రోజుకు 10 గం.లు ఒంటరిగా ఉంటాను.. జిమ్‌లో ఏడుస్తాను.. గాయని డిప్రెషన్!
తన టీనేజ్ సమయం నుండి పిఎండిడితో ఇబ్బంది పడుతున్నానని నేహా భాసిన్ వెల్లడించింది.
By: Tupaki Desk | 23 Nov 2024 3:52 AM GMTప్రముఖ గాయని నేహా భాసిన్ పరిచయం అవసరం లేదు. తెలుగు-తమిళం-హిందీలో పలు చార్ట్ బస్టర్ సాంగ్స్ ఆలపించిన నేహా జీవతంలో ఒత్తిళ్లు, అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రీమెన్‌స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ (PMDD), మానసిక ఆరోగ్య సవాళ్లు, బాడీ షేమింగ్‌తో పోరాటాల గురించి భావోద్వేగ నోట్ రాసారు. వైద్యం, ఎక్సర్‌సైజులు, మంచి అలవాట్లతో వీటన్నిటి నుంచి కోలుకున్న తనకు అభిమానులు, సహచరులు మద్దతుగా నిలిచారని తెలిపింది.
తన టీనేజ్ సమయం నుండి పిఎండిడితో ఇబ్బంది పడుతున్నానని నేహా భాసిన్ వెల్లడించింది. 2022లో తనకు ప్రొజెస్టెరాన్ తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది తన ఆరోగ్యాన్ని మరింత ప్రభావితం చేసింది. కొన్నేళ్లుగా ఎలాంటి మందులు అవసరం లేకుండా తన పరిస్థితిని మేనేజ్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ పరిస్థితి మరింత దిగజారింది. ముఖ్యంగా 2024లో ''ఇబ్బందికర స్థితిలో లేచి జీవించడానికి నెలకు 15 రోజులు కష్టపడుతున్నాను'' అని నేహా చెప్పింది. తన పరిస్థితి అయోమయంగా ఉంది. అలసట, తిమ్మిర్లు, నిస్పృహ వంటి తీవ్రమైన శారీరక మానసిక భావోద్వేగ సవాళ్లను ఎదుర్కొన్నాన''ని నేహా తెలిపారు. ఈ అనారోగ్య సమస్యను మేనేజ్ చేసేందుకు అధిక మోతాదులో ప్రొజెస్టెరాన్, ఎస్ఎస్ఆర్ ఐలు (సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్) తీసుకున్నట్లు తెలిపింది.
నేహా తన మానసిక ఆరోగ్య పోరాటం గురించి ఓపెనైంది. సంగీతం, జీవితం, స్నేహితుల విషయంలో మక్కువను కోల్పోయానని వెల్లడించింది. నేహా బాడీ ఇమేజ్ సమస్యలు, బాడీ డిస్మోర్ఫియా, అతిగా తినే సమస్యను కలిగి ఉన్నానని తెలిపింది. నిజానికి మందుల కారణంగా బరువు పెరిగింది. దీంతో నిరంతరం బాడీ షేమింగ్‌కు గురవుతుంది. నేను నిరాశగా ఉన్నాను. నిరంతరం శరీర నొప్పితో ఉన్నాను. నేను జిమ్‌లో కూర్చుని ఏడుస్తాను అని రాసారు. స్టిల్ ఫోటోగ్రాఫర్లు, ఇతరులు తన రూపంపై సెటైర్లు వేసారని, అపహాస్యం చేసారని నేహా భాసిన్ ఆవేదన చెందారు.
