Begin typing your search above and press return to search.

'వడ్డీతో సహా తిరిగి వస్తుంది'.. నయనతార ఇన్‌స్టా పోస్ట్ వైరల్!

ఈ నేపథ్యంలో తాజాగా నయన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ పెట్టిన ఓ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   29 Nov 2024 11:15 AM GMT
వడ్డీతో సహా తిరిగి వస్తుంది.. నయనతార ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
X

ధనుష్, నయనతార మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ విజువల్స్‌ను ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో నయన్, విఘ్నేష్ శివన్ దంపతులపై ధనుష్‌ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నయన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ పెట్టిన ఓ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

''అబద్ధాలతో ఒకరి జీవితాన్ని నాశనం చేసినప్పుడు, దానిని మీరు అప్పుగా భావించండి.. అది మీకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది'' అని కర్మ చెబుతోంది అని నయనతార శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఇక్కడ ఆమె ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, ప్రస్తుతం కొనసాగుతున్న వివాదాన్ని బట్టి చూస్తే ధనుష్ ను ఉద్దేశించే నయన్ ఈ పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతోంది.

నెట్ ఫ్లిక్స్ ‘బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’లో ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ సినిమాకు సంబంధించిన ఫుటేజ్‌ను ఉపయోగించుకోడానికి ధనుష్ పర్మిషన్ ఇవ్వలేదని ఆరోపిస్తూ, నయనతార ఇటీవల బహిరంగ లేఖ రాసింది. డాక్యుమెంటరీ ట్రైలర్‌లో 3 సెకన్ల బీటీఎస్ విజువల్స్ వాడినందుకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్‌ చేస్తూ ధనుష్ తమకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ధనుష్‌ క్యారెక్టర్‌ను తప్పుబడుతూ.. రెండేళ్లు తిప్పుకొని ఎన్ఓసీ ఇవ్వలేదని, తమపై ద్వేషం కనబరుస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ ఇష్యూపై ధనుష్ స్పందించలేదు. లీగల్ గానే ఎదుర్కొంటారని ఆయన తరపు లాయర్లు తెలిపారు.

నెట్‌ఫ్లిక్స్ లో 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్‌' డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కు వచ్చిన తర్వాత, 'నానుమ్ రౌడీ ధాన్'లోని క్లిప్‌లను అనధికారికంగా ఉపయోగించారని ధనుష్ తన నిర్మాణ సంస్థ తరపున మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. నయన్‌ దంపతులతోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్‌పై దావా వేశారు. దీనిపై నవంబర్ 27న కోర్టులో విచారణ జరిగింది. నయనతార, విఘ్నేష్ శివన్ లపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ధనుష్‌ వేసిన పిటిషన్ పై నయనతార తరఫు లాయర్‌ రాహుల్ ధావన్ స్పందించారు. ‘నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ విషయంలో ఎలాంటి కాపీరైట్ చట్టాలను ఉల్లంఘన జరగలేదని పేర్కొన్నారు. డాక్యుమెంటరీలో ఉపయోగించబడిన విజువల్స్‌ సినిమాలోవి కావని, తమ క్లయింట్ వ్యక్తిగత లైబ్రరీ నుండి వచ్చిన బీటీఎస్‌ క్లిప్పింగ్స్ అని స్పష్టం చేశారు. వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆ విజువల్స్ తో సంబంధం లేదని, కాబట్టి అది ఉల్లంఘన కిందకు రాదని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ డిసెంబర్‌ 2న జరగనుంది.

ధనుష్ తో వివాదాన్ని లీగల్ గానే తేల్చుకుంటామని నయనతార తన ఓపెన్ లెటర్ లో పేర్కొంది. ''లీగల్ నోటీసుకు మేము చట్టబద్ధమైన మార్గాల ద్వారానే తగిన విధంగా సమాధానం ఇస్తాం. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం ‘నానుమ్ రౌడీ దాన్’ ఎలిమెంట్స్ ఉపయోగించడం కోసం మీరు ఎన్‌వోసీ ఇవ్వడానికి నిరాకరించడాన్ని కాపీరైట్ కోణంలో న్యాయస్థానం మిమ్మల్ని సమర్థించవచ్చు. కానీ దేవుని న్యాయస్థానంలో దీనికి నైతిక కోణం అనేది ఒకటి ఉంటుందని గుర్తు చేయాలనుకుంటున్నా'' అని నయన్ లేఖలో రాశారు. పబ్లిక్ లో ఉన్న బీటీఎస్ విజువల్స్ మూడు సెకండ్లు వాడినందుకు పది కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసు పంపించారని, ధనుష్ ఇంతలా దిగజారిపోతాడని విమర్శలు చేసింది. ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీశాయి.