మూవీ రివ్యూ : నింద
By: Tupaki Desk | 21 Jun 2024 10:35 AM'నింద' మూవీ రివ్యూ
నటీనటులు: వరుణ్ సందేశ్-తనికెళ్ల భరణి-ఛత్రపతి శేఖర్-అన్నీ-శ్రేయారాణి రెడ్డి- భద్రమ్-మైమ్ మధు-సూర్యకుమార్-సిద్దార్థ్ గొల్లపూడి తదితరులు
సంగీతం: సంతు ఓంకార్
ఛాయాగ్రహణం: రమీజ్ నవీత్
రచన-దర్శకత్వం-నిర్మాణం: రాజేష్ జగన్నాథం
హ్యాపీ డేస్.. కొత్త బంగారు లోకం లాంటి చిత్రాలతో ఒకప్పుడు యువతను ఒక ఊపు ఊపిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత సరైన సినిమాలు పడక అతను అంతర్ధానం అయిపోయాడు. కొన్నేళ్లుగా అసలు సినిమాలే చేయని వరుణ్.. ఇప్పుడు 'నింద' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. రాజేష్ జగన్నాథం తనే స్క్రిప్టు సమకూర్చుకుని.. స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
ఆంధ్రా ప్రాంతంలోని కాండ్రకోట అనే గ్రామంలో మంజు అనే అమ్మాయి హత్యాచారానికి గురవుతుంది. ఆ కేసులో నిందితుడిగా అరెస్టయిన బాలరాజు (ఛత్రపతి శేఖర్)కు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉండడంతో జడ్జి సత్యానంద్ అతడికి ఉరి శిక్ష విధిస్తాడు. కానీ బాలరాజు నిర్దోషి అని సత్యానంద్ మనసు చెబుతుంది. ఈ అపరాధ భావంతోనే ఆయన కన్ను మూస్తాడు. దీంతో ఆయన కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఈ కేసు సంగతేంటో తేల్చి.. తండ్రి ఆత్మకు శాంతినివ్వాలనుకుంటాడు. మరి తన పరిశోధనలో ఏం తేలింది.. నిజంగా బాలరాజు.. మంజుపై అత్యాచారం జరిపి హత్య చేశాడా..? చివరికి బాలరాజు నిర్దోషిగా బయటికి వచ్చాడా..? బాలరాజు కాని పక్షంలో మంజుని చంపిందెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానాలు తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
డిజిటల్ మార్కెట్ ఊపందుకున్నాక వివిధ భాషల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు ఓటీటీలను ముంచెత్తేస్తున్నాయి. సంచలనం రేపిన కేసులను ఎంచుకుని.. వాటి పూర్వాపరాలను పరిశీలించి ఆసక్తికర స్క్రిప్టుగా మలుచుకుని సినిమాలు తీసి మెప్పిస్తున్నారు దర్శకులు. ఈ విషయంలో మలయాళ దర్శకుల నైపుణ్యమే వేరు. మర్డర్ కేసులతో ముడిపడ్డ సినిమాలను వాళ్లు డీల్ చేసే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రేక్షకుల్లో అడుగడుగునా క్యూరియాసిటీ పెంచేలా.. ఉత్కంఠతో ఊగిపోయేలా క్రైమ్ థ్రిల్లర్లను పకడ్బందీ స్క్రీన్ ప్లేతో నడిపిస్తుంటారు అక్కడి దర్శకులు. మన దగ్గర కూడా 'హిట్' సిరీస్ తో శైలేష్ కొలను లాంటి వాళ్లు ఈ తరహా సినిమాలకు బాటలు పరిచారు. ఈ క్రమంలోనే కొత్త దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం కూడా 'నింద'తో ఇలాంటి ప్రయత్నమే చేశాడు. ఐతే ఎంచుకున్న కేసు ఆసక్తికరమే కానీ.. పైన చెప్పుకున్నట్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేలా.. ఉత్కంఠ రేపేలా కథనాన్ని మాత్రం తీర్చిదిద్దుకోలేకపోయాడు. కథలోని ట్విస్ట్.. అక్కడక్కడా కొన్ని సీన్లు బాగున్నా.. ఓవరాల్ గా ఒక పకడ్బందీ థ్రిల్లర్ కు ఉండాల్సిన లక్షణాలు మాత్రం ఇందులో మిస్సయ్యాయి.
''వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు'' అనే ప్రాథమిక న్యాయ సూత్రం ఆధారంగా నడిచే కథ ఇది. హత్య కేసులో దోషిగా తేలి ఉరి శిక్ష కూడా పడ్డ ఖైదీ అమాయకుడని భావించి హీరో అతణ్ని బయటికి తీసుకురావడానికి భిన్నమైన శైలిలో ఈ కేసును పరిశోధించే నేపథ్యంలో ఈ సినిమా ముందుకు సాగుతుంది. సినిమాను మొదలుపెట్టిన తీరు 'నింద' పట్ల ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ కేసును తప్పుదోవ పట్టించిన వాళ్లందరినీ కిడ్నాప్ చేసి ఒక చోటికి చేర్చి వాళ్ల ద్వారా అసలు నిజాలు బయటపెట్టించడంలో వైవిధ్యం కనిపిస్తుంది. ఐతే ఈ కిడ్నాప్ డ్రామాకు మంచి వెయిట్ ఇచ్చి.. హీరోను కూడా నిగూఢంగా చూపించి.. అసలు ముందేం జరిగింది.. ఇప్పుడేం జరుగుతోంది.. తర్వాత ఏం జరగబోతోందనే రేకెత్తించాడు దర్శకుడు. కానీ ముసుగు వేసుకుని విపరీతమైన బిల్డప్ ఇచ్చే హీరో.. నిజాలు వెలికి తీసే పనిలో పెద్దగా సాధించేదేమీ ఉండదు. ఉన్నట్లుండి ఆ ముసుగు తీసేసి తనెవరో చెప్పాక ఒక్కొక్కటిగా అసలు విషయాలు బయటపడతాయి. ఆ మాత్రానికి అంతకుముందు ఆ కిడ్నాప్.. ఆ ముసుగు డ్రామా ఎందుకో అర్థం కాదు.
