తిరుపతి నుంచి నిహారిక పోటీపై వరుణ్ క్లారిటీ
నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞను కనబరిచిన మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది
By: Tupaki Desk | 22 Feb 2024 12:38 PM GMTనటిగా, యాంకర్‌గా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞను కనబరిచిన మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. తిరుపతి నుంచి నిహారిక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆస్కారం ఉందని గుసగుసలు వినిపించాయి. అయితే ఇది నిజమా? కాదా? అన్నదానిపై ఇప్పుడు వరుణ్ తేజ్ స్పందించారు. అతడు నటించిన `ఆపరేషన్ వేలెంటైన్` విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమండ్రిలో జరిగిన ప్రచారంలో వరుణ్ తన సోదరి నిహారిక రాజకీయ ఆరంగేట్రంపై స్పందించాడు.
నిజానికి నిహారికపై ఒక సెక్షన్ మీడియా సాగిస్తున్న ప్రచారం గురించి వరుణ్ ని రాజమండ్రి లో మీడియా ప్రశ్నించగా దానికి స్పందిస్తూ .. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి రావాలా వద్దా? అనేదానిపైనా తమ ఇంటి పెద్దలు నిర్ణయిస్తారని కూడా వరుణ్ వ్యాఖ్యానించారు. పెదనాన్న చిరంజీవి, నాగబాబు, జనసైనికుడు పవన్ కల్యాణ్ తమను నిర్ధేశిస్తారని తెలిపారు. మా కుటుంబం అంతా బాబాయ్ పవన్ కల్యాణ్ వెంటే ఉంటుందని కూడా స్పష్ఠం చేసారు.
ఎన్నికల ప్రచారంలోకి మేం రావాల్సిన అవసరం ఉంటే వస్తామని కూడా అన్నారు. అలాగే అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తే తాము ప్రచారానికి వస్తామని కూడా వ్యాఖ్యానించారు. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలెంటైన్ మార్చి 1న విడుదలవుతోంది. ఇది వైమానిక యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రం. ఆపరేషన్ వాలెంటైన్ థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే వేవ్స్ ని సృష్టించింది. 7 మిలియన్లకు పైగా వీక్షణలతో ట్రైలర్ వెబ్ లో అగ్రస్థానంలో ఉంది.
ఇందులో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. పుల్వామా, బాలాకోట్ దాడులు, తీవ్రవాదం నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే థ్రిల్లర్ చిత్రమిది. భారీ యాక్షన్ సన్నివేశాలతో వీక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఇందులో కథానాయికగా నటించింది.