కళాత్మక చిత్రాల దర్శకుడు భన్సాలీతో నయనతార!
ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం.. నయనతార తదుపరి దేశం దృష్టిని తనవైపునకు తిప్పుకునే స్థాయి ఉన్న కళాత్మక చిత్రంలో నటించే అవకాశం ఉంది.
By: Tupaki Desk | 10 Oct 2023 3:59 AM GMTసౌతిండియా సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలే బాలీవుడ్ లో 'జవాన్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంగేట్రమే 1000 కోట్ల క్లబ్ సినిమాలో నటించి సత్తా చాటింది. ఈ చిత్రంలో నయన్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. పోరాట సన్నివేశాల్లో మెప్పించింది. ఇప్పుడు హిందీ చిత్రసీమలో మరో క్రేజీ ప్రాజెక్టుకి నయన్ సంతకం చేయనుందని తెలిసింది.
ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం.. నయనతార తదుపరి దేశం దృష్టిని తనవైపునకు తిప్పుకునే స్థాయి ఉన్న కళాత్మక చిత్రంలో నటించే అవకాశం ఉంది. బాలీవుడ్‌లో తన రెండో సినిమా కోసం ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న మ్యూజికల్ పీరియడ్ డ్రామా 'బైజు బావ్రా'లో నయన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందనేది తాజా సమాచారం. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ టైటిల్ రోల్ బైజు బావ్రాగా నటించనుండగా, ఈ మ్యూజికల్ పీరియడ్ డ్రామాలో జాతీయ అవార్డు గ్రహీత అలియా భట్ కథానాయికగా నటించనుంది. ఆలియా పాత్రకు ధీటుగా ఆకర్షించే ఓ కీలక పాత్ర కోసం నయన్ ని సంప్రదించారనేది గుసగుస.
రణవీర్-అలియా జంటగా నటించే ఈ చిత్రంలో నయన్ పాత్ర ఎలా ఉంటుంది? అన్నదానిపై ఎలాంటి అప్ డేట్ లేదు. బైజు బావ్రా దర్శకనిర్మాతలు ఇప్పటికే నయన్ ని సంప్రదించారని మాత్రమే తెలుసు. ఇరువైపులా ప్రస్తుతం నిబంధనలు షరతులపై ఆలోచిస్తున్నారు. నయనతార -విఘ్నేష్ శివన్ 2023 మార్చిలో సంజయ్ లీలా భన్సాలీని కలిసి ఒక సినిమా కోసం చర్చించారని కథనాలొచ్చాయి. అది బైజు బావ్రా కోసమేనని ఇప్పుడు అర్థమవుతోంది. తాజా పరిణామంతో రణవీర్ సింగ్ - అలియా భట్‌లతో పాటు బైజు బావ్రా లో నయన్ నటించేందుకు మెజారిటీ అవకాశాలున్నాయని భావించాలి.
బైజు బావ్రా కథాంశం కాలాదులు ఆసక్తికరం. 1950ల నాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుని నిజ జీవితంపై సినిమా ఇది. ఇందులో రణవీర్ సింగ్ టైటిల్ రోల్‌లో నటిస్తారు. సంజయ్ లీలా భన్సాలీతో రణవీర్ కి ఇది నాలుగో సినిమా. గల్లీ బాయ్ -రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ తర్వాత అలియా భట్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. దీంతో ఈ జంట మూడోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ 2024 ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.