స్టార్ హీరోయిన్ మూవీ డైరెక్ట్ ఓటీటీ!
థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలో చూసే అవకాశంను కల్పిస్తున్నారు.
By: Tupaki Desk | 7 March 2025 3:00 AM ISTకరోనా సమయంలో చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. చిన్న హీరోల సినిమాల నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు చాలా సినిమాలే ఓటీటీలో నేరుగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే గత రెండు మూడు సంవత్సరాల్లో ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ అనేది తక్కువ అయింది. బాలీవుడ్ సినిమాలు ఓటీటీలో కొన్ని నేరుగా విడుదల అవుతున్నా సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు, తమిళ్ భాషల్లో పెద్ద స్టార్స్‌తో రూపొందిన సినిమాలు మాత్రం ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ కావడం లేదు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలో చూసే అవకాశంను కల్పిస్తున్నారు.
చాలా రోజుల తర్వాత ఒక పెద్ద స్టార్ కాస్ట్ మూవీ నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. నయనతార, మాధవన్, సిద్దార్థ్ ముఖ్య పాత్రల్లో నటించిన తమిళ్ మూవీ 'టెస్ట్'ను ఏప్రిల్ 4న డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. ఎస్ శశికాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై తమిళ్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన టెస్ట్ సినిమాలో నయనతార పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని, ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
శశికాంత్, చక్రవర్తి రామచంద్ర సంయుక్తంగా నిర్మించిన 'టెస్ట్' సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. నయనతార గతంలో నటించిన రెండు మూడు సినిమాలు సైతం ఓటీటీ ద్వారా నేరుగా విడుదల అయిన విషయం తెల్సిందే. నయనతార సినిమాలకు ఓటీటీ లో మంచి స్పందన ఉంది. గతంలో నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సినిమాలతో ఓటీటీలు లబ్ది పొందాయని, అందుకే టెస్ట్ సినిమాను సైతం నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారంటూ తమిళ్ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అన్నపూరణి సినిమా తర్వాత నయనతార నుంచి రాబోతున్న లేడీ ఓరియంటెడ్ సినిమా కావడంతో పాటు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమా ఇదే. నెట్‌ఫ్లిక్స్ ఈమధ్య కాలంలో కంటెంట్ ఎంపిక చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెల్సిందే. టెస్ట్ సినిమాకు భారీ మొత్తాన్ని ఖర్చు చేసి మరీ నెట్‌ఫ్లిక్స్ వారు కొనుగోలు చేశారని కోలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈమధ్య కాలంలో ఓ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు దక్కని రేటు ఈ సినిమాకు దక్కిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. నయన్ గత చిత్రాల ఫలితం నేపథ్యంలో టెస్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి.