మెగాస్టార్ సేవలకు మోదీ ప్రభుత్వం మెగా గిఫ్ట్?
మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులోను అజేయంగా సినీకెరీర్ ని కొనసాగిస్తున్నారు
By: Tupaki Desk | 18 Jan 2024 5:48 AM GMTమెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులోను అజేయంగా సినీకెరీర్ ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ నటుడిగా ప్రజల్లో ఆయన ఛరిష్మా చెక్కు చెదరలేదు. దీనికి మించి ఆయన పరిశ్రమకు పెద్దన్నగా అండగా నిలుస్తున్నారు. పైగా ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునేందుకు వెంటనే ముందుకు వస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ సేవలతో పాటు, ఆయన ఎప్పుడు ఏ విపత్తు తలెత్తినా ప్రజల్ని ఆదుకునేందుకు విరివిగా విరాళాలు ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా క్రైసిస్ సమయంలో యాభై కోట్లు పైగా ఖర్చు చేసి ప్రజల కోసం ఆక్సిజన్ సిలిండర్లు, అధునాతన ఎక్విప్ మెంట్ ని విదేశాల నుంచి రప్పించిన చిరు ఫ్యామిలీ, పరిశ్రమ కార్మికుల కోసం నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసారు. కరోనా క్రైసిస్ లో చాలా మందికి ఉదారంగా విరాళాలు అందించారు. లక్షల్లో డొనేషన్లు ఇచ్చారు.
కరోనా క్రైసిస్ సమయంలో మెగాస్టార్ ఎందరికో అండగా నిలిచి అంబులెన్స్ సేవల్ని ప్రారంభించారు. ఆక్సిజన్ సిలిండర్లను దానమిచ్చారు. రోగుల్ని ఆస్పత్రుల్లో చేర్పించి ప్రాణాల్ని కాపాడారు. అయితే చిరంజీవి ఇన్ని సేవలు చేసినా ఒక సెక్షన్ తెలుగు మీడియా దేనికీ ప్రచారం కల్పించని సంగతి తెలిసిందే. కానీ చేసిన సేవల్ని పైవాడు ఎప్పుడూ మరువడు. మనం ఇచ్చినది తిరిగి మనకు ఏదో ఒక రూపంలో కానుకగా అందుతుందని అంటారు. ఇప్పుడు అలాంటి కానుకను మెగాస్టార్ అందుకోబోతున్నారని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించే అవకాశం ఉందని సమాచారం. న్యూఢిల్లీ నుండి వచ్చిన నివేదికల ప్రకారం పద్మ పురస్కారాల జాబితాలో చిరంజీవి పేరు కూడా ఉంది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించడమే గాక.. కోవిడ్-19 మహమ్మారి సమయంలో సామాజిక సేవకు, సేవాగుణంలో గొప్ప నిబద్ధతకు కూడా ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారని తెలిసింది.
శుక్రవారం అయోధ్యలో శ్రీరామ మందిర విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. కుటుంబంతో సహా అక్కడికి వెళ్లాలని భావిస్తున్నారు. చిరంజీవికి గతంలో 2006లో పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇప్పుడు పద్మవిభూషణ్ దక్కితే అది ఆయన కీర్తి కిరీటంలో మరో మైలు రాయిగా నిలుస్తుంది. చిరంజీవి కెరీర్ 156వ సినిమాకు 'విశ్వంభర' టైటిల్ ని ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.