చిరంజీవి, రామ్ చరణ్ లకు థ్యాంక్స్ చెప్పిన నయనతార!
ఈ డాక్యుమెంటరీ తీయడానికి సహకరించిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూ నయనతార సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
By: Tupaki Desk | 21 Nov 2024 7:14 AM GMTదక్షిణాది అగ్ర కథానాయిక నయనతార జీవితం మీద నెట్ ఫ్లిక్స్ సంస్థ రూపొందించిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. ఇటీవలే నయన్ 40వ బర్త్ డే స్పెషల్ గా ఈ ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చింది. ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంలోని కీలకమైన విషయాలను ఈ చిత్రంలో అందంగా చూపించారు. ఈ డాక్యుమెంటరీ తీయడానికి సహకరించిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూ నయనతార సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
''20 ఏళ్ళ నా కెరీర్‌లో నేను సంపాదించిన అత్యంత విలువైన విషయం ఏమిటంటే నేను పనిచేసిన వారి నుండి నాకు లభించిన ఫ్రెండ్ షిప్, ప్రేమ, గౌరవం. ఈ ప్రయత్నంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన నిర్మాతలందరికీ వారి ఆదరాభిమానాలు ఔదార్యానికి ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'' అని నయనతార తన ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంది. టాలీవుడ్‌లోని పలువురు నిర్మాతలతో పాటు చిరంజీవి, రామ్ చరణ్‌లకు కృతజ్ఞతలు తెలిపింది. వీరంతా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తన డాక్యుమెంటరీకి అనుమతి ఇచ్చారని చెప్పింది.
''మా డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' ఇప్పుడు విడుదలైంది. నేను పని చేసిన ప్రతి చిత్రానికి నా జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సినిమాల్లో నా ప్రయాణం లెక్కలేనన్ని ఆనందకరమైన క్షణాలను అందించింది. వీటిలో చాలా సినిమాలు నా మనసుకు బాగా దగ్గరయ్యాయి. ఆ జ్ఞాపకాలను, సన్నివేశాలను మా డాక్యుమెంటరీలో చేర్చాలని భావించి.. నేను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొందేందుకు నిర్మాతలను సంప్రదించాను. వారు సందేహించకుండా, ఆలస్యం చేయకుండా ఎన్ఓసీ మంజూరు చేసారు. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను''
''నా అత్యంత విలువైన ప్రొఫెషనల్ మూమెంట్స్ ను భాగస్వామ్యం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి క్షణాల్లో మీరు అందించిన మద్దతు నన్ను తీవ్రంగా కదిలించింది. నేను ఎల్లప్పుడూ అపారమైన కృతజ్ఞతతో మిమ్మల్ని గౌరవిస్తాను. ఎప్పుడూ ఇతరుల ఆనందంలో ఆనందాన్ని వెతుక్కుంటూ మన ప్రయాణం ముందుకు కొనసాగాలి'' అంటూ నయనతార తన నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది. నయన్ పేర్కొన్న నిర్మాతల్లో 'సైరా నరసింహా రెడ్డి' చిత్రాన్ని నిర్మించిన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. అలానే 'బాస్' ప్రొడ్యూసర్ డి. శివ ప్రసాద్ రెడ్డి, 'కృష్ణం వందే జగద్గురుమ్' నిర్మాత యలమంచలి సాయి బాబులు టాలీవుడ్ నుంచి ఉన్నారు.
బాలీవుడ్ లో 'జవాన్' మూవీని నిర్మించిన షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ లకు నయన్ కృతఙ్ఞతలు తెలిపింది. కె. బాలచందర్, ఏఆర్ మురగదాస్, కేఈ జ్ఞానవేల్ రాజా, ఉదయనిధి స్టాలిన్, డ్రీం వారియర్స్ ఎస్ఆర్ ప్రభులతో పాటు పలువురు తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నిర్మాతలు ఈ జాబితాలో ఉన్నారు. అయితే హీరో ధనుష్ తనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదనే విషయాన్ని దెప్పి పొడవడాని, మరోసారి గుర్తు చేయడానికే నయనతార సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
'బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’కు సంబంధించిన విజువల్స్ వాడుకోడానికి నిర్మాత ధనుష్ అనుమతి ఇవ్వలేదంటూ ఇటీవల నయనతార తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. మూడు సెకన్ల బీటీఎస్ క్లిప్స్ ట్రైలర్‌లో వాడుకున్నందుకు రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశారని ఆమె ఆరోపించింది. తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన సినిమా పాటలు, సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో లేకపోవడం బాధ కలిగించిందని పేర్కొంటూ.. ధనుష్ క్యారక్టర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. దీనిపై ధనుష్ స్పందించలేదు. ఇప్పుడు నయన్ తన డాక్యుమెంటరీకి సపోర్టుగా నిలిచిన నిర్మాతలకు థాంక్స్ చెప్పడంతో మరోసారి ఈ వివాదం చర్చకు వచ్చింది.