ప్రిన్సెస్ వెనక మెగా పవర్స్కి భయపడుతున్నారు
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే.
By: Tupaki Desk | 31 July 2024 5:10 AM GMTమెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే. బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోటైన నిహారిక తెలుగు-తమిళ పరిశ్రమల్లో కథానాయికగా తనవంతు ప్రయత్నాలు చేసారు. ఆ తర్వాత ప్రేమ పెళ్లి బ్రేకప్ ఇవన్నీ తెలిసిన సంగతులే. ఇప్పుడు తన దృష్టి పూర్తిగా కెరీర్ పైనే ఉంది. కానీ ఎందుకనో తెలుగులో తనకు అంతగా అవకాశాల్లేవ్. దీనిపై తాజాగా నిహారిక స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను పూర్తిగా అన్ని రకాల పాత్రల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. నటనా కెరీర్ విషయమై చాలా సీరియస్ గా ఉన్నానని నిహారిక కొణిదెల వెల్లడించారు. కథ డిమాండ్ ని బట్టి హద్దు మీరకుండా గ్లామరస్ పాత్రలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే మెగా ఫ్యామిలీ అమ్మాయి గనుక చాలా మంది వెనకడుగు వేస్తున్నారని భావిస్తున్నట్టు నిహారిక వెల్లడించారు. నా వెనక సూపర్ పవర్స్ ఉన్నాయని భయపడుతున్నారు. అందుకే నాకు తెలుగులో ఆఫర్లు రావడం లేదు. దాంతో నేను తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను! అని తెలిపారు.
అంతేకాదు.. తనకు మాత్రమే కథ వినిపిస్తే సరిపోతుందని, కుటుంబంలో ఇతరులకు కథ చెప్పాల్సిన అవసరం లేదని నిహారిక కొణిదెల వెల్లడించారు. పాత్ర ఏదైనా తుది ఎంపిక తనది మాత్రమేనని తెలిపారు. తన వెనక ఉన్న మెగా బలాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని కూడా ఔత్సాహిక దర్శకనిర్మాతలకు సూచించారు. దీనిని బట్టి నిహారిక వెనక సూపర్ పవర్స్ గురించి ఆలోచించడం వల్లనే తనకు గ్లామరస్ పాత్రల్లో అవకాశాలు రావడం లేదని అర్థం చేసుకోవచ్చు. తాను కేవలం నాయికా ప్రధాన పాత్రల్లోనే చేయనని, ప్రాధాన్యత ఉంటే 5 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో అయినా నటిస్తానని నిహారిక అన్నారు. తాను సౌకర్యంగా ఫీలయ్యే విధంగా గ్లామర్ ని ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దీనిని బట్టి ఫ్లెక్సిబుల్ గా తనతో దర్శకరచయితలు మాట్లాడవచ్చని క్లారిటీ వచ్చేసింది.