నోలన్ కూడా పూరీలా అంత స్పీడ్ గా తీసాడా?
నోలన్ లాంటి ఠఫ్ మాస్టార్ ఇంత తక్కువ సమయంలో సినిమాని పూర్తి చేయడం ఆసక్తిని కలిగిస్తోంది
By: Tupaki Desk | 19 July 2023 4:15 AM GMTపాపులర్ హాలీవుడ్ దర్శకుడు నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం భారతదేశంలోను రికార్డులు సృష్టించడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.
ముంబై సహా మెట్రో నగరాల్లో ఐమ్యాక్స్ ఫార్మాట్ లో ఈ సినిమా అత్యంత భారీగా విడుదలవుతోంది. పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో తెరకెక్కిన ఈ చిత్రం విజువల్ ట్రీట్ గా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ సినిమా కథాంశం ఆసక్తికరం. అమెరికన్ అణుబాంబ్ సృష్టికర్త.. ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ రాబర్ట్ ఓపెన్ హైమర్ బయోపిక్ చిత్రమిది. సిలియన్ మర్ఫీ టైటిల్ పాత్రలో నటించగా ప్రోమోలు ట్రైలర్ కు అద్భుత స్పందన లభించింది. అతడి నటన ఈ సినిమాకి ప్రధాన అస్సెట్ కానుంది. తాజాగా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో సిలియన్ మర్ఫీ 'ఓపెన్ హైమర్' షూటింగ్ డేస్ గురించిన రహస్యాన్ని రివీల్ చేసారు.
ఓపెన్ హైమర్ కేవలం 57 రోజుల్లోనే తెరకెక్కిందని ఆయన వెల్లడించడం షాకిస్తోంది. నిజానికి ఏ హాలీవుడ్ భారీ చిత్రం ఇన్ని తక్కువ పనిదినాల్లో తెరకెక్కినట్టు మనం వినలేదు. నోలన్ లాంటి ఠఫ్ మాస్టార్ ఇంత తక్కువ సమయంలో సినిమాని పూర్తి చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.
టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు మాత్రమే అంత తక్కువ సమయంలో సినిమాని పూర్తి చేయగలడన్న టాక్ ఉంది. ఇప్పుడు నోలన్ కూడా మరో పూరీలా మారాడంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఓపెన్ హైమర్ చిత్రంతో పాటు బార్బీ అత్యంత భారీగా విడుదలవుతోంది. బార్బీ నుండి నోలన్ చిత్రానికి తీవ్రమైన పోటీ నెలకొంది. కై బర్డ్ - మార్టిన్ J. షెర్విన్ రాసిన అమెరికన్ ప్రోమేథియస్: ది ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ అనే పుస్తకం ఆధారంగా ఓపెన్‌హైమర్ చిత్రం తెరకెక్కింది.