నయన్ ఈ కొత్త వ్యాపారం ఏంటో తెలుసా?
తాజా సమాచారం మేరకు నయన్ తన సొంత కాస్మెటిక్ బ్రాండ్‌ను తాజాగా ప్రారంభించింది. నయన్ బ్రాండ్ పేరు '9 స్కిన్'.
By: Tupaki Desk | 28 Sep 2023 4:26 AM GMTభారతదేశంలో పాపులర్ బ్రాండ్ల విక్రయాలకు సెలబ్రిటీల ప్రమోషన్ రెగ్యులర్ గా చూసేదే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తారలు నేరుగా వ్యాపారాల్లో ప్రవేశించి గొప్పగా రాణించడం చర్చకు వస్తోంది. బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, షాహిద్ కపూర్, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, టాలీవుడ్ క్వీన్ సమంత లతో పాటు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, శిఖర్ ధావన్ వంటి క్రికెటర్లు బ్రాండ్‌లకు ముఖచిత్రంగా మారుతున్నారు. అంతేకాదు.. వీరంతా నేరుగా ఆయా వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. కొందరు సొంతంగా కంపెనీలనే స్థాపిస్తున్నారు. ఇప్పుడు నయన్ వంతు.
సౌత్ లో తలైవిగా పిలుపందుకున్న ఏకైక నటి నయనతార. తలైవి అంటే నాయకి అని అర్థం. ఎంపిక చేసుకున్న రంగంలో నయనతార నంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. సుమారు 200 కోట్లు పైగా ఆస్తులను సంపాదించిన నయన్ అలియాస్ డయానా మరియం ఇప్పుడు వ్యాపార రంగంలోను రాణిస్తోంది. ఇప్పటికే తన భర్తతో కలిసి సినీనిర్మాతగా కొనసాగుతోంది. అలాగే విదేశాల్లో పలు వ్యాపారాల్లోను నయనతార పెట్టుబడులు ఉన్నాయి.
తాజా సమాచారం మేరకు నయన్ తన సొంత కాస్మెటిక్ బ్రాండ్‌ను తాజాగా ప్రారంభించింది. నయన్ బ్రాండ్ పేరు '9 స్కిన్'. వాణిజ్య ప్రకటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 9 స్కిన్ అనేది ఒక సౌందర్య సాధనం.
సీరమ్‌లు క్రీములతో ప్రత్యేక శ్రేణి ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతుంది. నయన్ చాలా కాలంగా తన సొంత బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాలని కోరుకుంది. ఎట్టకేలకు ఆశించినది సాధించుకుంది. ఈ బ్రాండ్ కోసం కోట్లాది రూపాయల పెట్టుబడుల్ని నయన్ వెదజల్లిందని సమాచారం.
నయన్ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తోంది. వార్షికాదాయం రకరకాల మార్గోల్లో ఉంది. పారితోషికాలు, బ్రాండ్ కాంట్రాక్టులు, వ్యాపారాల రూపంలో ధనలక్ష్మి నయనతారను వరిస్తోంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న బ్యూటీ ఉత్పత్తుల రంగంలో తెలివిగా పెట్టుబడి పెడుతోంది. నయనతార నటించిన తాజా చిత్రం 'జవాన్' 1000 కోట్ల మార్క్‌ను తాకింది. ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక వ్యక్తిగతంగా విఘ్నేష్ శివన్ తో లవ్ లైఫ్ లో హ్యాపీగా ఉన్న నయన్ తన కవల కుమారుల ముఖాలను ఇటీవల రివీల్ చేసింది.