నాని తమిళ బాక్సాఫీస్.. పరిస్థితి ఎలా ఉందంటే..
నాని తమిళంలో డబుల్ డిజిట్ కలెక్షన్స్ సాధించాలని లక్ష్యంతో ఉన్నారు. కానీ అది ఇప్పటి వరకు సాధ్యం కాలేదు.
By: Tupaki Desk | 21 Aug 2024 4:01 AM GMTనాచురల్ స్టార్ నాని తెలుగులో అత్యధిక మార్కెట్ ఉన్న టైర్ 2 హీరోలలో ఒకడిగా ఉన్నాడు. గత ఏడాది “దసరా”, “హాయ్ నాన్న” సినిమాలతో రెండు కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఆగష్టు 30న “సరిపోదా శనివారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపైనే అంచనాలు పెరిగాయి.
తెలుగులో మరో సూపర్ హిట్ “సరిపోదా శనివారం” సినిమాతో నాని అందుకుంటాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అయితే నాని “అంటే సుందరానికి” చిత్రం నుంచి ఇతర భాషలలో కూడా తన మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళం పైన నాని ఎక్కువగా ఫోకస్ చేశారు. కోలీవుడ్ కు నానికి మంచి కనెక్షన్ ఉంది. వెప్పం(సెగ) అనే డైరెక్ట్ తమిళ్ మూవీ చేశాడు. ఈగ కూడా తమిళ్ లో విడుదలైంది. ఇక చాలా కాలంగా తమిళనాడులో కూడా మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అయితే తమిళ్ ఆడియన్స్ మాత్రం నానికి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వడం లేదు. తమిళంలో “అంటే సుందరానికి” సినిమాకి కేవలం 1 కోటి కలెక్షన్స్ మాత్రమే అందుకోగలిగారు. “దసరా” సినిమాకి 2.75 కోట్ల కలెక్షన్స్ తమిళనాట వచ్చాయి. “హాయ్ నాన్న” మూవీ 4 కోట్ల వరకు వసూలు చేసింది. నాని తమిళంలో డబుల్ డిజిట్ కలెక్షన్స్ సాధించాలని లక్ష్యంతో ఉన్నారు. కానీ అది ఇప్పటి వరకు సాధ్యం కాలేదు.
కోవిడ్ తర్వాత ఆయన నుంచి వచ్చిన మూడు సినిమాలకి అంతంత మాత్రమే ఆదరణ లభించింది. తమిళ్ ఆడియన్స్ తెలుగు సినిమాలని అంతగా రిసీవ్ చేసుకోరు అనే మాటకి నిదర్శనంగా అతని సినిమాల కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అయిన కానీ మరోసారి “సరిపోదా శనివారం” సినిమాతో తమిళంలో డబుల్ డిజిట్ కలెక్షన్స్ అందుకోవడానికి నాని ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ముందుగా తమిళనాడులోనే స్టార్ట్ చేశారు.
ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కోలీవుడ్ సర్కిల్ లో “సరిపోదా శనివారం” సినిమాని నాని ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈ సారైనా నాని ఎక్స్ పెక్ట్ చేస్తున్న డబుల్ డిజిట్ కలెక్షన్స్ ని తమిళనాట అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. తమిళ్ స్టార్ యాక్టర్ ఎస్.జె.సూర్య ఈ సినిమాలో విలన్ గా ఉన్న నేపథ్యంలో కచ్చితంగా ఈ సారి సరిపోదా శనివారం కలెక్షన్స్ అయితే పెరుగుతాయనే మాట వినిపిస్తోంది. మరి అది ఏ స్థాయిలో ఉంటుందనేది చూడాలి.