రామాయణం ఎన్ని భాగాలు? ఏది ఎక్కడ ముగింపు?
మూడు భాగాలుగా రామాయణం కథాంశాన్ని రాసుకుని సినిమాలను రూపొందిస్తుండడంతో ఇది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. పురాణేతిహాస కథను లోతుగా తెరపై ఆవిష్కరించనున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది.
By: Tupaki Desk | 8 March 2024 4:30 PM GMT2023 బాలీవుడ్ కి అత్యంత కలిసొచ్చిన సంవత్సరం. సక్సెస్ ఇచ్చిన కిక్కులో బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున భారీ పాన్ ఇండియా సినిమాలను ప్రారంభించడంతో అవన్నీ చర్చనీయాంశమయ్యాయి. వీటిలో దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న 'రామాయణం'పై భారీ అంచనాలేర్పడ్డాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి, KGF స్టార్ యష్‌లు వరుసగా రాముడు, సీత, రావణుడు వంటి ఐకానిక్ పాత్రలను పోషిస్తుండగా, ఇతర పాత్రధారులను నితీష్ తివారీ ఎంపిక చేసుకున్నారు.
మూడు భాగాలుగా రామాయణం కథాంశాన్ని రాసుకుని సినిమాలను రూపొందిస్తుండడంతో ఇది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. పురాణేతిహాస కథను లోతుగా తెరపై ఆవిష్కరించనున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది. ట్రయాలజీలోని మొదటి భాగంలో శ్రీరాముడు, అయోధ్యలోని అతని కుటుంబం, సీతారాముల వివాహం ..అడవిలో 14 సంవత్సరాల అజ్ఞాతవాసం గురించి ప్రేక్షకులకు పరిచయం చేస్తారు.ప్రతినాయకుడైన రావణుడు సీతను అపహరించే కీలకమైన ఘట్టంతో మొదటి భాగం ముగుస్తుంది. వినోదం, సున్నితత్వం, సినిమాటిక్ గ్రాండియారిటీతో రామాయణం కథను తెరపై అందించాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. వీక్షకులకు ఒక గొప్ప అనుభూతిని అందించేలా ఎమోషన్స్ తో తీర్చిదిద్దనున్నారు.
'రామసేతు' నిర్మాణానికి తెరతీసిన హనుమంతుడు .. వానర సేనతో లంకకు రామలక్ష్మణుల ప్రయాణం ఎలా సాగింది? అన్నది రెండో భాగం. మూడవది.. కీలకమైన చివరి భాగం వానర సేనకు రావణుని సైన్యానికి మధ్య జరిగిన భారీ యుద్ధ ఘట్టాన్ని ఆవిష్కరిస్తుంది. అంతిమంగా రావణుడి ఓటమి అనంతరం సీతతో పాటు రాముడు విజయవంతంగా అయోధ్యకు తిరిగి రావడంతో చివరి భాగం ముగుస్తుంది.
నితేష్ తివారీ రామాయణంలో రణబీర్ కపూర్ (శ్రీరాముడు) తండ్రి(దశరథుడు)గా అమితాబ్ బచ్చన్ నటించే వీలుందని కూడా ప్రచారం ఉంది. ఇందులో ఆంజనేయుడిగా సన్నీడియోల్ నటిస్తుండగా, బాబి డియోల్ కి ఒక కీలక పాత్రను ఆఫర్ చేసారన్న ప్రచారం ఉంది. రామాయణం చిత్ర నిర్మాణంలో భాగంగా కథాంశంపై విస్తృతమైన పరిశోధన సాగింది. ప్రీ-ప్రొడక్షన్ భారీగా ప్లాన్ చేసారు. చారిత్రక పౌరాణిక ఇతిహాస కథను దృశ్యపరంగా అద్భుతంగా తెరకెక్కించేందుకు బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రామాయణం అధికారిక ప్రకటన 17 ఏప్రిల్ 2024న శ్రీరామనవమి శుభ సందర్భంగా ఉంటుందని భావిస్తున్నారు.