సహాయ నటుడే అని తీసిపారేస్తే..!
అప్పుడే అంత పెద్ద వెబ్ సిరీస్‌లో లీడ్ పాత్రలో నెట్టుకురాగలడా? అంటూ యువనటుడు సిద్ధాంత్ చతుర్వేదిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు.
By: Tupaki Desk | 15 Dec 2024 3:30 AM GMTఒకరి సామర్థ్యాన్ని ఒకే కోణంలో అంచనా వేయడం సరికాదు. వీలున్న అన్ని కోణాల్లో పరిశీలించి.. లెక్కలు వేసి ఫైనల్ గా ఒక అంచనాకు రావాలి. కానీ నెటిజనులకు అలాంటివేవీ పట్టవు. అతడు ఇంకా సహాయనటుడే కదా.. అప్పుడే అంత పెద్ద వెబ్ సిరీస్‌లో లీడ్ పాత్రలో నెట్టుకురాగలడా? అంటూ యువనటుడు సిద్ధాంత్ చతుర్వేదిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఒక నటుడిగా అతడి శక్తి సామర్థ్యాల గురించి ప్రశ్నిస్తున్నారు.
ఇదంతా ఏ ప్రాజెక్ట్ గురించి? అంటే.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా రూపొందించనున్న క్రియేచర్ ఫిల్మ్ జానర్ ఓటీటీ సినిమా కోసం కథానాయకుడిగా సిద్ధాంత్ చతుర్వేదిని ఎంపిక చేసుకుంది. తేరే బిన్ లాడెన్ డెడ్ ఆర్ ఎలైవ్, ది జోయా ఫ్యాక్టర్ లాంటి సినిమాలను రూపొందించిన నేహా శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సిద్ధాంత్ చతుర్వేది ని ఒక పాత్ర కోసం ఫైనల్ చేయగా, మరో హీరోని కూడా ఎంపిక చేయాల్సి ఉంది.
అయితే సిద్ధాంత్ ఎంపికపై నెటిజనులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అతడు ట్యాలెంటెడ్ నటుడే అయినా కానీ, ఇంత పెద్ద ప్రాజెక్టును సజావుగా ముందుకు నడిపించగలడా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అతడు సహాయ నటుడిగా రాణిస్తున్నాడు.. అయితే సూపర్ స్టార్ చేయాల్సిన సినిమాని అతడు లీడ్ చేయగలడా? అని ఒక నెటిజన్ సందేహం వ్యక్తం చేసాడు. నెట్ ఫ్లిక్స్ రిస్క్ చేస్తోందని కొందరు వ్యాఖ్యానించినా కానీ, సిద్ధాంత్ నటప్రతిభను ప్రశంసించే వారు లేకపోలేదు. నిజానికి సిద్ధాంత్ ఇప్పటికే నిరూపించుకున్న నటుడు. గల్లీ బోయ్స్, గెహ్రయాన్, ఫోన్ బూత్, బంటీ ఔర్ బబ్లీ2 వంటి చిత్రాల్లో ఉత్తమ నటప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.