నాన్నా మీరు పోరాట యోధుడు.. నారా రోహిత్ ఉద్విగ్నత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కాలం చేసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 17 Nov 2024 5:47 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కాలం చేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..గుండెపోటు రావడంతో కన్నుమూసారని కథనాలొచ్చాయి. రామ్మూర్తి నాయుడు మరణంతో ఆయన అభిమానులు కుటుంబీకులు ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నారు.
తండ్రి మరణంపై నారా రోహిత్ ఉద్వేగపూరితంగా స్పందించారు. నాన్న గారి మరణాన్ని జీర్ణించుకోలేని ఆయన ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. ఈ పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ``నువ్వు ఒక గొప్ప ఫైటర్ వి నాన్న.. నా మీద చూపించిన ప్రేమను ఎన్నటికీ మరువలేను`` అని అన్నారు. మాకోసం నువ్వు ఎన్నింటినో దూరం చేసుకున్నావు. మరెన్నిటినో త్యాగం చేసావు.. నువ్వు చేసిన త్యాగలే మా జీవితాల్లో వెలుగులు నింపాయి.. నాన్న నీతో గడిపిన జ్ఞాపకాలు నాకు ముఖ్యమైనవి. జీవితాంతం వాటిని గుర్తు చేసుకుంటూ బ్రతికేస్తాను.. నిన్ను చాలా మిస్ అవుతున్నాం.. బై నాన్న`` అని ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసారు. జీవితంలో ఒడిదుడుగులను ఎలా ఎదుర్కోవాలో నేర్పించిన తన తండ్రి తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమని ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చారని రోహిత్ ఎమోషనల్ అయ్యారు.
నారా రామ్మూర్తి నాయుడు రాజకీయ ప్రస్థానం సుదీర్ఘమైనది. 1994 నుండి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెలేగా పనిచేశారు. కాంగ్రెస్, వైకాపా లకు ఆయన కంటిమీద కునుకు లేనంతగా విమర్శల దాడి చేసేవారు. ఇక హీరో నారా రోహిత్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. సుందర కాండ అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. అతడికి ఇటీవలే తన స్నేహితురాలితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తండ్రి మరణంతో వివాహం కొన్నాళ్ల పాటు వాయిదా పడుతుందని భావిస్తున్నారు.