నయనతార పనికి రాదన్నాడట!
బాలీవుడ్ హీరోయిన్స్ స్థాయిలో పారితోషికం తీసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నయనతార లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌ను సొంతం చేసుకుంది
By: Tupaki Desk | 15 March 2025 11:26 AM ISTనయనతార ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్. బాలీవుడ్ హీరోయిన్స్ స్థాయిలో పారితోషికం తీసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నయనతార లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌ను సొంతం చేసుకుంది. తనను లేడీ సూపర్ స్టార్ అంటూ పిలవద్దని స్వయంగా ఆమె విజ్ఞప్తి చేసినా కూడా ఫ్యాన్స్ మాత్రం ఆమెను అలాగే పిలుస్తూ ఉంటారు. ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల పారితోషికం తీసుకుంటూ సౌత్‌లోనే స్టార్ హీరోయిన్‌గా నిలిచిన నయనతార కెరీర్ ఆరంభంలో తీవ్ర ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొందట. ముఖ్యంగా ఒక సినిమా దర్శకుడు సెట్‌కి వెళ్తే అవమానించి వెనక్కి పంపించాడట.
కోలీవుడ్ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం అయిన నయనతార మొదటి సినిమా పార్ధిబన్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. సినిమాలో ముఖ్య పాత్రకు ఎంపిక అయిన నయనతార కొన్ని కారణాల వల్ల షూటింగ్‌కి ఆలస్యం అయింది. నయనతార చెప్పిన టైంకి వెళ్లక పోవడంతో పార్ధిబన్‌కి కోపం వచ్చింది. ఇంకా సినిమాల్లో నటించకుండానే ఇంత పొగరు ఏంటి, షూటింగ్‌కి ఇంత ఆలస్యం అయితే ఎలా అంటూ ఆమె మొహం మీదే మీరు ఈ సినిమాకు అక్కర్లేదు వెళ్లిపోండి అని వెనక్కి పంపించేశాడట. దాంతో ఆమె ఆ సినిమాలో ఎంపిక అయి నటించకుండానే వెనక్కి వెళ్లి పోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నయనతార చాలా బాధను అనుభవించిందట.
పార్ధిబన్ తన సినిమా నుంచి తప్పించిన కొన్నాళ్లకే నయనతారకు అదృష్టం కొద్ది హరి దర్శకత్వంలో నటించే అవకాశం దక్కించుకుంది. సీనియర్ నటుడు శరత్ కుమార్ హీరోగా నటించిన 'అయ్యా' సినిమాతో నయనతార ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా మొదటి రోజు షూటింగ్ అనుభవాన్ని నటుడు శరత్ కుమార్ ఇటీవల ఒక కార్యక్రమంలో షేర్ చేశారు. దర్శకుడు హరి మొదటి రోజు నయనతారను మోడ్రన్ డ్రెస్‌లో చూసి ఈమె మన సినిమాకు సెట్ కాదు, వెంటనే బయటకు పంపించేయండి అంటూ తన టీం మెంబర్స్‌తో అన్నాడు. కానీ సాయంత్రం వరకు ఆమెను అక్కడే ఉంచి మరో డ్రెస్‌లో, కాస్త విభిన్నమైన మేకోవర్‌తో హరి ముందు ఉంచితే అప్పుడు ఆయన ఓకే అన్నాడు.
మొదటి సినిమా చేయడం కోసం చాలా కష్టపడ్డ నయనతార ఆ వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రముఖి సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. చంద్రముఖి సినిమా తర్వాత నయనతార వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కేవలం తమిళ్‌లో మాత్రమే కాకుండా తెలుగు, హిందీ భాషల సినిమాల్లోనూ నటించడం ద్వారా స్టార్ హీరోయిన్‌గా, పాన్ ఇండియా స్టార్‌గా పేరు సొంతం చేసుకుంది. పెళ్లి చేసుకుని, ఇద్దర పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా నయనతార కెరీర్‌లో చాలా బిజీగా ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు హీరో ఓరియంటెడ్ సినిమాల్లో కమర్షియల్ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంది. ఏడాదికి రెండు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా నయన్ బిజీగా ఉంది. కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టంకు ప్రతిఫలంగా ఇప్పుడు ఆమె లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌ను ఎంజాయ్ చేస్తుంది.