార్ నాని డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ అతడిని పరిశ్రమ హీరోని చేసింది. ఇది ఆయన కూడా ఊహించనది. తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిశ్రమలోకి వచ్చాడు. ఈ క్రమంలోనే సీనియర్ దర్శకులు బాపు వద్ద కూడా ఓ సినిమాకి అసిస్టెంట్ గా పనిచేసారు. తన విజన్ తో హీరోల్ని తయారు చేయాలనుకున్నాడు. కానీ తానే హీరో అవుతాడని అతడు కూడా గెస్ చేయలేదు.
ఇప్పుడు నేచురల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయాడు. మరి అతడు ముందుగా హీరో అవ్వాలని ఎందుకు అనుకోలేదు? అంటే పరిశ్రమలో తనకు తెలిసిన వారు ఎవరూ లెకపోవడం...సపోర్ట్ కూడా లేకపోవడంతో? హీరో అవ్వడం కన్నా..డైరెక్టర్ అవ్వడం ఈజీ అనుకున్నాడు. డైరెక్టర్ అవ్వడానికి తెలివి తేటలు ఉంటే సరిపోతుంది..కానీ హీరో అవ్వడానికి తెలివితేటలు ఉన్నా సాధ్యం కానిది అని అప్పుడు నాని అభిప్రాయం.
కానీ అది తప్పని తను హీరో అయిన తర్వాత అర్దమైంది. ఈ విషయాలు ఇటీవల సందీప్ రెడ్డి తో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసాడు నాని. నేచురల్ స్టార్ హీరోగా నటించిన తొలి చిత్రం 'అష్టాచెమ్మా'. మోహన్ కృష్ణ ఇంద్రగట్టి ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. అందులో నాని నేచురల్ నటన ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ రోజుతో నాని జీవితమే మారిపోయింది. డైరెక్టర్ కావాల్సిన నాని కి హీరో అవకాశాలు క్యూ కట్టాయి.
ఆ వెంటనే 'రైడ్' అనే చిత్రంతో మరో విజయం ఖాతాలో పడింది. అటుపై 'స్నేహితుడా'..'భిమిలీ కబడ్డి జట్టు' ఇలా వరుసగా విజయాలే అందుకున్నాడు. 'అలా మొదలైంది'...'పిల్ల జమీందార్' ..'ఈగ' ఇలా ఒకదాని వెంట ఒక విజయం నాని ని స్టార్ హీరోగా మార్చేసాయి. 'దసరా' విజయంతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లోనూ చేరాడు. ఇటీవల రిలీజ్ అయిన 'హాయ్ నాన్న'తోనూ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.