ఆ పాత్ర ఎందుకు చేయకూడదు..? ఆసక్తి రేపుతున్న నివేదా కామెంట్స్..
2016లో జెంటిల్మాన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ నివేదా థామస్.
By: Tupaki Desk | 1 Sep 2024 10:15 AM GMT2016లో జెంటిల్మాన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ నివేదా థామస్. అందమైన కళ్ళతో.. ఆమె పనికించే ఎక్స్ప్రెషన్స్ కుర్రకాలను మెస్మరైజ్ చేశాయి. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. కెరీర్ బాగా సాగుతున్న సమయంలో సడన్ బ్రేక్ తీసుకున్న ఈ భామ తిరిగి మళ్లీ 'శాకిని డాకిని’ మూవీతో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు మళ్లీ కాస్త గ్యాప్ తర్వాత తిరిగి ప్రేక్షకులను పలకరించడానికి మరొక సినిమాతో సిద్ధమవుతోంది.
'35 చిన్న కథ కాదు' అనే మూవీతో తిరిగి నివేదా థామస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నివేదా చేసే పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు, తమిళ్ తో పాటు మలయాళంలో కూడా సెప్టెంబర్ 6 న విడుదల కాబోతోంది. ఇక విడుదల దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పై జోరు పెంచింది. ఇందులో భాగంగా తాజాగా నివేదా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూలో నివేదా పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఆ పాత్ర చేస్తే తప్పేంటి అని నివేదా అడిగిన తీరు.. హీరోయిన్ల నుంచి ప్రేక్షకులు ఏమి ఆశిస్తున్నారు అన్న విషయంపై ఆసక్తి రేపుతోంది.. ఈ ఇంటర్వ్యూలో ‘చిన్న వయసులోనే తల్లి పాత్ర పోషించడంపై మీ అభిప్రాయం ఏమిటి?’అని తనకు ఎదురైన ప్రశ్నకు నివేదా తనదైన శైలిలో జవాబు ఇచ్చింది.
20 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత ఆడపిల్లలకు ఎదురయ్యే మొదటి ప్రశ్న పెళ్లెప్పుడు చేసుకుంటావు? అలాంటప్పుడు 20 ఏళ్లు దాటాక తల్లి పాత్ర పోషిస్తే తప్పేముంటుంది అని నివేదా సమాధానమిచ్చింది. మొదట్లో నివేదా ఇంత చిన్న వయసులో తల్లి పాత్ర పోషించడం తన తర్వాత సినిమాలపై ప్రభావాన్ని చూపిస్తుంది అని ఆలోచించిందట. కానీ తాను అన్ని రకాల పాత్రలు పోషిస్తాను అన్న విషయం ప్రేక్షకులకు తెలియాలి అంటే ఈ పాత్రకి ఒకే చెప్పాలి అని భావించి.. తల్లి పాత్ర చేయడానికి నివేదా సిద్ధపడిందట.
మొత్తానికి ఆమె తీసుకున్న ఈ డెసిషన్ చాలా డేరింగ్ అనే చెప్పాలి. హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకు పరిమితం అవుతున్న ఈ రోజుల్లో.. ఏ పాత్రలో అయినా నటించిన మెప్పించగలను అనే నివేదా కాన్ఫిడెన్స్ మెచ్చుకోదగినది. మొత్తానికి ఆమె ఈ పాత్రలో ఎంతవరకు తనని తాను నిరూపించుకుంటుంది అన్న విషయం సినిమా విడుదల అయ్యాక తెలుస్తుంది.