అల్లు అర్జున్ తర్వాత చరణ్‌కి జాతీయ అవార్డ్?
ఆసక్తికరంగా డల్లాస్(అమెరికా)లో జరిగిన 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుకుమార్ ..చరణ్- శంకర్ సినిమాని ప్రశంసిస్తూ ఒక మాట అన్నారు.
By: Tupaki Desk | 24 Dec 2024 12:28 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో తన అసమాన నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి 'జాతీయ ఉత్తమ నటుడు' అవార్డు అందుకున్న హీరోగా చరిత్ర సృష్టించాడు. పుష్ప 2లోను అతడి నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. బన్ని తర్వాత ఛాన్స్ ఎవరికి ఉంటుంది? అంటే పుష్ప డైరెక్టర్ సుకుమార్ ప్రకారం... ఈసారి రామ్ చరణ్‌ని ప్రాంతీయ కేటగిరీలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ వరిస్తుందని అంచనా.
ఆసక్తికరంగా డల్లాస్(అమెరికా)లో జరిగిన 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుకుమార్ ..చరణ్- శంకర్ సినిమాని ప్రశంసిస్తూ ఒక మాట అన్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'గేమ్ ఛేంజర్' చూశానని .. ఇది ఉత్సాహం పెంచిందని మొదటి సగం, ఇంటర్వెల్ రెండూ మనసును కదిలించాయని తెలిపారు. సెకండాఫ్‌లోని ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్ తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందని అన్నారు. ఆ సీక్వెన్స్ అద్భుతం అని ప్రశంసించాడు. శంకర్ తీసిన జెంటిల్‌మేన్, భారతీయుడు సినిమాల్లో లానే 'గేమ్ ఛేంజర్'ని నేను బాగా ఎంజాయ్ చేశానని సుకుమార్ అన్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు దక్కుతుందని 'రంగస్థలం'లో చిట్టిబాబు పాత్రకు అతడు జాతీయ అవార్డుకు అర్హుడని చాలా మంది నమ్ముతారని కూడా పేర్కొన్నాడు. చరణ్‌కు గేమ్ ఛేంజర్ లో నటనకు అవార్డు వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాన్ని రేకెత్తించే పాత్రలో అద్బుతంగా నటించాడని కితాబిచ్చారు.
అవినీతి రాజకీయ వ్యవస్థలో కుళ్లుకు కడిగేయాలనే ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ ఈ చిత్రంలో నటించారు. ఇందులో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకోబోతున్నాడు. కియారా అద్వానీ కథానాయికగా నటించగా, ఎస్.జే సూర్య విలన్ పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, సముద్రఖని మరియు నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో సహా పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే.