రోహిత్ ఫియాన్సీ సిరి లెల్లా నేపథ్యం
కాబోయేవాడు రోహిత్ సరసన ప్రతినిధి 2లో మాత్రమే నటించింది. ఆ తర్వాత తన సినీకెరీర్ గురించిన ఎలాంటి సమాచారం లేదు.
By: Tupaki Desk | 14 Oct 2024 4:06 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు- భువనేశ్వరి దంపతుల ఆశీస్సులతో, ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడైన నారా రోహిత్ .. తాను ప్రేమించిన యువకథానాయిక, స్నేహితురాలు శిరీష (సిరి లెల్లా)ను పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. హైటెక్స్ (నోవాటెల్)లో జరిగిన సన్నిహిత నిశ్చితార్థ కార్యక్రమంలో ఇరు కుటుంబాల బంధుమిత్రులు పాల్గొన్నారు. రోహిత్- సిరి లెల్లా జంట నిశ్చితార్థ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
ఇంత సడెన్ గా ఒక అత్యున్నత రాజకీయ నేపథ్యం ఉన్న నారా వారి కుటుంబం నుంచి ఎలిజిబుల్ బ్యాచిలర్ ని కొంగున కట్టేసుకుంటున్న ఆ తెలుగమ్మాయి ఎవరు? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. గూగుల్ లో అదే పనిగా సిరి లెల్లా వివరాలను వెతికే పనిలో ఉన్నారు యువజనం. సిరి లెల్లా గురించి మరీ అంత ఎక్కువగా వివరాలు ఆన్ లైన్ లో అందుబాటులో లేవు. తను ఇప్పటికి వన్ ఫిలిం వండర్. కాబోయేవాడు రోహిత్ సరసన ప్రతినిధి 2లో మాత్రమే నటించింది. ఆ తర్వాత తన సినీకెరీర్ గురించిన ఎలాంటి సమాచారం లేదు.
అన్నట్టు సిరి లెల్లా తెలుగమ్మాయే. పల్నాడు మాచర్ల నియోజకవర్గంలోని ఒక పల్లెటూరి నుంచి వచ్చారు. స్థానికంగా బ్యాచిలర్స్ డిగ్రీ వరకు చదువుకున్నారని సమాచారం. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్(పోస్ట్ గ్రాడ్యుయేషన్) పూర్తి చేసారు. అయితే సిరి లెల్లాకు రంగుల ప్రపంచంపైనా, నటనపైనా అనురక్తి. తన అభిరుచి మేరకు సినిమాల్లో నటించడం కోసమే ఆమె తిరిగి భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలోనే `ప్రతినిధి 2` ఆడిషన్స్ కి వెళ్లి హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే సిరి- రోహిత్ ప్రేమలో పడ్డారు.
సిరికి ఇద్దరు అక్కలు ఉన్నారు. వారందరికీ పెళ్లయి లైఫ్ లో సెటిలయ్యారు. పెద్దక్క ప్రియాంక వద్ద ఉంటూనే హైదరాబాద్ లో సినిమా అవకాశాలు ప్రయత్నించారని తెలుస్తోంది. సిరి లెల్లా- రోహిత్ పెళ్లి డిసెంబర్ లో జరగనుందని రోహిత్ సన్నిహితులు ఒకరు ధృవీకరించారు. పెళ్లి తర్వాత కూడా రోహిత్, సిరి నటనలో కొనసాగుతారనే భావిస్తున్నారు.