Begin typing your search above and press return to search.

28 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ప్ర‌జ‌ల కోసం అంకితం: నారా భువ‌నేశ్వ‌రి

'ఎన్టీఆర్ ట్ర‌స్ట్ యూఫోరియా మ్యూజిక‌ల్ నైట్' కార్య‌క్ర‌మాన్ని టాలీవుడ్ సంగీత దర్శ‌కుడు త‌మ‌న్ సార‌థ్యంలో నిర్వ‌హిస్తున్నామ‌ని శ్రీ‌మ‌తి భువ‌నేశ్వ‌రి తెలిపారు.

By:  Tupaki Desk   |   21 Jan 2025 4:51 PM GMT
28 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ప్ర‌జ‌ల కోసం అంకితం: నారా భువ‌నేశ్వ‌రి
X

బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చేందుకు ఏమీ ఆశించ‌కుండా నాన్న‌(సీనియ‌ర్ ఎన్టీఆర్)గారు రాజ‌కీయాల్లోకి వచ్చార‌ని ఆయ‌న వార‌సురాలు, NTR మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ‌మ‌తి నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ 28ఏళ్ల ప్ర‌యాణాన్ని పుర‌స్క‌రించుకుని, 'ఎన్టీఆర్ ట్ర‌స్ట్ యూఫోరియా మ్యూజిక‌ల్ నైట్' కార్య‌క్ర‌మాన్ని టాలీవుడ్ సంగీత దర్శ‌కుడు త‌మ‌న్ సార‌థ్యంలో నిర్వ‌హిస్తున్నామ‌ని శ్రీ‌మ‌తి భువ‌నేశ్వ‌రి తెలిపారు.

ఈ సంద‌ర్భంగా నారా భువ‌నేశ్వ‌రి మాట్లాడుతూ-''నాన్న‌గారు (నంద‌మూరి తార‌క రామారావు) చాలా క‌ష్ట‌ప‌డి పైకొచ్చిన మ‌హోన్న‌త వ్య‌క్తి. రాజ‌కీయాల్లో ఏదీ ఆశించ‌కుండా ప్ర‌జ‌లే దేవుళ్లు అని వారి కోసం శ్ర‌మించారు. బ‌ల‌హీన వ‌ర్గాల కోసం, ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం, వారి భ‌విష్య‌త్ కోసం ఆయ‌న రాజ‌కీయ రంగంలోకి వ‌చ్చారు. ఆయ‌న ముంద‌డుగు వేసి పేదలు, సామాన్య‌ ప్ర‌జ‌ల కోసం చాలా ప‌థ‌కాల‌ను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారు. కిలో రూ.2కే బియ్యం, ఆడ‌పిల్ల‌ల‌కు స‌మాన ఆస్తి హ‌క్కు స‌హా ఎన్నో ప‌థ‌కాల‌ను తెలుగు జాతి కోసం తెచ్చారు. మ‌న ప్ర‌జా నాయ‌కుడు నారా చంద్ర‌బాబు నాయుడు గారు ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్టీఆర్ మెమోరియ‌ల్ ట్ర‌స్ట్ ని విద్యా వైద్య ఆరోగ్య రంగాల్లో సేవ‌ల‌ కోసం స్థాపించారు. 1997లో ఈ ట్ర‌స్ట్ ని ప్రారంభించారు. అధికారంలో ఉన్న ఏ ప్ర‌భుత్వ స‌హ‌కారం తీసుకోకుండా 28ఏళ్లుగా ఈ ప్ర‌యాణం కొన‌సాగుతోంది. ప్ర‌జ‌ల‌కు ట్ర‌స్ట్ నిరంత‌రం అందుబాటులో ఉంది'' అని తెలిపారు.

కొన్నేళ్ల క్రితం విప‌త్తుల స‌మ‌యంలోను ట్ర‌స్ట్ త‌ర‌పున స‌హ‌కారం అందించామ‌ని నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. 2013లో పైలాన్ త‌ఫాన్, 2014 లో హుద్ హుద్ తుఫాన్, 2018లో కేర‌ళ తుఫాన్ స‌మ‌యంలోను

ఎవ‌రూ మ‌మ్మ‌ల్ని పిల‌వ‌కుండానే ట్ర‌స్ట్ త‌ర‌పున ప్ర‌జ‌లకు స‌హ‌కారం అందించామ‌ని తెలిపారు.

ర‌క్త‌దానానికి ముందుకు రండి:

త‌ల‌సేమియా ప్రాణాంత‌క వ్యాధి. చాలా మందికి ఈ వ్యాధి ఉంది. పిల్ల‌లు, పెద్ద‌ల్లోను ఉంది. ఇది ఉన్న‌వారికి ర‌క్తం (హిమోగ్లోబిన్) చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఊపిరి పీల్చుకోవ‌డానికి చాలా ఇబ్బంది పడ‌తారు. ఈ రుగ్మ‌త వ‌చ్చాక రెండు నుంచి నాలుగు నెల‌ల్లోగా ర‌క్త‌మార్పిడి చేయాల్సి ఉంటుంది. దీనికోసం చాలా ర‌క్తం అవ‌స‌రం. ర‌క్త దానం అంటే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ‌తారు. కానీ మీరు భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు. డాక్ట‌ర్లు ప్ర‌మాణాల మేర‌కు మాత్ర‌మే ర‌క్తం తీసుకుంటారు. చాలామంది ర‌క్త‌దానాన్ని లైట్ తీస్కుంటారు. కానీ మీకు నేను గుర్తు చేయాల‌నుకుంటున్న‌ది ఏమిటంటే.. ర‌క్త‌దానం అనేది స‌మాజానికి ఉప‌క‌రించే గొప్ప దానం. మీరు ఇచ్చే ప్ర‌తి ర‌క్త‌పు బిందువు చాలా జీవితాల‌ను నిల‌బెడుతుంద‌ని గుర్తించాలి. ఈ గొప్ప కార్య‌క్ర‌మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అని మా టీమ్ ఆలోచించిన‌ప్పుడు ఒక మ్యూజికల్ నైట్ ప్లాన్ చేయాల‌ని భావించాము అని నారా భువ‌నేశ్వ‌రి తెలిపారు.

ఎన్టీఆర్ ట్ర‌స్ట్ యూఫోరియా మ్యూజిక‌ల్ నైట్:

ఎన్టీఆర్ ట్ర‌స్ట్ యూఫోరియా మ్యూజిక‌ల్ నైట్ షోని నిర్వ‌హిస్తున్నాం. ప్ర‌తి ఒక్క‌రూ కుటుంబ స‌మేతంగా విచ్చేసి కార్య‌క్ర‌మంలో పాల్గొనండి. టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయి. ఈ షో టికెట్ల‌పై మీరు ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయి తిరిగి స‌మాజ సేవ‌కే ఉప‌యోగిస్తామ‌ని అన్నారు. విద్య‌, ఆరోగ్యం, బ్ల‌డ్ బ్యాంక్ సేవ‌ల‌తో మేం ముందుకు వెళుతున్నామ‌ని తెలిపారు. మ్యూజిక‌ల్ నైట్ కి స‌హ‌క‌రిస్తున్న సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ కి భువ‌నేశ్వ‌రి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి త‌మ‌న్ అంటూ భువ‌నేశ్వ‌రి త‌మ‌న్ ని ఉద్ధేశించి వ్యాఖ్యానించ‌డం న‌వ్వులు పూయించింది.