Begin typing your search above and press return to search.

పోలీస్ డ్రెస్‌లో పేకాట‌.. చిక్కుల్లో ప‌డ్డ న‌టుడు

ప్ర‌ముఖ హీరో పోలీస్ యూనిఫాం ధ‌రించి పోకర్‌(పేకాట‌)ను ప్రోత్సహిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 6:20 AM GMT
పోలీస్ డ్రెస్‌లో పేకాట‌.. చిక్కుల్లో ప‌డ్డ న‌టుడు
X

ప్ర‌ముఖ హీరో పోలీస్ యూనిఫాం ధ‌రించి పోకర్‌(పేకాట‌)ను ప్రోత్సహిస్తున్నాడు. దీంతో ఇప్పుడు అత‌డు ఊహించ‌ని చిక్కుల్లో పడ్డాడు. డిపార్ట్ మెంట్ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చాడంటూ అత‌డిపై న్యాయ‌ పోరాటానికి సిద్ధ‌మైంది ప్ర‌ముఖ హిందూ సంస్థ‌. వివ‌రాల్లోకి వెళితే....

నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇటీవల ఓ ప్రకటనతో వివాదం రేపారు. మహారాష్ట్ర పోలీసుల ప్రతిష్టను దిగజార్చారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్ర‌ముఖ‌ హిందూ సంస్థ ఆరోపించింది. జాతీయ మీడియా క‌థ‌నం ప్రకారం.. `బిగ్ క్యాష్` పోకర్ యజమాని నవాజుద్దీన్ , అంకుర్ సింగ్ ఇద్దరిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ జనజాగృతి సమితి మహారాష్ట్రలోని ముంబై పోలీస్ కమిషనర్, డైరెక్టర్ జనరల్‌కు లేఖ పంపింది.

నవాజుద్దీన్ సిద్ధిఖీ పోలీసు అధికారిగా న‌టించిన వాణిజ్య‌ ప్రకటన మహారాష్ట్ర పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆ సంస్థ ఆరోపించింది. ప్రకటనలో అతడు పేకాట ఆడాల‌ని వీక్షకులను ప్రోత్సహిస్తున్నాడు. సాంఘిక సంక్షేమ ప్రచారక‌ర్త అయిన `సురాజ్య అభియాన్` ఇప్పుడు పోలీసుల పరువు తీసినందుకు న‌టుడు న‌వాజ్ పై చర్య తీసుకోవాలని పిలుపునిచ్చింది. చట్టం అమలుకు హాని కలిగించేది ..అగౌరవపరిచేదిగా ఈ ప్ర‌క‌ట‌న ఉంద‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

సురాజ్య అభియాన్ మహారాష్ట్ర రాష్ట్ర కోఆర్డినేటర్ అభిషేక్ మురుకటే రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్- ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, అంకుర్ సింగ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మహారాష్ట్ర సివిల్ సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) రూల్స్- 1979.. మహారాష్ట్ర పోలీస్ యాక్ట్- 1951 ప్రకారం పోలీసుల పరువు తీశారని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో అభ్యర్థించారు. ఇది ఆందోళనకరమైనది ఎందుకంటే అదే పోలీసు శాఖ అటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేస్తుంది. జూదగాళ్లను అరెస్టు చేస్తుంది. హిందూ జనజాగృతి సమితికి చెందిన `సురాజ్య అభియాన్` మహారాష్ట్ర పోలీసుల ప్రతిష్టను దిగజార్చ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. దీనిని విస్మరిస్తే పోలీసు యూనిఫామ్‌లను ఉపయోగించి మరిన్ని చట్టవిరుద్ధమైన, అనైతిక ప్రకటనలకు దారితీయవచ్చు అని హిందూ సంస్థ‌ లేఖను రాసింది.

మహారాష్ట్ర పోలీసులు కష్టపడి పని చేయడం ద్వారా ఉద్యోగాలు పొందారు. వారు క‌ఠిన‌మైన‌ శిక్షణతో సాధించుకున్నారు.. అయితే ఈ ప్రకటన ఆన్‌లైన్ జూదం వారికి నైపుణ్యాలను ఇస్తుందని చెబుతోంది. ఈ ప్ర‌క‌ట‌న‌పై చర్యలు తీసుకోవాలని ఏ ఇత‌రులు ఒత్తిడి చేయకపోవడం నిరాశకు గురిచేస్తోంది. చివ‌ర‌కు మేం ఫిర్యాదులు చేయవలసి రావడం విచారకరం. మహారాష్ట్ర హోం మంత్రి కూడా ఈ విషయాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాం`` అని లేఖలో జోడించారు.