సెట్స్ మీద 9 సినిమాలు.. 2025 కెరీర్ బీజీయస్ట్ ఇయర్..!
నేడు జనవరి 20 ఆయన బర్త్ డే సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.. ఆ విశేషాలు ఏంటో చూద్దాం.
By: Tupaki Desk | 20 Jan 2025 7:59 AM GMTప్రతి ఏడాది ఒక పండగ వాతావరణంతో మొదలవుతుంది. 2025 నా కెరీర్ లోనే బిజీయెస్ట్ ఇయర్ అంటున్నారు నవరసరాయ వీకే నరేష్. ప్రపంచమంతా తెలుగు సినిమా విజయ బావుటా ఎగరవేయడం గర్వంగా ఉందని అంటున్న ఆయన ఈ టైం లో బిజీగా ఉంటూ రకరకాల పాత్రల్లో నటిస్తున్నా అని అన్నారు. థియేటర్ తో పాటు ఓటీటీ ప్రేక్షకులను అలరించడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు నరేష్ విజయ కృష్ణ. నేడు జనవరి 20 ఆయన బర్త్ డే సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.. ఆ విశేషాలు ఏంటో చూద్దాం.
ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణంతో మొదలవుతోంది. గత పదేళ్ళుగా యాక్టర్ గా మళ్ళీ మెట్టు మెట్టు ఎదుగుతూ వస్తున్నాను. వరుస విజయాలు వస్తున్నాయని అన్నారు నరేష్ వీ.కె. మొన్న బాహుబలి, నిన్న పుష్ప2, నేడు సంక్రాంతికి వస్తున్నాం..ఇలా ప్రపంచమంతటా తెలుగు సినిమా విజయ బావుటా ఎగురువేయడం గర్వకారణంగా ఉందని అన్నారు.
ఈ సంవత్సరం విడుదలైన గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం .. ఇలా అన్నీ తెలుగు సినిమాలు వంద కోట్లు దాటడం మన సక్సెస్. ప్రత్యేకంగా సంక్రాంతి వస్తున్నాం విజయం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అనిల్ రావిపూడి నా ఫేవరేట్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్ లో దిల్ రాజు గారి నిర్మాణంలో చేసిన సంక్రాంతి వస్తున్నాం మూడు వందల కోట్లు దాటుతుందని విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఇందులో చేసిన చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవడం ఆనందంగా వుంది. ఈ ఏడాది బిగ్ సక్సెస్ తో స్టార్ట్ అయ్యాను. ఈ సక్సెస్ అందరికీ కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు వీ.కె నరేష్.
నా కెరీర్ లో బీజీయస్ట్ ఇయర్ 2025. తొమ్మిది సినిమాలు ఏకకాలంలో షూటింగ్ లో ఉన్నాయి. అన్నీ అద్భుతమైన సినిమాలు. ఇందులో రెండు లీడ్ రోల్స్ చేస్తున్నాను. గత ఏడాది వచ్చిన వీరంజనేయులు విహారయాత్ర ఓటీటీలో నాకు కొత్త మార్కెట్ ని తెచ్చి పెట్టింది.
శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ హిలేరియస్ ఫిల్మ్ చేస్తున్నాం. అలాగే నారా రోహిత్ తో సుందరకాండ, ఇంద్రగంటి గారి సారంగ పాణి జాతకం, రవితేజ గారితో ఓ సినిమా చేస్తున్నాను. మారుతి రైటింగ్స్ లో బ్యూటీ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను. చాలా సినిమాలు మీ ముందుకు రాబోతున్నాయి. ప్రతి పాత్ర విభిన్నంగా వుంటుంది. సీనియర్ డైరెక్టర్స్ తో పాటు యంగ్ డైరెక్టర్స్ నా కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం ఆనందంగా వుంది. దాదాపు ఏడు సినిమాలు యువ దర్శకుల దర్శకత్వంలోనే చేస్తున్నానని అన్నారు నరేష్.
సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా 52 పూర్తి చేసుకోవడం ఆనందంగా వుంది. వృత్తిపట్ల వున్న అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణ, ప్రేక్షకుల ఆదరణ వలనే ఇది సాధ్యపడింది. ఈ సందర్భంగా నిర్మాతలకు, రచయితలకు, దర్శకులకు, ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదులు చెబుతున్నా అన్నారు.
సమాజం నాకు ఎంతో ఇచ్చింది. సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం ఇది. ఈ ఏడాది రెండు పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాను. సినిమా మ్యుజియం అండ్ లైబ్రేరీ అండ్ క్రియేటివ్ స్పెస్ ఫర్ యంగ్ పీపుల్. దీనిని శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి గారి పేరుతో ప్రారంభించాం. అందులో విజయ కృష్ణ మందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను, పవిత్ర, దీనిని ఒక మిషన్ లా తీసుకొని కళాకారుల ఐక్యవేదిక సంస్థ పేరుపైన ఈ కార్యక్రమాన్ని ప్రాంభించాం. ఆల్రెడీ ఒక బిల్డింగ్ తయారౌతోంది. దీని లైఫ్ టైం వర్క్.. దినికి సంబధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిజేస్తాం అన్నారు.
జంధ్యాల గారు, కృష్ణ గారు, విజయ నిర్మల గారు నా గురువులు. గురువు గారు జంధ్యాల గారు లేకపోతే ఈ నటుడు లేడు. నాకు సినిమాల్లో ఓనమాలు దిద్దించారు. ఆయన్ని చరిత్రలో ఒక బాగంగా వుంచాలని జంధ్యాల పేరుతో డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ థియేటర్ ప్రారంభించడం జరిగిందని అన్నారు నరేష్ వీ.కె.
జంధ్యాల గారిపై ఓ అద్భుతమైన పుస్తకం తయారు చేశాం. దీనికి సీనియర్ రైటర్ సాయినాథ్ గారు సహకరించారు. ఈ పుస్తకాన్ని అమ్మగారి పుట్టిన రోజు ఫిబ్రవరి 20న రవీంద్రభారతిలో చాలా గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నాం అన్నారు.
ఈ ఏడాది ప్రతిష్టాత్మక విజయ కృష్ణ అవార్డ్ ని అభిమానుల సమక్షంలో రిలీజ్ చేయబోతున్నాం. యోగిబేర్ కలెక్టివ్స్ వారు జంధ్యాల గారి ఉత్సవాలు జరుపుతున్నారు. వారి థియేటర్ లో జంధ్యాల గారి నాటకాలు రెండు, ఆరు సినిమాలు ప్రదర్శించనున్నారు. సినిమాల నుంచే నాకు ఎనర్జీ వస్తుంది. సినిమా నా జీవితం. ఆఖరి శ్వాస వరకూ షూటింగ్ లోనే వుండాలని కోరుకుంటానని అన్నారు నరేష్.
అమ్మ విజయ నిర్మల గారి బయోపిక్ చేయాలనే డ్రీం వుంది. అది రాయగలిగితే నేనే రాయగలుగుతాను. అలాగే చిత్రం భళారే విచిత్రం, శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలకి పార్ట్ 2 చేయాలని ఉందని అన్నారు నరేష్.