సీఎం సార్ టైటానిక్ తీరం చేరిందట!
ఈ సినిమాలో సీఎం పాత్రలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని, సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌కి చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
By: Tupaki Desk | 20 Jan 2025 6:30 AM GMT2025 సంక్రాంతి సీజన్‌లో చివరగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాలోని ప్రతి పాత్ర నవ్వు తెప్పించింది, ప్రతి పాత్రతోనూ ప్రేక్షకుడు జర్నీ చేస్తూ సినిమాను ఎంజాయ్ చేసే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించారు. సినిమా కథలో సీఎం పాత్ర చిన్నదే అయినా ఆ పాత్రలో నటించిన నరేష్ నటన, ఆయన పండించిన కామెడీని ఏ ఒక్కరూ మరచి పోలేరు. ఒక సీఎంగా నరేష్‌ని సీరియస్‌గా చూపిస్తూనే ఆయన నుంచి కామెడీని పండించాడు దర్శకుడు. సీఎం పాత్రలో నరేష్ నటన బాగుంది, సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు అనడంలో సందేహం లేదు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం నేపథ్యంలో నటుడు నరేష్ మీడియా ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సీఎం పాత్రలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని, సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌కి చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. తాను సీఎం పాత్రలో నటించడం, వీటీ గణేష్‌తో కలిసి చేసిన కామెడీకి మంచి స్పందన దక్కిందని నరేష్ అన్నారు. అదే సమయంలో రిపోర్టర్ సినిమా కెరీర్ గురించి పర్సనల్ కెరీర్ గురించి పలు విషయాలను ప్రశ్నించిన సమయంలో ఆయన సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా ఆయన పవిత్ర గురించిన అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు.
జీవితంలో వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ వరుసగా విడాకులు తీసుకున్న నరేష్ గత కొన్నాళ్లుగా పవిత్రతో సహ జీవనం సాగిస్తున్నాడు. ఆ మధ్య భార్య రమ్య నుంచి గొడవలు ఎదురైనా వాటిని ఎదుర్కొని పవిత్రతో తన సంబంధంను కొనసాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వీరిద్దరి గురించి బయటకు ఎలాంటి సమాచారం రాలేదు, అంతే కాకుండా ఎలాంటి హడావుడి లేదు. తాజాగా నరేష్ ను పవిత్ర గారితో జీవితం ఎలా సాగుతుందని ఒక రిపోర్టర్ ప్రశ్నించిన సమయంలో చాలా సంతోషంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చాడు. పర్సనల్ జీవితం చాలా సాఫీగా సాగడం వల్ల సినిమాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇంకా నటుడు నరేష్ మాట్లాడుతూ.. పవిత్రతో నా జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. సినిమా వాళ్లను కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటేనే కెరీర్‌లో ముందుకు సాగగలం. ఫ్యామిలీకి తక్కువ సమయం ఉంటుంది. ఆ విషయాన్ని వారు అర్థం చేసుకోలేక పోతే ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఇప్పుడు నా జీవిత భాగస్వామి అన్ని విషయాలను అర్థం చేసుకుంటుంది. నా అదృష్టం కొద్ది ఇండస్ట్రీకి చెందిన పవిత్ర తారసపడింది. ఆమె నా జీవితంలోకి రావడంతో ఇబ్బందులు అన్నీ తొలగి పోయినట్లుగా అనిపిస్తుంది. అంతే కాకుండా నా టైటానిక్ షిప్ తీరం చేరింది అనిపిస్తుంది అన్నారు. నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. తెలుగు లో బిజీ నటుల్లో నరేష్ ఒacకరు అనడంలో సందేహం లేదు.