Begin typing your search above and press return to search.

అవ‌కాశాల కోసం రెండేళ్ల పాటూ ఆఫీసుల చుట్టూ తిరిగా: నిధి అగ‌ర్వాల్

ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా న‌టించే అవ‌కాశం అందుకుంది ల‌క్కీ గర్ల్ నిధి అగ‌ర్వాల్.

By:  Tupaki Desk   |   2 Feb 2025 6:49 AM GMT
అవ‌కాశాల కోసం రెండేళ్ల పాటూ ఆఫీసుల చుట్టూ తిరిగా: నిధి అగ‌ర్వాల్
X

టాలీవుడ్ ఆడియ‌న్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న హరిహ‌ర వీర‌మ‌ల్లు, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేస్తున్న హ‌ర్ర‌ర్ కామెడీ ది రాజా సాబ్. ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా న‌టించే అవ‌కాశం అందుకుంది ల‌క్కీ గర్ల్ నిధి అగ‌ర్వాల్. ఈ రెండు సినిమాలూ పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కుతున్న‌వే.

అయితే నిధి అంత ఈజీగా హీరోయిన్ అయిపోలేద‌ట‌. చిన్న‌ప్ప‌టి నుంచి త‌న‌కు సినిమాలంటే ఇష్టముండ‌టంతో అప్ప‌టినుంచే సినిమాలు ఎక్కువ‌గా చూసేద‌ట‌. దీపికా ప‌దుకొణెను చూసి తాను కూడా సినిమాల్లో న‌టించాల‌నుకుంద‌ట నిధి. అయితే ఆ విష‌యాన్ని ఇంట్లో చెప్తే ముందు చ‌దువుకో, త‌ర్వాత సినిమాల గురించి ఆలోచించొచ్చాన్నార‌ట‌.

చ‌దువు అయిపోయాక నిధిని త‌న తండ్రి బిజినెస్ లో భాగం చేయాల‌నుకున్నాడ‌ట‌. కానీ త‌న‌కు హీరోయిన్ అవాల‌ని ఉండ‌టంతో ఆ దిశ‌గా త‌న తండ్రి ఆమెను ప్రోత్స‌హించిన‌ట్టు నిధి తెలిపింది. చదువయ్యాక ముంబై వెళ్లి సినీ అవ‌కాశాల కోసం ట్రై చేసిన నిధి, ఫోటోలు ప‌ట్టుకుని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిన‌ట్టు వెల్ల‌డించింది.

ఛాన్సులు ఇవ్వ‌క‌పోయినా కొంత‌మంది ప‌దేప‌దే త‌న‌ను తిప్పుంచుకున్నార‌ని నిధి ఈ సంద‌ర్భంగా చెప్పింది. రెండేళ్లు ఇబ్బందుల త‌ర్వాత మూడొంద‌ల మందిని ఆడిష‌న్ చేసి చివ‌ర‌కు త‌న‌ను మున్నా మైఖేల్ కోసం సెలెక్ట్ చేశార‌ని, అలా హీరోయిన్ గా మొద‌టి ఛాన్స్ అందుకున్నాన‌ని, ఆ సినిమా చూసి స‌వ్య‌సాచిలో అవ‌కాశ‌మొచ్చి త‌ర్వాత టాలీవుడ్ లో సెటిలైపోయిన‌ట్టు చెప్పుకొచ్చింది నిధి.

కానీ ఉన్న‌ట్టుండి నిధి నుంచి సినిమాలు త‌గ్గిపోయాయి. దానికి కార‌ణం ప‌వ‌న్ తో చేస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుకు ఆమె అగ్రిమెంట్ చేయ‌డమే. ఆ సినిమాలో న‌టించినంత కాలం మ‌రే సినిమాకూ ప‌ని చేయ‌కూడ‌ద‌ని నిధి సైన్ చేసింద‌ట‌. త‌ర్వాత వీర‌మ‌ల్లు వాయిదా ప‌డిన టైమ్ లో ప్ర‌భాస్ సినిమా ఛాన్స్ వ‌చ్చింద‌ని, వీర‌మ‌ల్లు టీమ్ ను అడిగి రాజా సాబ్ సినిమాను ఓకే చేసిన‌ట్టు నిధి తెలిపింది.

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా లో తాను వీర‌మ‌ల్లు ప్రేయ‌సి పంచ‌మి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలిపిన నిధి, ఆ సినిమాలో యువ‌రాణిగా కొన్ని యుద్ధాలు కూడా చేసిన‌ట్టు వెల్ల‌డించింది. ఇక ప్ర‌భాస్ తో న‌టిస్తున్న రాజా సాబ్ సినిమాలో త‌న పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంద‌ని, రాజా సాబ్ లో త‌న పాత్ర అంద‌రూ త‌న‌ని చూసే దృష్టిని మారుస్తుంద‌ని, హారర్ సినిమాలంటే భ‌య‌ప‌డే వాళ్లు రాజా సాబ్ ను తల్లిదండ్రుల‌తో క‌లిసే చూడ‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది నిధి. ఇక త‌న‌కు మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్ లో వ‌చ్చిన స‌ఖి సినిమా అంటే ఎంతో ఇష్ట‌మ‌ని ఆ సినిమాను ఎన్ని సార్లు చూశానో లెక్క కూడా లేద‌ని నిధి తెలిపింది.