ధనుష్ కాపీరైట్ దావాపై నయన్ వాదన
డాక్యుమెంటరీ టీజర్‌ను విడుదల చేసిన సమయంలోనే ధనుష్ నుంచి నోటీసులు వచ్చాయి.
By: Tupaki Desk | 29 Nov 2024 5:52 AM GMTలేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ్ స్టార్ ధనుష్‌ల మధ్య కాపీరైట్ వివాదం మరింత దూరం వెళ్లింది. తన డాక్యుమెంటరీ 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' లో ధనుష్ నిర్మించిన 'నానుమ్ రౌడీ దాన్' విజువల్స్‌ను ఉపయోగించారు అనేది వివాదం. ధనుష్ నుంచి అనుమతి తీసుకోకుండానే ఆయన సినిమాకు సంబంధించిన విజువల్స్‌ను వినియోగించడం జరిగింది. ఇది పెద్ద వివాదంగా మారింది. డాక్యుమెంటరీ టీజర్‌ను విడుదల చేసిన సమయంలోనే ధనుష్ నుంచి నోటీసులు వచ్చాయి. తన అనుమతి లేకుండా తన విజువల్స్‌ను ఉపయోగించినందుకు గాను రూ.10 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం జరిగింది.
ధనుష్ ఇచ్చిన నోటీసులకు నయనతార చాలా సీరియస్‌గా స్పందించింది. ధనుష్‌ను ఏకంగా వ్యక్తిగతంగా నింధించడంతో పాటు, తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఇద్దరికి మధ్య జరుగుతున్న వివాదం గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. నోటీసులు పంపించినా నయనతార డాక్యుమెంటరీ నుంచి ఆ షాట్స్‌ను తొలగించక పోవడంతో మద్రాస్ హైకోర్టును ధనుష్ ఆశ్రయించారు. కాపీరైట్ దావా వేయడం జరిగింది. దాంతో వీరిద్దరి మధ్య వివాదం మరింత ముందుకు వెళ్లింది. ఇద్దరి వివాదం నేపథ్యంలో తమిళ సినిమా ఇండస్ట్రీగా రెండుగా విడిపోయి ఒక వర్గం ధనుష్‌కి, ఒక వర్గం నయనతారకి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు.
నయనతార రూ.10 కోట్లు చెల్లించాల్సిందే అంటూ ధనుష్ దావా వేయడం జరిగింది. దావాలో హీరోయిన్ నయనతార పేరుతో పాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఇంకా వారి నిర్మాణ సంస్థ పై కేసును బుక్ చేయడం జరిగింది. దావా పై నయనతార స్పందించాల్సి ఉంది. నయనతార తరపు లాయర్ తాజాగా మీడియా ముందుకు వచ్చి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ... డాక్యుమెంటరీలో ఉపయోగించిన విజువల్స్ సినిమాలోని సీన్స్ కావు, అవి బీటీఎస్‌కు సంబంధించినవి. మొబైల్ ద్వారా తీసుకున్న ఆ విజువల్స్‌కి సినిమాకు సంబంధం లేవు. అవి వ్యక్తిగత విజువల్స్ కాబట్టి ఇందులో కాపీ రైట్ ఉల్లంఘన ఏమీ లేదు. కనుక అవతలి వారి దావాను కోర్టు కొట్టి వేస్తుందని తాము భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.
డిసెంబర్ 2న ఈ కేసు తదుపరి విచారణ ఉంటుంది. నయనతార వర్గం మాత్రం చాలా సీరియస్‌గా ఈ కేసు విషయంలో పట్టుదలతో ఉంది. అదే సమయంలో ధనుష్ వర్గం సైతం అనుమతి లేకుండా విజువల్స్‌ను వినియోగించినందుకు గాను కచ్చితంగా రూ.10 కోట్ల పరిహారం చెల్లించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ధనుష్, నయనతార వివాదం నేపథ్యంలో ముందు ముందు మరిన్ని కాపీరైట్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.