తంబీల్లో వర్కవుటైన ఉలగనాయగన్ ఫ్యాక్టర్
భారీతనం నిండిన ఇంగ్లీష్ ఫ్రాంఛైజీ చిత్రాలు వంద కోట్ల క్లబ్‌లలో చేరి ఆశ్చర్యపరుస్తున్నాయి.
By: Tupaki Desk | 3 July 2024 2:30 AM GMTమంచి సినిమా రావాలే కానీ, ఇండియాలో బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడ ప్రజల మనసు గొప్పది.. సరసమైనది.. తన పర అనే విభేధం లేదు. హాలీవుడ్ నుంచి భారతదేశంలో విడుదలై చాలా సినిమాలు కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాయి. భారీతనం నిండిన ఇంగ్లీష్ ఫ్రాంఛైజీ చిత్రాలు వంద కోట్ల క్లబ్‌లలో చేరి ఆశ్చర్యపరుస్తున్నాయి.
హాలీవుడ్, తమిళం, కన్నడ, మలయాళం సహా ఇరుగు పొరుగు సినిమాల్ని తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరించారు. ఇక ఇండియాలో పలు భాషల్లో రూపొందించిన మంచి సినిమాలను తెలుగు ప్రజలు ఆదరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మన తెలుగు సినిమాలకు ఇరుగు పొరుగు భాషల్లోను ఆదరణ పెరిగింది. ఇంతకుముందు తమిళ తంబీలు కేవలం తంబీ స్టార్ల సినిమాలు మాత్రమే థియేటర్లలో వీక్షించేవారు. కానీ నెమ్మదిగా అక్కడి ప్రజల ఆలోచనల్లోను మార్పు కనిపిస్తోందనడానికి తాజాగా రిలీజైన కల్కి బాక్సాఫీస్ ఫలితమే ఒక ఎగ్జాంపుల్.
కల్కి చిత్రం 10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌తో దాదాపు 15 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. రజనీ సహా పలువురు టాప్ స్టార్లు `కల్కి 2898 AD`పై ప్రశంసలు కురిపించడం కలిసొచ్చింది. కల్కిని ప్రశంసించడంలో తమిళ స్టార్లు నా పర భేధం చూపించలేదు. అలాగే అక్కడి ప్రజలు కూడా పెద్ద మనసు చేసుకుని కల్కి థియేటర్లకు రావడం ఆశ్చర్యపరుస్తోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి సైరా లాంటి భారీ చిత్రంలో నటించినా తమిళ జనం థియేటర్లకు రాలేదు. కానీ ఇప్పుడు ప్రభాస్ కల్కి కోసం థియేటర్లకు వచ్చారు. అయితే ఉలగనాయగన్ కమల్ హాసన్ ఫ్యాక్టర్ కూడా అక్కడ వర్కవుటైందని ఇప్పుడు విశ్లేషించవచ్చు.
ఇటీవలి కాలంలో బహుభాషా నటులతో పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేయడం అనేది ఏ విధంగా వర్కవుటవుతుందో కల్కితో మరోసారి అర్థం చేసుకోవాలి. ఈ చిత్రంలో తెలుగు స్టార్ ప్రభాస్, తమిళ స్టార్ కమల్ హాసన్, హిందీ స్టార్లు అమితాబ్, దీపిక, దిశా నటించారు. వీరందరి వల్లా ఆయా భాషల్లో కల్కి చిత్రానికి తగిన గుర్తింపు దక్కి కలెక్షన్లు పెరిగాయి. తద్వారా అది బాక్సాఫీస్ అంతిమ ఫలితంలో ప్రతిఫలించిందని విశ్లేషిస్తున్నారు.
ఇకపోతే ఎప్పుడూ స్థానికతను చూసే తమిళ తంబీలు ఈసారి చాలా మార్పు చెంది కల్కి చిత్రాన్ని ఆదరించడం విశేషం. అదే సమయంలో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన కమల్ హాసన్ సినిమా భారతీయుడు 2 ట్రైలర్ ని వీక్షించి తంబీలు పెదవి విరిచేయడం కూడా గమనార్హం. కల్కి సినిమాకి దక్కిన ఆదరణ భారతీయుడు 2 కి దక్కుతుందో లేదో? అంటూ ఒక సెక్షన్ గుసగుసలాడటం కూడా ఇప్పుడు చర్చగా మారింది. అయితే కల్కిని ప్రశంసించిన తమిళ తారలు స్థానిక సినిమాని గుర్తించరా ప్రశంసించరా? అన్న చర్చా వేడెక్కిస్తోంది. తెలుగు పరిశ్రమలాగా భారతదేశంలోని మరే ఇతర చిత్ర పరిశ్రమ కూడా ఒకరి చిత్రాలను మరొకరు ఆదరించడం లేదని కూడా తమిళ జర్నలిస్టులు, విశ్లేషకులు అభిప్రాయపడటం కొసమెరుపు.
భారతీయ 2 ట్రైలర్‌కు తమిళ సినీ పరిశ్రమ పెద్దలెవరూ ఎందుకు మద్ధతివ్వడం లేదని కూడా ఈ సందర్భంగా చర్చల్లోకొచ్చింది. ఇటీవల పొన్నియన్ సెల్వన్ కి దక్కిన మద్ధతు ఇప్పుడు భారతీయుడు 2 ట్రైలర్ కి మద్ధతు దక్కకపోవడంత సినిమాకి అయినా థియేటర్లలో మద్ధతు దక్కుతుందా లేదా శంకర్ సినిమాని థియేటర్లలో ఏమేరకు ఆదరిస్తారు? అన్నది చర్చగా మారింది.