జైల్లో VIP ట్రీట్‌మెంట్.. దర్శన్‌పై కొత్త ఛార్జిషీట్
జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ పొందుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్ తూగుదీప వీడియో వైరల్ కావడంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుండి దర్శన్ తూగుదీపను మార్చారు.
By: Tupaki Desk | 3 Oct 2024 7:07 AM GMTవివాదాస్పద కన్నడ నటుడు దర్శన్ తూగుదీప తన అభిమాని రేణుకా స్వామిని దారుణంగా హత్య చేసారని ఆరోపణలు రావడంతో ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా ఈ కేసులో మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌పై పోలీసులు త్వరలో మరో ఛార్జిషీట్ సమర్పించనున్నట్లు సమాచారం. ఏషియానెట్ న్యూస్‌బుల్ (కన్నడ)లో వచ్చిన కథనం ప్రకారం.. ఇటీవల సంచలనం సృష్టించిన పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ప్రత్యేక సౌకర్యాలు వీఐపీ ట్రీట్ మెంట్ కేసుకు సంబంధించి కన్నడ హీరో దర్శన్, గ్యాంగ్‌స్టర్ నాగరాజ్, మరో గ్యాంగ్‌స్టర్‌పైనా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు.
ఇంకా దర్శన్ తూగుదీపను వీఐపీ ట్రీట్‌మెంట్‌పై ఒక జైలు నుండి బళ్లారి జైలుకు తరలించిన తర్వాత దర్యాప్తులో ఆరోపణలకు మద్దతు ఇచ్చే ఆధారాలు లభించాయని, జైలు అధికారులు ఈ చర్యకు సహకరిస్తున్నారని ధృవీకరించారని కథనాలు వచ్చాయి. అంతేకాకుండా సిటీ సబ్ డివిజన్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తును పాక్షికంగా పూర్తి చేసి, కోర్టులో ఛార్జిషీటును సమర్పించడానికి తుది సన్నాహాలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పోలీసులు ఛార్జిషీట్ ను, పేర్ల జాబితాను సమీక్ష కోసం న్యాయ నిపుణులకు అందించారు జడ్జిల అభిప్రాయాన్ని పొందిన తర్వాత వారు తుది చర్య తీసుకుంటారు.
జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ పొందుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్ తూగుదీప వీడియో వైరల్ కావడంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుండి దర్శన్ తూగుదీపను మార్చారు. జైలు లాన్‌లో గ్యాంగ్‌స్టర్ నాగరాజ్, అలియాస్ విల్సన్ గార్డెన్ నాగాతో శాండల్‌వుడ్ స్టార్ దర్శన్ క్యాజువల్‌గా సిగరెట్ తాగుతున్నట్లు వైరల్ ఫోటోలో కనిపించింది. విల్సన్ గార్డెన్ నాగ గ్యాంగ్‌స్టర్ సిద్ధాపురా మహేశ్‌ను హత్య చేయడంలో అతని పాత్రకు సంబంధించి కర్ణాటక కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్, 2000 కింద కేసు నమోదైందని పేర్కొనడం గమనార్హం.
ఇంతకుముందు విడుదలైన మరో వీడియోలో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు లో ఒకరు వీడియో కాల్ చేస్తూ కనిపించాడు. 25 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి పసుపు రంగు టీ-షర్ట్ ధరించి కాల్ చేస్తున్నాడు. దర్శన్ అప్పుడు ఆ సీన్ లో కనిపించాడు.
ఈ ఫోటో , వీడియో ఆన్‌లైన్‌లో కనిపించిన వెంటనే హత్య నిందితుడైన నటుడు దర్శన్‌ని బళ్లారి జైలుకు తరలించారు. అంతేకాదు.. అతడిని తరలించిన తర్వాత జైలులో సిగరెట్‌లు, ఫోన్‌లు, కత్తులు తదితరాలు ఉన్నట్లు సోదాల్లో నిర్ధారించారు.