Begin typing your search above and press return to search.

మాస్ మంత్రం జపిస్తున్న క్లాస్ హీరో?

ఏ హీరోకైనా స్టార్ డమ్ తెచ్చిపెట్టేది, ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు చేసేది, పెద్ద మార్కెట్ క్రియేట్ చేసేది.. మాస్, యాక్షన్ చిత్రాలే

By:  Tupaki Desk   |   22 July 2024 11:30 PM GMT
మాస్ మంత్రం జపిస్తున్న క్లాస్ హీరో?
X

ఏ హీరోకైనా స్టార్ డమ్ తెచ్చిపెట్టేది, ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు చేసేది, పెద్ద మార్కెట్ క్రియేట్ చేసేది.. మాస్, యాక్షన్ చిత్రాలే. అందుకే మన టాలీవుడ్ హీరోలంతా మాస్ మంత్రాన్ని జపిస్తుంటారు. ప్రతీ ఒక్కరూ మాస్ హీరోగా నిలదొక్కుకోడానికి కష్టపడుతుంటారు. కెరీర్ ప్రారంభంలో 'క్లాస్ హీరో' ఇమేజ్ తెచ్చుకున్నప్పటికీ, ఏదొక రోజు 'మాస్ హీరో' అనిపించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. చాలా కాలంగా మాస్ హీరోగా మారాలని ట్రై చేస్తున్న హీరోలలో నేచురల్ స్టార్ నాని కూడా ఉన్నారు.

'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా పరిచయమైన నాని, ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తూ వస్తున్నాడు. మినిమం గ్యారంటీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరచుకున్నాడు. టైర్-2 హీరోలలో టాప్ లో ఉన్నారు. కాకపోతే ఇప్పటి వరకూ ఎక్కువగా పక్కింటి అబ్బాయి తరహా రోల్స్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. మధ్యలో కొన్నిసార్లు మాస్ యాక్షన్ సినిమాలను ట్రై చేసినా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ.. గతేడాది 'దసరా' వంటి మాస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి చూపించాడు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'దసరా' సినిమాలో నాని తన కెరీర్ లోనే తొలిసారిగా ఊర మాస్ లుక్ లో కనిపించాడు. రా అండ్ రస్టిక్ మూవీలో డీ గ్లామరైజ్డ్ గెటప్ తో, మాస్ క్యారక్టర్ తో అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఇది బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. కానీ ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా 'హాయ్ నాన్న' మాత్రం వంద కోట్ల క్లబ్ కు చేరువ కాలేదు. దీంతో ఇప్పుడు నాని మాస్-యాక్షన్ చిత్రాలకు కమిట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

నాని ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. టైటిల్ చూసి అందరూ ఇదేదో ‘అంటే సుందరానికి’ తరహాలో క్లాస్ మూవీ అనుకుంటే.. ఫస్ట్ గ్లింప్స్, ఇటీవల విడుదలైన టీజర్ కాని టీజర్ తో ఇదొక మాస్ యాక్షన్ మూవీ అని క్లారిటీ ఇచ్చారు. అహింసావాది అయిన ఒక మామూలు మిడిల్ క్లాస్ యువకుడు, ప్రతీ శనివారం మోస్ట్ వైలెంట్ గా మారితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతునట్లు తెలుస్తోంది.

'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో నాని మరో ప్రాజెక్ట్ కమిటైన విషయం తెలిసిందే. ఇది సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే గ్యాంగ్‌స్టర్ డ్రామా అని టాక్. 'లీడర్ గా ఉండటానికి మీకు గుర్తింపు అవసరం లేదు' అంటూ నాని దీంట్లో పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్‌ ప్లే చేస్తున్నట్లు అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే స్పష్టం చేశారు. మెలితిప్పిన మీసాలలు, రఫ్ గడ్డం, నోట్లో సిగార్ తో నాని మాసీ అవతార్‌లో కనిపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు.

అలానే డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న హిట్ ఫ్రాంచైజీలో నాని నటించనున్నారు. 'హిట్ 3: థర్డ్ కేస్' అనే పేరుతో రానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నాని స్పెషల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. ఇందులో యాక్షన్ పాళ్లు ఎక్కువే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సుజిత్ దర్శకత్వంలో నాని ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఒక వైలెంట్ మ్యాన్ కొన్ని పరిస్థితుల కారణంగా నాన్ వైలెంట్ గా మారినప్పుడు అతని ప్రపంచం ఎలా తలక్రిందులు అయిందనే యూనిక్ స్టోరీ లైన్ తో ఈ సినిమా రూపొందనుంది.

ఇలా నాని వేటికవే ప్రత్యేకమైన విభిన్న చిత్రాలను చేస్తున్నారు. కానీ ఇవన్నీ చాలా వరకు మాస్, యాక్షన్-ప్యాక్డ్ సినిమాలే. ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న నాని.. రాబోయే సినిమాలతో మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇవి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మాత్రం, నాని రేంజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.