ఒక్కసారి హీరో ఎవరన్నది అందరికీ తెలిసిపోయాక ఒక సగటు క్రైమ్ స్టోరీలాగే నడుస్తుంది 'నింద'. మర్డర్ కేసుకు సంబంధించి ఒక్కో చిక్కుముడి వీడడం.. చివరికి ట్విస్ట్ వెల్లడి కావడం.. ఇలా మామూలు టెంప్లేట్లోనే సినిమా నడుస్తుంది. హత్య చేసిన వ్యక్తి ఎవరన్నది వెల్లడైనపుడు ప్రేక్షకులు కొంచెం షాకవుతారు కానీ.. ఒక పల్లెటూరిలో జరిగిన హత్య విషయంలో అసలు విషయాలు మరుగున పడిపోయి నిర్దోషి జైలు పాలయ్యే క్రమం అంత లాజికల్ గా అయితే అనిపించదు. అతణ్ని ఎవరు ఎందుకు ఫ్రేమ్ చేశారనే విషయంలో సన్నివేశాలు కన్విన్సింగ్ గా అనిపించవు. సినిమాకు మొదట్లో ఇచ్చిన బిల్డప్ కు.. చివరికి ముగిసే తీరుకు పొంతన ఉండదు. కథలో ఉన్న ట్విస్టు వల్ల ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తితోనే చివరి వరకు చూస్తారు కానీ.. వారిని ఉత్కంఠతో ఊపేసేలా మాత్రం కథనం లేదు. దర్శకుడు కథ నుంచి డీవియేట్ కాకుండా సిన్సియర్ గానే సినిమా తీసినా.. కథనంలో బిగి చూపించలేకపోయాడు. బడ్జెట్ పరిమితుల వల్ల కూడా క్రైమ్ థ్రిల్లర్లలో ఉండాల్సిన క్వాలిటీ కూడా ఇందులో మిస్సయింది. రొటీన్ కు భిన్నమైన సినిమాలు.. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా 'నింద' మీద ఒక లుక్కేయొచ్చు.
నటీనటులు:
తెలుగు ప్రేక్షకుల దృష్టిలోంచి పూర్తిగా పక్కకు వెళ్లిపోయిన వరుణ్ సందేశ్.. తాను ఇంతకుముందు చేసిన చిత్రాలకు పూర్తి భిన్నమైన కథతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇలాంటి కథలో అతణ్ని చూడడం కొత్తగా అనిపిస్తుంది. నటనలో మునుపటితో పోలిస్తే పరిణతి వచ్చింది. వివేక్ పాత్రను సటిల్ గా పండించే ప్రయత్నం చేశాడు. వరుణ్ బాగానే ట్రై చేసినా.. తన నటన ఆ పాత్రకు వెయిట్ మాత్రం తీసుకురాలేకపోయింది. తన లుక్ బాగుంది. కథానాయిక శ్రేయారాణి రెడ్డి పాత్ర పరిమితం. కీలక పాత్రలో అన్నీ రాణించింది. ఛత్రపతి శేఖర్ బాలరాజు పాత్రలో ఒదిగిపోయాడు. తనికెళ్ల భరణి తక్కువ సన్నివేశాల్లోనే బాగా చేశారు. భద్రమ్.. మిగతా ఆర్టిస్టులు తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం:
'నింద' సాంకేతికంగా సోసోగా అనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్లలో ప్రేక్షకులు ఆశించే క్వాలిటీ ఇందులో కనిపించదు. చాలా పరిమితుల మధ్య సినిమా తీసిన విషయం అర్థమవుతుంది. సంతు ఓంకార్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. పాటలు బాలేవు. అనవసరంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. రమీజ్ నవీన్ ఛాయాగ్రహణం ఓకే. తనే సొంతంగా ప్రొడ్యూస్ చేసుకోవడంతో పాటు స్క్రిప్టు సమకూర్చుకుని సినిమా తీసిన రాజేష్ జగన్నాథం.. ఉన్నంతలో మంచి ప్రయత్నమే చేశాడు. తను ఎంచుకున్న కథ బాగున్నా.. దాన్ని ఆసక్తికరంగా నడిపించే కథనం.. అవసరమైన ప్రొడక్షన్ సమకూర్చుకోలేకపోయాడు. రచయిత.. దర్శకుడిగా అతడికి యావరేజ్ మార్కులు పడతాయి.
చివరగా: నింద.. మంచి కాన్సెప్ట్- వీక్ నరేషన్
రేటింగ్- 2.25/5