పట్టు విడువని నాని.. రంగంలోకి మరో ముగ్గురు
న్యాచురల్ స్టార్ నాని తదుపరి చిత్రం సుజీత్ దర్శకత్వంలో రూపొందనుంది.
By: Tupaki Desk | 18 May 2024 7:41 AM GMTన్యాచురల్ స్టార్ నాని తదుపరి చిత్రం సుజీత్ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కొత్త నిర్మాత కోసం ప్రయత్నాల్లో ఉంది. మొదట DVV దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఒప్పుకున్నారు కానీ, బడ్జెట్ కారణంగా ఆయన ముందుకు రాలేకపోయారు. దీంతో సినిమా ఆగిపోయిందని మొదట అనేక రకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. కానీ నాని మాత్రం ఆ సినిమాను వదలడానికి ఇష్ట పడడం లేదు. సుజిత్ కూడా నానితోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ఇక నాని, సుజీత్ కలిసి కొత్త నిర్మాతను ఎంపిక చేసేందుకు చర్చలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ను తీసుకోవడానికి ముగ్గురు నిర్మాతలు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. అందులో మొదట ‘జెర్సీ’ చిత్రాన్ని నాని తో నిర్మించిన ఎస్ నాగ వంశీ ఈ ప్రాజెక్ట్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సితార వారితో నాని కి మంచి అనుబంధం ఉంది. అలాగే సుజిత్ తో కూడా సినిమా చేయాలని నిర్మాత వంశీ చాలా కాలంగా చర్చలు జరుపుతున్నారు.
అలాగే ‘శ్యామ్ సింగ రాయ్’ ను నిర్మించిన నిహారిక ఎంటర్టైన్మెంట్స్ కి చెందిన వెంకట్ బోయనపల్లి కూడా ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ కూడా నానికి చాలా క్లోజ్. అప్పట్లోనే నాని తో భవిష్యత్తు లో మరొక బిగ్ మూవీ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఇక ఇప్పుడు సుజిత్ సినిమాపై వారి ఫోకస్ పెరిగింది. వీరి తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి చెందిన TG విశ్వ ప్రసాద్ కూడా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ సినిమా నిర్మాణ వ్యయాలు, నటీనటుల రెమ్యునరేషన్స్ వంటి అంశాలు చర్చించబడుతున్నాయి. నాని తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నిర్ణయం తర్వాత, సరైన నిర్మాత తో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోధా శనివారం' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇక ఆగస్ట్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
అలాగే నాని 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. నాని లైనప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో అతని మార్కెట్ అమాంతం పెరిగిపోయేలా కనిపిస్తోంది. ముఖ్యంగా నాని, సుజీత్ కలయికలో రాబోయే న్యూ ప్రాజెక్ట్ కోసం సినీ ప్రేమికులు, ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు.