NBK111: హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తున్న బాలయ్య!
నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'భగవంత్ కేసరి'. గతేడాది దసరాకి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా పెరఫార్మ్ చేసింది.
By: Tupaki Desk | 29 Oct 2024 2:45 AM GMTనటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'భగవంత్ కేసరి'. గతేడాది దసరాకి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా పెరఫార్మ్ చేసింది. పలు అవార్డులు రివార్డులు కూడా సాధించింది. అయితే తనకు మంచి విజయాన్ని అందించిన అనిల్ రావిపూడితో మరోసారి చేతులు కలపడానికి బాలయ్య రెడీ అవుతున్నారని తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
బాలకృష్ణ ఇటీవల కాలంలో వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉండగానే మరో చిత్రానికి కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'NBK 109' (సర్కార్ సీతారామ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది) సినిమాలో నటిస్తున్న బాలయ్య.. ఈ మధ్యనే బోయపాటి శ్రీనుతో 'అఖండ 2: తాండవం' చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇదే క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరో మూవీ చేస్తారని, ఇది బాలయ్య కెరీర్ లో 111వ సినిమా అవుతుందని టాక్ వినిపిస్తోంది.
'NBK 111' గురించి ఆల్రెడీ బాలయ్య - అనిల్ ల మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు. దీనికి హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. 'భగవంత్ కేసరి' ను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో బాలకృష్ణ సినిమా ఉండొచ్చని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు తెర మీదకు వచ్చింది. ఇప్పటికైతే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ, ఈ కాంబినేషన్ సెట్ అయితే బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో వంద శాతం విజయాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు అనిల్ రావిపూడి. ఆయనతో సినిమా చేస్తే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకాన్ని అందరిలో గలిగించారు. 'భగవంత్ కేసరి' చిత్రంలో బాలయ్యను వయసుకు తగ్గ మాస్ పాత్రలో, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ప్రెజెంట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు ఆయనతో తెలంగాణా స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పించి ఫ్యాన్స్ తో చప్పట్లు కొట్టించుకున్నారు. అందుకే మరోసారి అనిల్ - బాలకృష్ణ కలయికలో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
హిట్ కాంబినేషన్స్ ను రిపీట్ చేయడం నందమూరి బాలకృష్ణకు అలవాటే. ఒకసారి ఆయనతో కలిసి సక్సెస్ సాధించిన దర్శకులతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. ఇప్పటికే 'సింహా' 'లెజెండ్' 'అఖండ' లాంటి విజయవంతమైన సినిమాలు అందించిన బోయపాటి శ్రీనుతో 'అఖండ 2' ప్రాజెక్ట్ చేస్తున్నారు. 'వీర సింహా రెడ్డి' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో ఇంకో సినిమా చేయడానికి కమిట్ అయ్యారనే టాక్ ఉంది. ఇప్పుడు అనిల్ రావిపూడితోనూ మళ్లీ జట్టు కట్టబోతున్నారనే మాట వినిపిస్తోంది.
'అన్ స్టాపబుల్' షో కోసం తనతో వర్క్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ క్యామియో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వెంకటేష్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బిజీగా ఉన్నారు అనిల్ రావిపూడి. దీని తర్వాత బాలయ్య స్క్రిప్ట్ మీద వర్క్ స్టార్ట్ చేయనున్నారు. మరి త్వరలోనే 'NBK 111' చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.