వెయిటర్‌గా పని చేసిన నాజర్.. చిరంజీవి పిలిచినా ఆత్మాభిమానం అడ్డు!
కష్ట కాలంలో తనను మెగాస్టార్ చిరంజీవి ఆదరించారని, అభిమానంగా పిలిచారని గుర్తు చేసుకున్నారు.
By: Tupaki Desk | 2 July 2024 4:30 PM GMTసీనియర్ నటుడు నాజర్ గురించి పరిచయం అవసరం లేదు. సౌత్ సినిమాలో విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా నాజర్ అద్భుత ప్రదర్శనలతో మెప్పించారు. ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా ఉన్న ఆయన తమిళ ఆర్టిస్టుల సంఘంలోను కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. అయితే నేడు ఇంత పెద్ద ఆర్టిస్టు అయితే అయ్యాడు కానీ, కెరీర్ ఆరంభం ఆయన కూడా ఫుడ్డు కోసం లాటరీ కొట్టాల్సిన పరిస్థితి ఉండేది. అప్పటి ఆర్థిక కష్టాలను ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తలచుకుని ఎమోషనల్ అయ్యారు. కష్ట కాలంలో తనను మెగాస్టార్ చిరంజీవి ఆదరించారని, అభిమానంగా పిలిచారని గుర్తు చేసుకున్నారు.
చిరంజీవితో తనకున్న బంధాన్ని వెల్లడించిన నాజర్ మద్రాసు- ఫిలింఇనిస్టిట్యూట్ లో ఒకే బ్యాచ్ లో కలిసి నటశిక్షణ పొందామని తెలిపారు. చిరంజీవి సినీ పరిశ్రమలో తొలి విజయాన్ని చూసిన రోజులను ఇప్పుడు నాజర్ గుర్తు చేసుకున్నారు. నాజర్ అప్పుడు ఒక హోటల్‌లో పనిచేస్తున్నారు. అయితే సమీపంలో చిరంజీవి సినిమా చిత్రీకరణ జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్లాడు. సెట్ లో తనని కలిసిన నాజర్ ని ఏం చేస్తున్నావ్ ఇప్పుడు? అంటూ చిరంజీవి అడిగారు. తాను హోటల్ లో ఉద్యోగం చేస్తున్నానని నాజర్ చెప్పగానే మంచి ఆర్టిస్టు ఇలా చేయడం సరికాదని, మరుసటి రోజు తనని కలవాలని చిరంజీవి కోరారు. కానీ ఆత్మాభిమానం అడ్డొచ్చి తాను కలవలేకపోయానని నాజర్ గుర్తు చేసుకున్నారు. అయితే నెల అయ్యేసరికి జీతం అందుకుంటూ అలా గడిపేయడమే మేలని అప్పటికి అనుకున్నారట నాజర్. కానీ ఆ తర్వాతి కాలంలో బాలచందర్ సినిమాలతో నటుడిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అటుపై చరిత్ర అంతా తెలిసిందే. ఒకే బ్యాచ్ మేట్స్ అయిన చిరంజీవి- నాజర్ చెరో దారిలో వెళ్లినా నటనారంగంలోనే కొనసాగుతున్నారు. చిరంజీవి సూపర్ స్టార్ అయ్యారు. నాజర్ పరిశ్రమలో చెప్పకోదగ్గ క్యారెక్టర్ నటుడిగా ఎదిగారు. ఇద్దరూ ఎవరికి వారు బిజీ బిజీ. ఆర్జనలోను సమర్థులుగా నిరూపించారు. అయితే చిరంజీవితో తనకు మంచి స్నేహం ఉన్నప్పటికీ, వారు ఎప్పుడూ కలిసి పని చేయలేదు. ఈ వాస్తవాన్ని ఇద్దరూ అంగీకరించారు. ఖైదీ నంబర్ 150లో చిన్న పాత్ర అయినా చిరంజీవి కోసం నటించానని కూడా నాజర్ చెప్పారు.
నాజర్ చెన్నైలో తమ కళాశాల రోజుల నుండి హత్తుకునే జ్ఞాపకాన్ని కూడా వివరించాడు. షూటింగుకి వెళ్లాలంటే నాజర్ తెల్లవారుజామున రైలు ప్రయాణానికి బయలుదేరవలసి ఉంటుంది. తరచుగా తన తల్లి గారు అంత వేకువఝామునే క్యారేజీ వండాల్సి వచ్చేది. కానీ సమయానికి పూర్తి చేయడం కష్టం. దాంతో కేవలం వైట్ రైస్ మాత్రమే కట్టుకుని సెట్స్ కి వెళ్లేవాడు. అప్పట్లో చిరంజీవి తదితరులకు సమీపంలోని ఆంధ్రా మెస్ నుంచి భోజనం వచ్చేది. నాజర్ పరిస్థితి చూసిన చిరంజీవి జోక్యం చేసుకుని, అమ్మను కష్టపెట్టకు.. ఆంధ్రా మెస్ నుంచి ఏడుగురికి భోజనం వస్తోంది. మాతో పాటు కలిసి భోజనం చేసేయ్ అని సూచించారు. అలా వారితో కలిసి నాజర్ సెట్లో భోజనం చేసేవారు.
నాజర్- చిరంజీవి స్నేహం ఎంతో ఉన్నతమైనదని అతడి మాటలను బట్టి అర్థమవుతోంది. విధి ప్రకారం చెరో దారిలో వెళ్లి చివరికి ఎవరికి వారు నటులుగా ఎదిగారు. తరచుగా ఊహించని మలుపులను ఎదుర్కోవడమే జీవితం. చిత్ర పరిశ్రమలో వారి మార్గాలు వేరైనా, గొప్ప స్నేహం శాశ్వతంగా నిలిచింది. ఏ నటుడికి అయినా ప్రారంభ కష్టాలు ఇలానే ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి షూటింగుల్లో తీవ్రంగా శ్రమించి ఇంటికి వచ్చి బెడ్ పై నిదురిస్తుంటే, తన తండ్రిగారు వచ్చి తన కాళ్లకు ఉన్న షూస్ విప్పి తన నిద్ర డిస్ట్రబ్ అవ్వకుండా వెళ్లేవారని కూడా చిరంజీవి నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతగా అలసిపోయి వచ్చి చిరు నిదురించేవారు. ఎంతగానో శ్రమిస్తేనే కానీ చిరంజీవి అంతటివాడు కాలేదు.