బ్రెయిన్ లో గడ్డ పెట్టుకొని బిగ్ బాస్ లో రూ.కోటి గెలుచుకుంది
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నరేషీ మీనా సొంతూరు మాథోపూర్. తండ్రి రైతు. తల్లి ఇంటికే పరిమితం. మధ్యతరగతి ఫ్యామిలీ.
By: Tupaki Desk | 23 Aug 2024 4:21 AM GMTచిన్నపాటి తలనొప్పికే తల్లడిల్లిపోతాం. అలాంటిది మెదడులో కణితి పెట్టుకొని.. తల పగిలిపోయే నొప్పితో విలవిలలాడుతూ.. తన వైద్యానికి అయ్యే ఖర్చును తనకు తానే సొంతంగా సంపాదించుకోవటానికి ఒక అమ్మాయి పడిన కష్టం గురించి తెలిసినప్పుడు.. ఆమెకున్న సమస్య ముందు ఇంకెవరి సమస్య అయినా చిన్నదే అనిపించక మానదు. కౌన్ బనేగా కరోడ్ పతి తాజా సీరిస్ లో రూ.కోటి గెలుచుకున్న యూత్ ఐకాన్ లాంటి నరేషీ మీనా గురించి తెలుసుకోవాల్సిందే. ఆమె గురించి.. ఆమె కష్టం గురించి.. ఆమె లక్ష్యం గురించి తెలిస్తే.. మీ నోటి వెంట శభాష్ అన్న మాట ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తన ప్రాణాన్ని నిలబెట్టుకోవటం కోసం ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ పోరాడిన ఆమె తీరు ఆద్యంతం స్ఫూర్తిదాయం.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నరేషీ మీనా సొంతూరు మాథోపూర్. తండ్రి రైతు. తల్లి ఇంటికే పరిమితం. మధ్యతరగతి ఫ్యామిలీ. బాగా చదువుకొని కలెక్టర్ కావాలన్నది మీనా కల. అందుకోసం కష్టపడి చదివేది. ఓసారి తీవ్రమైన తలనొప్పి వచ్చింది. సర్లేనని సర్దిపుచ్చుకుంది. మందులు వాడినా తగ్గలేదు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకుంది. మెదడులో కణితి ఉందన్నారు. సర్జరీ చేయకుంటే ప్రాణానికే ప్రమాదమన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంతే. డబ్బుల కోసం ఎంతగానో ట్రై చేశారు. ఫలితం లేకపోయింది. తల్లి నగలు అమ్మి 2019లో సర్జరీ చేయించారు.
కణితి మెదడులో సున్నిత భాగంలో ఉండటంతో మూడొంతులు మాత్రమే తీశారు. మిగిలింది తీయలేదు. వీలైనంత త్వరగా తీయిస్తే మంచిదని హెచ్చరించారు. ఇందుకోసం ప్రోటాన్ థెరపీ చేయించుకోవాలన్నారు. అందుకు రూ.30లక్షలు కావాలి. ఓవైపు తలనొప్పి.. మరోవైపు రూ.30 లక్షలు.. ఇంకోవైపు సివిల్స్ సాధించాలన్న కల. ఇలాంటి వేళ.. ఇంట్లో వారికి భారం కాకూడదని జాబ్ లో చేరింది.
ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అవుతోంది. ప్రిలిమ్స్ క్లియర్ చేసింది. ఈ టైంలోనే కౌన్ బనేగా కరోడ్ పతి షో ప్రోమో చూసింది. కరెంట్ అఫైర్స్ తో వచ్చే ప్రశ్నలకు తాను సమాధానాలు ఇవ్వగలనన్న విషయం గుర్తుకొచ్చింది. వెంటనే.. దానికి అప్లై చేసింది. ఎంపికైన వేళ.. బిగ్ బీకి ఆమె గురించి తెలిసి.. ఆమె ధైర్యానికి మెచ్చుకున్నారు. షోలో గెలిచినా.. గెలవకున్నా చికిత్సకు అవసరమైన రూ.30లక్షలు ఇస్తామన్నారు. సాయం కంటే సొంతంగా సంపాదించుకోవాలన్నదే ఆమె కోరిక.
బరిలోకి దిగిన ఆమె అనుకున్నట్లే రూ.కోటి ప్రశ్నను క్లియర్ చేసింది. అంతకు మించి ముందుకు వెళ్లని.. ఆమెకు ఇప్పుడు సర్జరీ చేయించుకోవటానికి డబ్బులు చేతికి వచ్చేశాయి. ఇక.. చికిత్స తర్వాత తన స్వప్నమైన సివిల్స్ సాధించటమే ఆమె ముందున్న లక్ష్యం. ప్రాణానికే ప్రమాదమని తెలిసినా.. ఇంత ధైర్యంగా ఎలా? అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చే సమాధానం చాలా సింఫుల్.. ‘‘భయపడొద్దు.. నీకెలాంటి అనారోగ్యం లేదని రోజు నాకు నేనే చెప్పుకునేదానిని’’ అంటూ సీక్రెట్ రివీల్ చేసింది. నిజంగా గ్రేట్ కదూ?