నేను యుద్ధంలో పోరాడుతున్నాను.. ఈ సంవత్సరం నేను నిజంగా యుద్ధం చేయనని అనుకున్నాను. చీకటిగా అనిపించింది. నేను రోజుకు 10 గంటలు ఒంటరిగా చీకటిలో కూర్చుంటాను.. అని తనలోని సంఘర్షణను బయటపెట్టింది నేహా. చీకటి ఎంత ఉన్నా తన ప్రియమైనవారి నుండి తనకు లభించిన మద్దతుకు నేహా కృతజ్ఞతలు తెలిపింది. భయాందోళనల సమయంలో అపరిచితులు తనను ఓదార్చినప్పటి అనుభవాల గురించి మాట్లాడింది. జీవితంలో చెడ్డ రోజులు ఉన్నాయి, కానీ నేను ఎదుర్కోవడం, ఆశించడం నేర్చుకుంటున్నాను. ముందుగా నన్ను నేను అంగీకరించడం నేర్చుకుంటున్నానని,తన పరిస్థితి తెచ్చే సవాళ్లతో జీవించడం నేర్చుకుంటున్నానని చెప్పింది. దయ, కరుణను పెంపొందించమని ఇతరులను ప్రోత్సహించింది. ఈ ప్రపంచం ప్రేమతో పెరుగుతుంది. ప్రేమించండి .. ప్రేమించనివ్వండి అని రాసింది. ఎలాంటి దాపరికం లేకుండా తన వ్యక్తిగత పోరాటాల గురించి మాట్లాడినందుకు గాయని ధైర్యాన్ని నెటిజనులు ప్రశంసిస్తున్నారు.
ప్రముఖ గాయని, మాజీ రియాలిటీ షో స్టార్ నేహా భాసిన్ హిందీ- తెలుగు చిత్రసీమలో చార్ట్ టాపింగ్ హిట్ నంబర్లను అందించింది. ముఖ్యంగా హిందీ 'బిగ్ బాస్ OTT'లో తన అద్భుతమైన వ్యక్తిత్వంతో నేహా అభిమానులను ఆకర్షించారు. నేహా బోల్డ్ అండ్ గ్లామరస్ సోషల్ మీడియాలలో యాక్టివ్ గా ఉన్నారు.
పాపులర్ 'ఆల్-గర్ల్స్ పాప్ గ్రూప్ వివా'తో తన కెరీర్‌ను ప్రారంభించిన నేహా భాసిన్ హిందీ, తెలుగు, పంజాబీ సహా పలు భాషల్లో చార్ట్‌బస్టర్ పాటల్ని ఆలపించింది. నేహా ఆలపించిన పాపులర్ ట్రాక్‌లలో మేరే బ్రదర్ కి దుల్హన్, చష్నీ (భారత్), జగ్ ఘూమేయా (సుల్తాన్) ధుంకీ ఉన్నాయి. బిగ్ బాస్ 15 మరియు 2021లో బిగ్ బాస్ OTTలో కూడా నేహా భాగమైంది. నేహా భాసిన్ పాట 'ఊట్ పంతంగి'తో స్పాటిఫై ఆర్టిస్ట్‌గా ఎంపికైంది. టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్ పైనా పాపులర్ స్టార్ గా అలరించింది.
టాలీవుడ్‌లో ప్రయాణం...
నేహా భాసిన్ తెలుగులోను అద్భుతమైన పాటల్ని ఆలపించింది. 2009లో విడుదలైన కరెంట్ (సుశాంత్ హీరో) సినిమాలోని చార్ట్ బస్టర్ సాంగ్ 'అటు నువ్వే ఇటు నువ్వే' పాటను నేహా ఆలపించింది. ఆవ్ తుజే మోగ్ కోర్తా అంటూ '1 -నేనొక్కడినే'లో ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని నేహా ఆలపించింది. 2011 లో విడుదలైన ఊసరవెల్లిలో నిహారిక సాంగ్ ని నేహా పాడింది. జనతా గ్యారేజ్ లో హిట్ ట్రాక్ యాపిల్ బ్యూటీని ఆలపించింది నేహా. జై లవ కుశ లో స్వింగ్ జర.... డ్రీమ్ లవర్ చిత్రంలో హెలో హెల్లో పాటను నేహా భాసిన్ ఆలపించారు.