ట్రంప్‌తో డిన్నర్‌లో కళ్లు తిప్పుకోనివ్వని నీతా అంబానీ
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం కోసం వేచి చూస్తున్నాడు.
By: Tupaki Desk | 20 Jan 2025 2:57 PM GMTఅమెరికా చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం కోసం వేచి చూస్తున్నాడు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయగా, దేశ విదేశాల నుంచి అతిరథ మహారధులంతా వాషింగ్టన్ కు తరలివచ్చారు. ప్రమాణ స్వీకారానికి ముందు అతిధులకు ఘనమైన డిన్నర్ ని ఏర్పాటు చేయగా, ఈవెంట్లో ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా మారారు.
వాషింగ్టన్‌లో జరిగిన డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార ప్రీపార్టీలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ - రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ నేరుగా ఈవెంట్ లో కనిపించగా వేదికకు కొత్త కళ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఈ స్పెషల్ ఈవెంట్ కోసం అమెరికాకు తరలి వచ్చారు.
లేటెస్టుగా పార్టీ నైట్ నుంచి అంబానీల ఫోటోలు ఇప్పటికే వెబ్ లో వైరల్ అయ్యాయి. ఈ కార్యక్రమంలో అంబానీలు ఏం మాట్లాడారో ఇంకా బహిర్గతం కాకపోయినా కానీ, ఈ జంట ఫోటోలు మాత్రం వెబ్ లో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నీతా అంబానీ స్పెషల్ అలంకరణ అందరి దృష్టిని ఆకర్షించింది.
రిలయన్స్ ఫౌండేషన్ దాతృత్వ కార్యక్రమాల రథసారథిగా నీతా అంబానీ దేశంలో విద్య, ఆరోగ్య సంరక్షణ , క్రీడలకు తనవంతు ధాతృ సాయం చేసిన సేవకురాలిగా పేరు తెచ్చుకున్నారు. ట్రంప్ తో అంబానీల సమావేశం నెట్‌వర్కింగ్ లో భవిష్యత్ సహకారం ఎలా ఉండాలి? అనే చర్చకు ఒక వేదికగా మారిందని తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనలో భారతదేశం- అమెరికా మధ్య సత్సంబంధాలు పెరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కీలక తరుణంలో భారతదేశ వ్యాపార దిగ్గజాలు ట్రంప్ తో సన్నిహితంగా మెలగడం ఆశావహ ధృక్పథాన్ని పెంచుతోంది. అమెరికాలో పరిణామాలు భారత్ ని షేక్ చేయనివ్వకుండా ముఖేష్ అంబానీ ముకుతాడు వేస్తాడని ఆశాభావం వ్యక్తమవుతోంది.
నీతాజీ స్పెషల్ లుక్ వైరల్:
ట్రంప్‌తో డిన్నర్ పార్టీలో నీతా అంబానీ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. నీతాజీ అద్భుతమైన కాంచీపురం నేత చీరలో కనిపించారు. నలుపు రంగు చీర- బ్లాక్ ఫ్లోరల్ బ్లౌజ్ తో పాటు శతాబ్దాలనాటి ఆభరణాలను ధరించి నీతాజీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీతా అంబానీ ధరించిన చీరను ప్రముఖ కళాకారుడు బి కృష్ణమూర్తి నేశారు. బ్లౌజ్ ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. పచ్చరాళ్ళతో తయారుచేసిన చేతి మణికట్టు ఆభరణం.. మెడలో ధరించిన ప్రత్యేక జెవెలరీ అందరి దృష్టిని ఆకర్షించాయి.