Begin typing your search above and press return to search.

నయనతారకు ఇది అసలైన 'టెస్ట్'

ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘టెస్ట్’ సినిమా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   16 March 2025 12:05 PM IST
నయనతారకు ఇది అసలైన టెస్ట్
X

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార తన కెరీర్‌ను కొత్త దశలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకాదరణ పొందిన నయన్, ఇప్పుడు OTT లో కూడా తన ప్రాబల్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘టెస్ట్’ సినిమా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రం ఒక సాధారణ మహిళ జీవితాన్ని ఆధారంగా తీసుకొని, అనుకోని సంఘటనలు ఆమెను ఎలా మార్చేశాయనేదాని చుట్టూ తిరుగుతుంది. తమిళ సినిమాగా రూపొందించినప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఇది పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి రావడం వల్ల విస్తృత స్థాయిలో ప్రేక్షకాదరణ పొందే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా కథ, నయనతార పాత్రకు సంబంధించిన టీజర్ ప్రేక్షకులను ఆకర్షించింది.

నయనతార బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి షారుక్ ఖాన్ సరసన ‘జవాన్’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు మంచి స్పందన వచ్చినప్పటికీ, ఆ ఊపును కొనసాగించలేకపోయింది. ఉత్తరాది మార్కెట్‌లో తన స్థాయిని మరింత పెంచుకోవడానికి పెద్దగా అవకాశాలు రాలేదు. పైగా, ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతోపాటు, నయనతార తన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విషయంలో చిక్కుల్లో పడింది.

ధనుష్ నిర్మాణ సంస్థకు చెందిన కొన్ని క్లిప్‌లను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ కేసు వేయడం ఆమెకు కొత్త చిక్కులను తీసుకువచ్చింది. ధనుష్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ‘టెస్ట్’ అనే చిత్రం నయనతారకు కొంత ఊరట ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఇందులో ఆమె ‘కుమిధా’ అనే ఒక సాధారణమైన మహిళ పాత్రను పోషిస్తోంది. ఈ పాత్రను చేయడం తనకు ఓ కొత్త అనుభవంగా అనిపించిందని, ఆ పాత్రలో పూర్తిగా మమేకమైపోయానని నయనతార చెబుతోంది.

ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందనేది ఏప్రిల్ 4న విడుదలైన తర్వాతే తెలుస్తుంది. అయితే నయనతార గత సినిమాల పరాజయాల నుంచి బయటపడటానికి ఇది మంచి అవకాశం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నయనతార ఇప్పటివరకు ఎక్కువగా థియేట్రికల్ రిలీజ్‌లకే పరిమితం అయింది. కానీ ఇప్పుడు OTT లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. థియేటర్లలో విజయం సాధించలేకపోతున్నా, OTT ద్వారా విస్తృత స్థాయిలో ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఇక, ఈ సినిమా నయనతార కోసం ఎంత వరకు ఉపయోగపడుతుందనేది చూడాలి.