రజనీకాంత్ సినిమా.. నాని నో చెప్పడానికి రీజన్ ఇదే
'జై భీమ్' ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ కథనాయకుడిగా ఈ సినిమా రూపొందనుంది
By: Tupaki Desk | 17 Aug 2023 7:03 AM GMTబాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్‌లతో కలిసి తెరను పంచుకునే అరుదైన అవకాశం ఎవరు కాదంటారు? కానీ అలాంటి అవకాశానికి నేచురల్ స్టార్ నాని నో చెప్పారని, దీంతో ఆ అవకాశం మరో హీరో శర్వానంద్ అందుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నాని ఎందుకు నో చెప్పారో ఇప్పుడు తెలిసింది.
'జై భీమ్' ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ కథనాయకుడిగా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలోనే అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో యంగ్ హీరో పోషించాల్సిన ఓ కీలక పాత్ర కూడా ఉంటుందట. ఆ పాత్ర కోసం పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో ప్రముఖంగా నేచురల్ స్టార్ నాని పేరు బాగా వినిపించింది.
ఆల్మోస్ట్ ఆ కాంబినేషన్ సెట్ అయిపోయిందని అంతా అనుకున్నారు. సోషల్‌మీడియాలోనూ జోరుగా ప్రచారం సాగింది. నానికి బంపర్ ఆఫర్ దక్కిందని మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడా అవకాశమే శర్వానంద్‌కు దక్కింది. అందుకు కారణం నాని ఆ ఆఫర్‌ను తిరస్కరించడమే. అయితే ఆయన ఎందుకు రిజెక్ట్ చేశారో మొదట కారణం తెలీదు.
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సినిమా యంగ్ హీరో పోషించాల్సిన పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందట. విలన్ పాత్ర అని తెలిసింది. అందుకే నాని సున్నితంగా తిరస్కరించారట. దీంతో ఆ అవకాశం శర్వానంద్ దగ్గరికి వెళ్లగా.. ఏ పాత్రైనా సరే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయమే నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
కాగా, రజనీకాంత్‌కి ఇది 170వ చిత్రం కావడం విశేషం. అలాగే ఆయన అమితాబ్ బచ్చన్‌తో కలిసి దాదాపు 32 ఏళ్ల తర్వాత నటిస్తున్న చిత్రం కూడా ఇదే. వీరిద్దరు కలిసి గతంలో 'హమ్', 'గిరఫ్ తార్' సహా మరో చిత్రంలో కలిసి నటించారు. అవి అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇకపోతే రజనీ.. తన కూతురు దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. మొయిద్దీన్ అనే భాయ్ పాత్ర పోషించారు.