నటి చేసిన దానికి ప్రధానిపై దాడి?
ప్రముఖ బాలీవుడ్ కథానాయిక దీపిక పదుకొనే తన స్వీయానుభవాలను మరోసారి బహిరంగంగా తెలిపారు.
By: Tupaki Desk | 14 Feb 2025 5:51 AM GMTపరీక్షల సమయంలో పిల్లల మానసిక ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చొరవకు ప్రశంసలు కురుస్తున్నాయి. పరీక్ష ఫెయిలయ్యామని ఆత్మహత్యలు చేసుకునేవారు కొందరైతే, న్యూనతతో బాధపడేవారు, టెన్షన్స్ కి గురయ్యేవారు ఎందరో. పరీక్షలే సర్వస్వం అనుకుని జీవితాన్ని త్యాగం చేసే చాలా మంది అమాయక విద్యార్థులకు సరైన మార్గనిర్ధేశనం అవసరాన్ని గుర్తించింది ప్రభుత్వం.
దీనికోసం 'పరీక్ష పే చర్చ' పేరుతో భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నం ప్రశంసలు అందుకుంది. ఈ చర్చలో పలువురు సెలబ్రిటీలు పాల్గొని పరీక్షల టెన్షన్స్ , వర్రీస్ గురించి, వాటి నుంచి బయపడేందుకు మార్గాల గురించి చర్చించారు. ప్రముఖ బాలీవుడ్ కథానాయిక దీపిక పదుకొనే తన స్వీయానుభవాలను మరోసారి బహిరంగంగా తెలిపారు. బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న పాఠశాల పిల్లలతో ముచ్చటిస్తూ.. ఆ వయసులో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్థావించింది. ఒకేసారి బహుముఖ పాత్రలు పోషించడం ఒత్తిళ్లతో కూడుకున్నదని, తాను కొన్నిసార్లు చాలా నిరాశ చెందానని తెలిపింది. మొదట్లో అసలు సమస్యను అర్థం చేసుకోలేకపోవడం సమస్యకు కారణమైంది. కాల క్రమంలో డిప్రెషన్ కి గురయ్యానని గ్రహించింది. అలాగే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల గురించి ఓపెనైంది.
అయితే ఇలాంటి వ్యక్తిగత కలతల గురించి విద్యార్థులతో ముచ్చటించడం సరికాదని, వారిలో మరింత ఆందోళనలు పెంచుతుందని పలువురు విమర్శించారు. బాధ కలిగించేవి పిల్లలకు చెప్పకూడదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే కొందరు ఈ టాపిక్ తో సంబంధం లేని విషయాలను తవ్వి తీసారు. పరీక్ష పే చర్చకు దీపిక లాంటి ఒక బాలీవుడ్ నటి కాకుండా, మానసిక నిపుణులైన వైద్యులను పిలవాల్సిందని సూచించారు. మరికొందరు ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను ఆహ్వానించడాన్ని తప్పు పడుతూ రాజకీయం చేసారు.
అయితే చాలా మంది నిజాలు ఏమిటో పిల్లలకు కూడా తెలియాలని, దీపిక చేసినదాంట్లో తప్పేమీ లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అనుభవాలను తెలుసుకోవడం ద్వారా పిల్లలకు వాటి నుంచి ఎలా బయటపడాలో అవగతమవుతుందని అన్నారు. సెలబ్రిటీల కారణంగా వేగంగా విషయాలు బయటి ప్రపంచానికి చేరువవుతాయని పలువురు విశ్లేషించారు. ఇలాంటివి రాజకీయం చేయడం తగదని సూచించారు.