Begin typing your search above and press return to search.

నితిన్ vs రవితేజ.. బాక్సాఫీస్ కిరికిరి!

దీంతో నితిన్ మళ్ళీ తన కెరీర్‌ను ట్రాక్ లోకి తెచ్చుకునేలా కచ్చితమైన ప్రాజెక్టులు లైన్‌లో పెట్టాడు.

By:  Tupaki Desk   |   12 Feb 2025 1:18 PM GMT
నితిన్ vs రవితేజ.. బాక్సాఫీస్ కిరికిరి!
X

నితిన్.. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ సక్సెస్ చూసి చాలా కాలమైంది. 2020లో వచ్చిన భీష్మ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యాక, ఆ తర్వాత వరుసగా చేసిన చెక్, మాస్ట్రో (OTT), మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కొన్ని సినిమాలు అయితే బాక్సాఫీస్ వద్ద నితిన్ మార్కెట్ ను గట్టిగానే డ్యామేజ్ చేశాయి. దీంతో నితిన్ మళ్ళీ తన కెరీర్‌ను ట్రాక్ లోకి తెచ్చుకునేలా కచ్చితమైన ప్రాజెక్టులు లైన్‌లో పెట్టాడు.

ప్రస్తుతం నితిన్ హిట్ కాంబినేషన్స్‌ను మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడు. భీష్మ తో తనకు బిగ్ హిట్ అందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మొదట డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ వాయిదా వేసి శివరాత్రి రిలీజ్‌కు ప్లాన్ చేశారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫుల్ కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది.

ఇక వకీల్ సాబ్ వంటి హిట్ సినిమా తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు నితిన్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమ్ముడు అనే టైటిల్ ఖరారు చేశారు. కుటుంబ అనుబంధాలతో కూడిన మాస్, ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. గతంలో లయ టాప్ హీరోయిన్‌గా టాలీవుడ్‌ను ఏలింది. ఇప్పుడు ఆమె మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ నితిన్ అక్కగా నటిస్తోంది.

మే 9న తమ్ముడు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే తమ్ముడు సినిమా కేవలం సింగిల్ రిలీజ్ కాదు. అదే రోజున మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర సినిమా కూడా థియేటర్లలోకి రాబోతోంది. బాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే సితారా బ్యానర్ వరుస విజయాలతో మంచి ఫాంలో ఉంది.

కానీ మాస్ రాజకు కూడా గత కొంతకాలంగా సక్సెస్ లేదు. 2020 ధమాకా అనంతరం హీరోగా చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, ఈగల్ దారుణమైన నష్టాలను కలుగజేశాయి. ఇక ఈసారి మాస్ ఫ్యాన్స్‌ను పూర్తిగా టార్గెట్ చేస్తూ మాస్ జాతరతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. తమ్ముడు vs మాస్ జాతర.. ఈ రెండు సినిమాల పోటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సాలీడ్ హిట్ కోసం చూస్తున్న హీరోలకు పర్ఫెక్ట్ సమ్మర్ స్లాట్ అయితే దొరికింది. అయితే నితిన్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తే క్లిక్కయ్యే అవకాశం ఉంటుంది. ఇక మాస్ జాతర పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది కాబట్టి రిస్క్ తో కూడుకున్న పని. నిర్మాతగా దిల్ రాజు ఉన్నందున తమ్ముడు సినిమాకు గ్రాండ్ రిలీజ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ పోటీని తట్టుకొని హిట్ కావాలంటే కంటెంట్ బలంగా ఉండాల్సిందే. వేణు శ్రీరామ్ కథను ఎలాంటి ప్రెజెంటేషన్ లో తెరకెక్కించాడో, ఆ కంటెంట్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మొత్తానికి మే 9న నితిన్, రవితేజ బాక్సాఫీస్ కిరికిరి ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఈ క్లాష్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.