వీడియో : 35 నీలి మేఘముల...!
తాజాగా మరో పాటను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.
By: Tupaki Desk | 29 Aug 2024 4:30 AM GMTవిశ్వదేవ్ హీరోగా నివేదా థామస్ హీరోయిన్ గా నంద కిషోర్ ఈమని దర్శకత్వంలో రూపొందిన '35 - చిన్న కథ కాదు' సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. రానా సమర్పణలో సెప్టెంబర్ 6న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, గ్లిమ్స్ ఇంకా ప్రమోషన్ వీడియోలు సినిమా పై ఆసక్తిని పెంచాయి. రానా ఈ సినిమా పై ప్రత్యేక శ్రద్ద కనబర్చి సమర్పించేందుకు ఓకే చెప్పడంతో సినిమా పై ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు, ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా మరో పాటను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.
వివేక్ సాగర్ స్వరపరిచిన నీలి మేఘముల పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. పాట ఆరంభంలో టాలీవుడ్ లెజెండ్స్ ప్రముఖ రచయిత సిరివెన్నెల, ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్, ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు నివాళ్లు అంటూ సిరివెన్నెల కలం+విశ్వనాథుని చిత్రం+బాలు గళం = తెలుగుదనం అంటూ స్లైడ్ వేయడం జరిగింది. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగుదనం నిండిన ఈ పాటను విడుదల చేయడం అభినందనీయం అంటూ సోషల్ మీడియా లో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నీలి మేఘముల అంటూ మనోహరంగా సాగుతున్న ఈ పాట ప్రస్తుతం మెల్ల మెల్లగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సాహిత్యంలోనే కాకుండా లిరికల్ వీడయోలో కూడా తెలుగుదనం ఉట్టిపడినట్లుగా కనిపిస్తుంది. సినిమా మొత్తం కూడా చాలా అహ్లాదకరంగా ఉంటుందని ఈ పాట లిరికల్ వీడియో చూస్తూ ఉంటే అనిపిస్తుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతున్న విషయం తెల్సిందే. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా తెలుగు ప్రేక్షకుల మద్దతు పొందుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
నటిగా ఇప్పటికే మంచి మార్కులు సొంతం చేసుకున్న నివేదా థామస్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం తో పాటు రానా దగ్గుబాటి ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేయడం వల్ల కూడా సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. నీలి మేఘముల పాటతో సినిమా స్థాయి మరింత పెంచారు. భరద్వాజ్ గాలి సాహిత్యం అందించగా, వివేక్ సాగర్ సంగీత సారధ్యంలో పృథ్వీ హరీష్ గాత్రం తో ఈ పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 35 - చిన్న కథ కాదు అనే విభిన్నమైన టైటిల్ వల్ల కూడా సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి సినిమాకు ముందస్తుగా వచ్చిన బజ్ స్థాయిలో విడుదల తర్వాత టాక్ ఉంటుందా అనేది చూడాలి.