మోడీ బకాయి మేం కట్టేస్తాం: కాంగ్రెస్
ప్రధాని మోడీ - విపక్షం కాంగ్రెస్ .. ఒక ఒరలో ఇమడని కత్తులు.. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
By: Tupaki Desk | 28 May 2024 5:03 AM GMTప్రధాని మోడీ - విపక్షం కాంగ్రెస్ .. ఒక ఒరలో ఇమడని కత్తులు.. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఇరు పక్షాలు తీవ్రస్థాయిలో చేసుకుంటున్న విమర్శలు, వ్యక్తిగత దూషణలు అందరికీ తెలిసినవే. గాంధీల కుటుంబం టార్గెట్‌గా మోడీ పరివారం చేస్తున్న ప్రచారం కూడా తెలిసిందే. ఇక, మోడీని కూడా తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తూర్పారబడుతోంది. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు మోడీ బకాయి పడిన బిల్లును కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తానని చెబుతోంది. అంటే.. కాంగ్రెస్ పార్టీ పాలిత కర్ణాటక ప్రభుత్వం మోడీ బకాయి రూ.80.63 లక్షల బిల్లును చెల్లించేందుకు ముందుకు వచ్చింది.
గత ఏడాది ఏప్రిల్‌లో కర్ణాటకలోని మైసూర్‌లో `టైగర్ ప్రాజెక్టు`కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర అటవీ శాఖ, జాతీయ వన్యప్రాణి సంరక్షణ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. మైసూరులోని ప్రపంచ స్థాయి విలాసవంతమైన హోటల్ రాడిసన్ బ్లూలో ఆయన బస చేశారు. ఆయన ఉన్న ఒక్క రాత్రి.. ఒక్క పగలు మాత్రమే అయితే.. దీనికి గాను ఆ హోటల్ రూ.80.63 లక్షల బిల్లు వేసింది. నిజానికి ఈ కార్యక్రమం అంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అటవీ శాఖ కనుసన్నల్లోనే జరిగింది.
దీనికి సంబంధించి కేంద్రం ముందస్తు అంచనాల ప్రకారం పూర్తి ఖర్చు రూ.3 కోట్లు ఇచ్చేసింది. అయితే.. అనూహ్యంగా కార్యక్రమానికి రెండు రోజుల ముందు.. ఖర్చులు పెరిగిపోయాయి. భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వాలని.. సమాచారం దేశం మొత్తానికీ చేరవేయాలని.. అంతర్జాతీయ మీడియా ను కూడా పిలవాలని కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో ఈ ఖర్చు ఏకంగా 6.33 కోట్లకు చేరింది. కానీ... అప్పటికే రూ.3 కోట్లు ఇచ్చిన కేంద్రం .. తర్వాత..మిగిలిన సొమ్మును మాత్రం ఇవ్వలేదు. ఇదేదో మీరు చూసుకోండి అంటూ రాష్ట్ర అటవీ శాఖకు వదిలేసింది.
కానీ, అప్పటి వరకు కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ మరుసటినెలలో గద్దెదిగిపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించ లేదు. ఫలితంగా రాడిసన్ బ్లూ.. బిల్లు బకాయి పేరుకుపోయింది. ఇటీవల ఈ హోటల్.. తాము న్యాయపోరాటానికిదిగుతామని హెచ్చరించింది. అయినా.. కేంద్రం స్పందించలేదు. అయితే.. తాజాగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుస్పందించింది. హోటల్ బిల్లు వరకు తాము కట్టేస్తామని చెప్పేసింది. అంటే.. మోడీ బస చేసి బకాయి పడిన బిల్లును కాంగ్రెస్ పార్టీ(రూ.80.63 లక్షలు) చెల్లించేందుకు రెడీ అయింది.
దీనిపై అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది. ప్రధాని, రాష్ట్రపతి వంటివారు వచ్చినప్పుడు రాష్ట్ర సర్కారు వారి ఖర్చులు భరించడం సంప్రదాయమని తేల్చింది. అయితే.. ఇప్పటి వరకు ఈ సంప్రదాయం ఎందుకు పాటించలేద నేది ప్రశ్న. దీని వెనుక అసలు కారణం వేరే ఉందని చర్చ సాగుతోంది. సదరు రాడిసన్ బ్లూ హోటల్ స్థానిక కాంగ్రెస్ ఎంపీ నడుపుతున్నట్టు ప్రచారంలో ఉంది. దీంతోనే కాంగ్రెస్ పార్టీ బిల్లు చెల్లింపునకు రెడీ అయిందని అంటున్నారు.
ఒక్క రోజు కు 80.63 లక్షలా?
సాధారణంగా ఎంత ఖరీదైన హోటల్‌కైనా ఒక్క రోజుకు రూ.80.63 లక్షలు బిల్లు అవుతుందా? అంటే కాదు. కానీ, ఇక్కడ ఎందుకు అంత బిల్లు వేశారనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే.. అంతర్జాతీయ, జాతీయ మీడియా ప్రతినిధులకు, ప్రధాని వెంట వచ్చిన సిబ్బంది, భద్రతాధికారులు.. ఇతర దేశాల రాయబారులకు కూడా.. ఈ హోటల్‌లో నే బస ఏర్పాటు చేశారు. అందుకే బిల్లు భారీగా పడిందని హోటల్ వర్గాలు చెబుతుండడం గమనార్హం.