లేడీ సూపర్ స్టార్ అని పిలవద్దు, కంఫర్ట్ గా ఉండలేకపోతున్నా: నయనతార
భారత చలన చిత్ర రంగంలో హిరో హీరోయిన్లకు వారి పేరు ముందు ప్రత్యేక ట్యాగ్‌లు ఉండడం మామూలే.
By: Tupaki Desk | 5 March 2025 11:12 AM ISTభారత చలన చిత్ర రంగంలో హిరో హీరోయిన్లకు వారి పేరు ముందు ప్రత్యేక ట్యాగ్‌లు ఉండడం మామూలే. ఎన్నో సినిమాలు చేసి ఆడియన్స్ ను అలరిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటున్న నయనతారను ఆమె అభిమానులు లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక అసలు విషయానికొస్తే నయనతార ఎప్పుడూ ఏదో విషయంలో వార్తల్లోనే ఉంటుంది.
మొన్నా మధ్య ధనుష్ తో గొడవ, కోర్టు కేసుల విషయంలో వార్తల్లో నిలిచిన నయన్, ఇప్పుడు తనను అభిమానులు ప్రేమగా పిలుచుకునే లేడీ సూపర్ స్టార్ అనే పేరుతో పిలవొద్దని చెప్తూ ఓ బహిరంగ లేఖ రాసి దాని ద్వారా వార్తల్లో నిలిచింది. ఆ పేరుతో కంఫర్ట్ గా ఉండలేనని, దయచేసి తనను అలా పిలవొద్దని నయన్ కోరింది.
నటిగా తన జర్నీలో, సక్సెస్‌లో, తను కష్టాల్లో ఉన్నప్పుడు తనకు తోడుగా ఉన్న అందరికీ థ్యాంక్స్ చెప్పిన నయనతార, తన లైఫ్ ఓపెన్ బుక్ అని, అభిమానుల ప్రేమతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఫ్యాన్స్ లో చాలామంది తనను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తున్నారని, తనపై ప్రేమ, అభిమానంతో అలా పిలవడం తనకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నప్పటికీ తనను నయనతార అని మాత్రమే పిలవాలని అభిమానులను లేఖ ద్వారా కోరింది.
నయనతార పేరు తన గుండెకు చాలా దగ్గరగా ఉంటుందని, ఆ పేరే తనెవరో తనకు తెలియచేస్తూ ఉంటుందని, బిరుదులు, పొగడ్తలు, ప్రశంసలు వెలకట్టలేనివని, కానీ కొన్నిసార్లు అవి మనల్ని కంఫర్ట్ గా ఉండనీయవని నయనతార తెలిపింది. ఎప్పటికీ ఆడియన్స్, ఫ్యాన్స్ సపోర్ట్ తనకుంటుందని నమ్ముతున్నట్టు చెప్పిన నయన్, తానెప్పుడూ కష్టపడుతూనే ఉంటానని, సినిమా మనందర్నీ ఒకటిగా ఉంచుతుందని, నయనతార ఎప్పటికీ నయనతారనే అని లెటర్ లో రాసుకొచ్చింది నయన్.
అయితే గతంలో తమిళ స్టార్ హీరో అజిత్ తనను తలా అని పిలవొద్దని చెప్తూ, తనకున్న అఫీషియల్ ఫ్యాన్స్ క్లబ్ ను కూడా రద్దు చేయగా, కమల్ హాసన్ కూడా తనకు ఉలగనాయగన్ అనే ట్యాగ్ తో పిలవొద్దని చెప్పారు. ఇప్పుడు అదే క్లబ్ లోకి నయనతార కూడా జాయినై తనను తన పేరుతో మాత్రమే పిలవాలని, లేడీ సూపర్ స్టార్ అని పిలవొద్దని ఫ్యాన్స్ కు పిలుపునిచ్చింది.