Begin typing your search above and press return to search.

క్రిస్టోఫర్ నోలన్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే

చివరగా యూనివర్సల్ పిక్చర్స్ X ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది. నోలన్ తదుపరి 'ది ఒడిస్సీ' అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తారు.

By:  Tupaki Desk   |   24 Dec 2024 10:30 PM GMT
క్రిస్టోఫర్ నోలన్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే
X

ఈ యూనివ‌ర్శ్ లో ఎలా ఆలోచిస్తే అసాధార‌ణ‌మైన‌ క‌థ‌లు పుట్టుకొస్తాయో, కొత్త టెక్నిక‌ల్ ఎలిమెంట్స్ పుట్టుకొస్తాయో క్రిస్టోఫ‌ర్ నోలాన్ ని చూసి తెలుసుకోవాలి. ఠిపిక‌ల్ కాన్సెప్టులు ఎంచుకున్నా దానిని క‌న్వే చేయ‌గ‌లిగేలా మేకింగ్ ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రించ‌డం అత‌డి ప్ర‌త్యేక‌త‌. ఇంట‌ర్ స్టెల్లార్ లాంటి కొన్ని కాన్సెప్టులు అర్థం కాలేద‌ని విమ‌ర్శించినా కానీ, అవి విజువ‌ల్ వండ‌ర్స్ ని త‌ల‌పించాయి. అణుబాంబ్ పితామ‌హుడి జీవితాన్ని 'ఓపెన్ హైమ‌ర్'లో అద్భుతంగా చూపించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లు, క్రిటిక్స్ నుంచి మ‌న్న‌న‌లు అందుకున్నాడు నోలాన్. అణుబాంబు సృష్టితో ప్ర‌మాదాలు, భావోద్వేగాలు అనే అత్యంత సంక్లిష్ఠ‌మైన అంశాన్ని కూడా సులువుగా ఎక్కేలా ప్ర‌జ‌ల‌కు చూపించ‌డంలో అత‌డి నైపుణ్యానికి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

క్రిస్టోఫర్ నోలన్ చివరిగా తెర‌కెక్కించిన 'ఓపెన్‌హైమర్' బాక్సాఫీస్ వద్ద దాదాపు 1 బిలియన్ డాలర్ల కలెక్షన్‌తో అత్యంత విజ‌య‌వంత‌మైన క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా రికార్డుల‌కెక్కింది. కొంత కాలంగా నోలాన్ తదుపరి చిత్రంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్నాయి. చివరగా యూనివర్సల్ పిక్చర్స్ X ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది. నోలన్ తదుపరి 'ది ఒడిస్సీ' అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తారు. ఈ చిత్రం సరికొత్త IMAX ఫిల్మ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ప‌లు దేశాల్లో చిత్రీక‌రిస్తారు. ఈ చిత్రంలో టామ్ హాలండ్ , మాట్ డామన్ నటించనున్నారు. అన్నే హాత్వే, జెండయా, లుపిటా న్యోంగో, రాబర్ట్ ప్యాటిన్సన్ , చార్లిజ్ థెరాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తార‌ని స‌మాచారం.

నోలన్ చిత్రం హోమర్ క‌విత ఒడిస్సీ ఆధారంగా రూపొందుతున్న‌ చిత్రం. ఇది గ్రీకు వీరుడు ఒడిస్సియస్ కథను నేరేట్ చేస్తుంది. ట్రోజన్ యుద్ధంలో విజయం తరువాత అతడు త‌న‌ ఇంటికి వెళ్ళిన క్ర‌మంలో కథను వివరిస్తుంది. ఈ చిత్రంలో హీరోయిజానికి కొద‌వేమీ ఉండ‌దు. విధేయత, మోసం, దైవ సంకల్పానికి వ్యతిరేకంగా పోరాటం వంటి అంశాల‌తో సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. యూనివర్సల్ బ్యాన‌ర్ లో క్రిస్టోఫర్ నోలన్ కి ఇది రెండో చిత్రం. 17 జూలై 2026న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.