Begin typing your search above and press return to search.

జైల‌ర్ 2.. మామ అల్లుళ్ల‌ను క‌లుపుతున్న డైరెక్ట‌ర్

తాజాగా ఇండియాగ్లిట్జ్ తమిళ్ నివేదిక ప్రకారం.. రజనీకాంత్ చిత్రం జైలర్ 2 లో ధనుష్‌ని నటింప‌జేయాల‌ని నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 5:34 AM GMT
జైల‌ర్ 2.. మామ అల్లుళ్ల‌ను క‌లుపుతున్న డైరెక్ట‌ర్
X

నెల్సన్ దిలీప్‌కుమార్ తమిళ చిత్రసీమలోని అత్యుత్తమ దర్శకులలో ఒకడిగా వెలుగుతున్నాడు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి గ్రేట్ కంబ్యాక్ హిట్ ఇచ్చిన ఘ‌న‌త నెల్స‌న్‌కే ద‌క్కుతుంది. చాలా ప‌రాజ‌యాల త‌ర్వాత ర‌జ‌నీకి పెద్ద ఊర‌ట‌నిచ్చిన సినిమా జైల‌ర్. అందుకే నెల్సన్‌కి ఆయ‌న వ‌రుస‌గా అవ‌కాశాలిస్తున్నారు. జైల‌ర్ 500 కోట్ల క్ల‌బ్ సినిమాగా రికార్డుల‌కెక్కింది. జైలర్ మెగా బాక్సాఫీస్ విజయం దృష్ట్యా నెల్సన్ దిలీప్‌కుమార్ 'జైలర్ 2' కోసం పని చేస్తున్నారు. దర్శకుడు నెల్స‌న్ సీక్వెల్‌పై పని చేస్తున్నట్లు ప‌లుమార్లు క‌థ‌నాలు వ‌చ్చాయి.

తాజాగా ఇండియాగ్లిట్జ్ తమిళ్ నివేదిక ప్రకారం.. రజనీకాంత్ చిత్రం జైలర్ 2 లో ధనుష్‌ని నటింప‌జేయాల‌ని నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఒకే సినిమా కోసం మామ అల్లుళ్ల‌ను క‌లిపే వ్యూహాన్ని అనుస‌రిస్తున్నాడ‌ట‌. 'జైలర్'లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్‌ల లాంటి దిగ్గ‌జాలు అతిథి పాత్రలు పోషించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ సీక్వెల్ లోను వారిని న‌టింప‌జేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. వారితో పాటు ధనుష్ కోసం ఒక పాత్రను సిద్ధం చేశార‌ని తెలిసింది. ఇప్ప‌టికే ధ‌నుష్ ఎంపిక విష‌య‌మై రజనీకాంత్ నుండి అనుమతి పొందినట్లు క‌థ‌నాలొస్తున్నాయి.

మామా అల్లుళ్లు అయిన‌ రజనీకాంత్ -ధనుష్ ని ఒకే ఫ్రేమ్‌లో వీక్షించేందుకు అభిమానులు ఆస‌క్తిగా ఉన్నారు. అయితే ధనుష్ తన బిజీ షెడ్యూళ్ల‌ మధ్య 'జైలర్ 2' షూటింగ్ కోసం డేట్ ఇస్తాడో లేదో వేచి చూడాల్సి ఉంది. ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి వీరాభిమాని. ఇటీవల చెన్నైలోని ఓ థియేటర్‌లో అభిమానులతో కలిసి 'వెట్టయన్' మూవీని వీక్షించి ఆనందం వెలిబుచ్చాడు. నెల్సన్ దిలీప్‌కుమార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను 'జైలర్ 2' ముహూర్తపు పూజకు ఆహ్వానించాలని కూడా యోచిస్తున్న‌ట్టు తెలిసింది. ఈ వేడుక‌లో మాజీ భర్త ధనుష్‌తో ఐశ్వ‌ర్య క‌లుస్తార‌ని కూడా ఊహిస్తున్నారు.

లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ 'కూలీ' పూర్తి చేసిన తర్వాత 'జైలర్ 2' సెట్స్ పైకి వెళుతుంద‌ని అంచనా. కొన్ని వారాల క్రితమే రజనీకాంత్‌కి శస్త్ర చికిత్స జరగడంతో 'కూలీ' షూటింగ్ ఆగిపోయింది. త్వరలో ఆయన పనిని ప్రారంభించే అవకాశం ఉంది. కూలీ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి ర‌జ‌నీ త‌దుప‌రి జైల‌ర్ 2లో న‌టించే అవ‌కాశం ఉంది.