Begin typing your search above and press return to search.

మ‌రో పాపుల‌ర్ మ‌ల‌యాళ హీరోపై వేధింపుల కేసు!

ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖ హీరోలు, న‌టుల‌పై కొంద‌రు న‌టీమ‌ణులు వేధింపులకు పాల్ప‌డ్డారంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

By:  Tupaki Desk   |   3 Sep 2024 5:36 PM GMT
మ‌రో పాపుల‌ర్ మ‌ల‌యాళ హీరోపై వేధింపుల కేసు!
X

జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక మాలీవుడ్ ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఈ క‌మిటీ సంచ‌ల‌న‌ నివేదిక మ‌హిళ‌ల‌కు కొండంత‌ ధైర్యాన్నిస్తూ అండ‌గా నిలుస్తుండ‌డం.. ప్ర‌భుత్వం నుంచి భ‌రోసా ల‌భించ‌డంతో ఇప్పుడు వేధింపుల‌కు గురైన న‌టీమ‌ణులంతా ఒక‌రొక‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. బ‌హిరంగంగా త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌పై స్పందించ‌డ‌మే గాక కేసులు ధైర్యంగా ఫైల్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖ హీరోలు, న‌టుల‌పై కొంద‌రు న‌టీమ‌ణులు వేధింపులకు పాల్ప‌డ్డారంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

ఇప్పుడు పాపుల‌ర్ మ‌ల‌యాళ హీరో నివిన్ పౌళీ, అత‌డితో పాటు మ‌రో ఐదుగురిపైనా కేసు న‌మోదైంది అని కొన్ని వార్తలు వచ్చాయి. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై నటుడు నివిన్ పౌలీ, మలయాళ చిత్ర నిర్మాత ఎకె సునీల్, మరో నలుగురిపై కేరళ పోలీసులు సెప్టెంబర్ 3 (మంగళవారం)న‌ కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 (అత్యాచారం) సహా భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎర్నాకులంలోని ఊన్నుకల్ పోలీసులు ధృవీక‌రించార‌ని పాపుల‌ర్ `ది న్యూస్ మినిట్‌` వెల్ల‌డించింది.

స‌ద‌రు మీడియా క‌థ‌నం ప్రకారం.. ఈ కేసులో నివిన్ పౌలీని ఆరో నిందితుడిగా చేర్చారు. ఆ మహిళ ఎర్నాకులం రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ), వైభవ్ సక్సేనాకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో తనకు ఒక సినిమాలో పాత్ర ఇస్తానని వాగ్దానం చేశారని, దాని కోసం నవంబర్ 2023లో దుబాయ్ కి రావాలని కోరారని, ఆ తర్వాత దుబాయ్‌లోని హోటల్ గదిలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొంది. ప్రస్తుతానికి పూర్తి వివరాలు అందుబాటులో లేవు అని న్యూస్ మినిట్ తెలిపింది.

నివిన్ పౌళీ 2010 మలయాళ చిత్రం `మలర్‌వాడి ఆర్ట్స్ క్లబ్‌`తో తన నటనా రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో హీరోగా న‌టించాడు. వీటిలో నేరం, ప్రేమమ్, బెంగుళూరు డేస్, 1983, మూతోన్ , తురముఖం వంటి చిత్రాలు న‌టుడిగాను మంచి పేరు తెచ్చాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత ఎకె సునీల్ విజయ్ సూపరుం పౌర్ణమియం, మనోహరం వంటి హిట్ చిత్రాలకు నిధులు సమకూర్చారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై హేమ కమిటీ నివేదిక విడుదలైన నేపథ్యంలో వ‌రుస‌ ఫిర్యాదులు అందుతున్నాయి. ఇంకా ఎన్ని పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయోననే టెన్ష‌న్ వాతావ‌ర‌ణం మాలీవుడ్ లో అలుముకుంది. తాజాగా నివిన్ పౌళీపై మహిళ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, వారిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు టైమ్స్ న‌వ్ క‌థ‌నం పేర్కొంది.

ఈ కధనాల ఫై హీరో స్పందించారు. ”ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు నాపై కేసు పెట్టినట్లు తప్పుడు వార్తలు గుర్తించాను . ఇది పూర్తిగా అవాస్తవం. ఇవి తప్పుడు వార్తలు అని అందరు దయచేసి అందరూ తెలుసుకోండి. ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని నిరూపించేందుకు నేను కచ్చితంగా ఎక్కడికైనా వెళ్తాను. అలాగే ఇందుకు కారకులు అయిన వారిని వెలుగులోకి తీసుకువస్తాను. అలాగే వారిపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాను. నాకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మిగిలినవి చట్ట ప్రకారం పరిష్కరించబడతాయి” అంటూ ఇన్ స్టా నోట్ లో పేర్కొన్నారు. నివిన్ పౌలీ ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ ఏడాది మలయాళీ ఫ్రమ్ ఇండియా సినిమాలో నటించాడు. ఇటు తెలుగులోనూ ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది.