Begin typing your search above and press return to search.

స్కామ్‌: వామ్మోవ్ నెట్‌ఫ్లిక్స్ డూప్లికేట్ జెట్‌ఫ్లిక్స్

మార్కెట్లో స్కామ్‌లు బ‌హురూపాల్లో బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అధునాత‌న‌ ప్ర‌పంచంలో కల్తీల‌కు, కాపీల‌కు కొద‌వేమీ లేదు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 6:55 AM GMT
స్కామ్‌: వామ్మోవ్ నెట్‌ఫ్లిక్స్ డూప్లికేట్ జెట్‌ఫ్లిక్స్
X

మార్కెట్లో స్కామ్‌లు బ‌హురూపాల్లో బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అధునాత‌న‌ ప్ర‌పంచంలో కల్తీల‌కు, కాపీల‌కు కొద‌వేమీ లేదు. అచ్చం ఒరిజిన‌ల్ బ్రాండ్ ని త‌ల‌పించే మ‌రో డూప్లికేట్ బ్రాండ్ పుట్టించ‌డం రెగ్యుల‌ర్‌గా చూస్తున్న‌వే. ప‌ప్పులు ఉప్పులు ఆయిల్ ప్యాకెట్ల నుంచి ప్ర‌తిదీ డూప్లికేట్ స‌రుకులు మార్కెట్లో ప్ర‌జ‌ల్ని ధ‌గా చేస్తున్నాయి. కోటా బియ్యాన్ని పాలిష్ కొట్టి బ్రాండెడ్ బియ్యం బ‌స్తాల్లో అమ్మేస్తున్న దారుణ వ్యాపారుల్ని చూస్తున్నాం. ఇక ఇన్ స్టాలు, ఫేస్ బుక్ ల‌లో ఫేక్ ఐడీల‌తో సంపాదించే ప్ర‌బుద్ధుల‌కు కొద‌వేమీ లేదు. అన్ని రంగాల్లోనే ఫేక్ లు రాజ్య‌మేలుతున్నాయి.

ఇప్పుడు ఇంచుమించు అలాంటి కాపీ స్కామే కానీ ఇది పెద్ద రేంజు స్కామ్. దీనిని కాపీ అనాలో క‌ల్తీ అనాలో అర్థం కాదు కానీ... నెట్ ఫ్లిక్స్ స్థానంలో జెట్ ఫ్లిక్స్ ని పాపుల‌ర్ చేసి ఏకంగా 40 కోట్లు పైగా సంపాదించేశాడ‌ట స‌ద‌రు ప్ర‌బుద్ధులు. చివ‌రికి ఓటీటీల‌కు కూడా డూప్లికేట్లు చేసి కోట్లు కొల్ల‌గొట్టేస్తున్నారంటే ఇది ఏ త‌ర‌హా స్కామ్ అనాలో మీరే చెప్పండి. న‌యా స్కామ్ వివ‌రాల్లోకి వెళితే...

నెట్‌ఫ్లిక్స్ త‌ర‌హాలో చట్టవిరుద్ధమైన స్ట్రీమింగ్ సర్వీస్ అయిన జెట్‌ఫ్లిక్స్‌ని సృష్టించి వినియోగ‌దారుల నుంచి డ‌బ్బు సంపాదించిన‌ ఐదుగురు వ్యక్తులు అమెరిక‌న్ కోర్టులో దోషులుగా నిర్ధారించబడ్డారు. క్రిస్టోఫర్ డాల్‌మాన్, డగ్లస్ కోర్సన్, ఫెలిపే గార్సియా, జారెడ్ జౌరేకీ , పీటర్ హుబెర్ లాస్ వేగాస్‌లో కాపీరైట్ ఉల్లంఘన సంబంధిత నేరాల‌కు పాల్పడ్డారు. డాల్‌మాన్ ఇప్ప‌టికే మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కేవ‌లం నెలవారీ రుసుము కేవ‌లం 9.99 డాల‌ర్ల‌తో 10వేల సినిమాలు, 1,83,000 టీవీ ఎపిసోడ్‌లు అందించ‌డం ఈ స్కీమ్ లో ఉంది.

ఈ స్కామ్ లో ఇప్పుడు జెట్ ఫ్లిక్స్ దిగ్గ‌జ ఓటీటీల‌నే త‌ల‌ద‌న్నిందంటే నోటిపై వేలు వేసుకోవాల్సిందే. నెట్‌ఫ్లిక్స్, హులు, వుడు మరియు అమెజాన్ ప్రైమ్ కంటే పెద్ద లైబ్రరీని జెట్ ఫ్లిక్స్ సేకరించిందని అమెరికా న్యాయ‌కోవిదులు వివ‌రాల్ని వెలువ‌రించ‌డం షాకిస్తోంది. పైరేట్ వెబ్‌సైట్‌ల బెడ‌ద‌తో భార‌తీయ సినీప‌రిశ్ర‌మ ఏటేటా వంద‌ల కోట్లు న‌ష్ట‌పోతోంది. ఇది కూడా అలాంటి స్కామ్ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. త‌మిళ రాక‌ర్స్ టొరెంట్ మాదిరిగానే ఒరిజిన‌ల్ ఓటీటీల నుంచి ఎపిసోడ్స్ ని నిమిషాల్లోనే కాపీ చేసి జెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసేస్తోంది. కాపీరైట్ ఫిర్యాదులు, చెల్లింపు సమస్యల నుండి తప్పించుకోవడానికి వారు జెట్‌ఫ్లిక్స్‌ను ఏవియేషన్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా జెట్ ఫ్లిక్స్ ని మార్చారు. ఆ త‌ర్వాత కంపెనీ భారీ లాభాలను ఆర్జించింది.

జెట్‌ఫ్లిక్స్ కేవలం ఒక సంవత్సరంలో 7.5ల‌క్ష‌ల డాల‌ర్లు సంపాదించిందని క్రిస్టోఫర్ డాల్‌మాన్ ఆన్‌లైన్ చాట్‌లో గొప్పగా చెప్పినట్లు కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి గడిచిన ప‌దేళ్ల‌లో జెట్ ఫ్లిక్స్ మోసాల‌ను నెట్ ఫ్లిక్స్ క‌నిపెట్ట‌లేక‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ ప‌దేళ్ల‌లోనే సుల‌భంగా జెట్ ఫ్లిక్స్ 5 మిలియన్ డాల‌ర్లు ఆర్జించి ఉండొచ్చ‌ని అంచనా. అయితే ఎఫ్‌బిఐ 2016లోనే ఈ కేసుపై ద‌ర్యాప్తు ప్రారంభ‌మైనా కానీ కంపెనీని మూయించ‌డానికి 2019 వ‌ర‌కూ వేచి చూడాల్సి వ‌చ్చింది. ఈ కేసులో డాల్‌మాన్ 48-సంవత్సరాల జైలు శిక్షను అనుభ‌వించాల్సి ఉంటుంద‌ని తెలుస్తోంది. మిగిలిన వారికి 5 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది.