Begin typing your search above and press return to search.

మోసం ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేప‌ణ‌.. అమితాబ్ అల్లుడిపై కోర్టు కేసు

కోర్టు జోక్యం తర్వాత, ఈ సంఘటనకు కార‌కులైన నిందితులందరిపైనా అధికారికంగా కేసు నమోదు అయింది.

By:  Tupaki Desk   |   17 Feb 2025 4:57 PM GMT
మోసం ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేప‌ణ‌.. అమితాబ్ అల్లుడిపై కోర్టు కేసు
X

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ అల్లుడు, పారిశ్రామికవేత్త నిఖిల్ నందాపై మోసం, ఆత్మహత్యకు ప్రేరేపించార‌నే నేరం కింద కేసు నమోదు చేసినట్లు మీడియా క‌థ‌నాలొచ్చాయి. నిఖిల్, అత‌డి వ్యాపార భాగ‌స్వాముల‌పై పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నిఖిల్ నందా అమితాబ్ బ‌చ్చ‌న్ అల్లుడు. శ్వేతానందా బ‌చ్చ‌న్ భ‌ర్త‌. ఎస్కార్ట్స్ కుబోటా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ప‌రిశ్ర‌మ‌లో ఎదిగారు. ఈటీవీ భారత్ క‌థ‌నం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌- బదౌన్ జిల్లాలోని పోలీస్‌ అధికారులు నిఖిల్ నందా, అత‌డి ట్రాక్టర్ కంపెనీకి చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లపై కేసు నమోదు చేశారు. డేటాగంజ్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ప్ర‌స్తుతం కేసు దర్యాప్తు జ‌రుగుతోంది.

కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు అయిన‌ట్టు తెలిసింది. కంపెనీ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (CMD) నిఖిల్ నందా, ట్రాక్ట‌ర్ల కంపెనీ ఉత్తరప్రదేశ్ అధిపతి, ఏరియా మేనేజర్, సేల్స్ మేనేజర్, షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక డీలర్, మరో ముగ్గురు అధికారులను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. నిఖిల్ నందా సహా ఈ అధికారులందరూ ట్రాక్టర్ ఏజెన్సీ యజమానిని ర‌క‌ర‌కాల ఒత్తిళ్ల‌తో ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించార‌ని ఆరోపించ‌గా, అత‌డి విషాదాంతం కేసు నమోదుకు దారితీసింది.

పాపడ్ హంజాపూర్ గ్రామానికి చెందిన జ్ఞానేంద్ర ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. అతడి సోదరుడు జితేంద్ర సింగ్ గతంలో తన వ్యాపార భాగస్వామి లల్లా బాబుతో కలిసి దతగంజ్‌లో 'జై కిసాన్ ట్రేడర్స్' అనే ట్రాక్టర్ ఏజెన్సీని నడిపాడు. అయితే కుటుంబ వివాదం కారణంగా బాబు జైలు పాలైన తర్వాత, జితేంద్ర ఆ ఏజెన్సీని స్వయంగా నిర్వహించాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు దురదృష్టకర సంఘటనలకు దారితీసింది. తన ఫిర్యాదులో నిఖిల్ నందా, ఆశిష్ బలియాన్ (ఏరియా మేనేజర్), సుమిత్ రాఘవ్ (సేల్స్ మేనేజర్), దినేష్ పంత్ (యుపి హెడ్), పంకజ్ భాస్కర్ (ఫైనాన్షియర్ కలెక్షన్ ఆఫీసర్), అమిత్ పంత్ (సేల్స్ మేనేజర్), నీరజ్ మెహ్రా (సేల్స్ హెడ్), శిశాంత్ గుప్తా (షాజహాన్‌పూర్ డీలర్) వంటి అనేక మంది కంపెనీ అధికారులు తన సోదరుడు జితేంద్రపై అమ్మకాలను పెంచాలని నిరంతరం ఒత్తిడి తెచ్చార‌ని జ్ఞానేంద్ర ఆరోపించారు. ఈ నిరంతర ఒత్తిడి అతడి సోదరుడి జీవితంలో క‌ల్లోలంగా మారింది. జితేంద్రను డీలర్‌షిప్ లైసెన్స్ రద్దు చేస్తామని, అమ్మకాల లక్ష్యాలను చేరుకోకపోతే అతడి ఆస్తిని వేలం వేస్తామని బెదిరించారని కూడా ఆరోపించారు. ఈ విషయాన్ని జితేంద్ర తన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాడు. 21 నవంబర్ 2024న కంపెనీ అధికారుల బృందం జితేంద్రను సందర్శించి అమ్మకాలను పెంచుకోవాలని మరోసారి ఒత్తిడి తెచ్చారని జ్ఞానేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరుసటి రోజే నవంబర్ 22న జితేంద్ర విషాదకరంగా ఆత్మహత్య చేసుకున్నాడు.

నిఖిల్ నందా జోక్యం ఎంత‌వ‌ర‌కూ?

కోర్టు జోక్యం చేసుకునే వరకు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై చర్య తీసుకోలేదని జితేంద్ర కుటుంబం ఆరోపిస్తోంది. కోర్టు జోక్యం తర్వాత, ఈ సంఘటనకు కార‌కులైన నిందితులందరిపైనా అధికారికంగా కేసు నమోదు అయింది. మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. నిఖిల్ నందాకు ఈ ఘ‌ట‌న‌తో ఎలాంటి సంబంధం ఉందో తనకు తెలియదని జితేంద్ర తండ్రి శివ్ సింగ్ అన్నారు. తన కొడుకు మరణానికి కంపెనీనే బాధ్యత వ‌హించాల‌ని అన్నారు. అత‌డు ఎవరో నాకు తెలియదు. మాకు న్యాయం కావాలని శివ్ సింగ్ అన్నారు. దతగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ గౌరవ్ విష్ణోయ్ ఈ కేసుపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ధృవీకరించారు.