ఐటమ్ పాటకు నోరా డిమాండ్ చుక్కల్లో
ప్రతి రోజూ వేవ్స్ క్రియేట్ చేస్తూ సినిమా, రియాలిటీ టీవీ రంగం రెండు చోట్లా హల్ చల్ చేస్తోంది.
By: Tupaki Desk | 2 Aug 2024 2:45 AM GMTముమైత్ ఖాన్ తర్వాత సుదీర్ఘ కాలం భారతీయ సినీపరిశ్రమలో హవా సాగిస్తున్న భామగా నోరా ఫతేహి గురించి చెప్పుకోవచ్చు. చాలా మంది డ్యాన్సర్లు సినీరంగంలోకి వస్తుంటారు.. ఒక వేవ్ లా వచ్చి వెళుతుంటారు. కానీ నోరా అలా కాదు. ప్రతి రోజూ వేవ్స్ క్రియేట్ చేస్తూ సినిమా, రియాలిటీ టీవీ రంగం రెండు చోట్లా హల్ చల్ చేస్తోంది.
`గాడెస్ ఆఫ్ డ్యాన్స్`గా కీర్తినందుకున్న నోరా ఫతేహి ఐటమ్ నంబర్ లో నర్తిస్తే అది ఆ సినిమాకి ప్రధాన ఆకర్షణగా మారుతుంది. నోరా ఫతేహి తన అసాధారణమైన కొరియోగ్రఫీ, స్టేజ్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తూ హిట్ డ్యాన్స్ నంబర్‌లకు పర్యాయపదంగా మారింది. ఈ క్రేజ్ కి తగ్గట్టే నోరా ఇప్పుడు ఐటం సాంగ్స్ కోసం పారితోషికం అమాంతం పెంచేసిందని తెలుస్తోంది. ఇటీవల నోరా ఒక్కో పాటకు దాదాపు రూ.2 కోట్లు వసూలు చేస్తోందని సమాచారం. గతంలో లక్షల్లో మాత్రమే పారితోషికం అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు రెండు కోట్లకు ఎగబాకింది.
డిమాండ్ సప్లయ్ సూత్రం ఆధారంగానే ఈ పెరుగుదల అని కూడా పరిశ్రమ వర్గాలు భావించాల్సి ఉంటుంది. నోరా ఇప్పటికే బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది. సౌత్ లో అద్భుత నర్తకిగా యువతరం హృదయాల్లో నిలిచి ఉంది.
నోరా ఫతేహి కెరీర్ పరిణామం ఆసక్తికరం. ప్రారంభంలో దిల్ బర్ .. సాకి సాకి వంటి పాటలలో అద్భుత నృత్యంతో అసాధారణ గుర్తింపు పొందింది. అప్పటికి నోరా పారితోషికం కేవలం లక్షల్లో ఉంది. ఆ రెండు పాటలతో ప్రపంచవ్యాప్తంగా నోరా క్రేజ్ పెరిగింది. అభిమానుల సంఖ్య అసాధారణంగా పెరిగింది. సోషల్ మీడియాల్లోను తనకు ఫాలోయింగ్ రెట్టింపైంది. అదే క్రమంలో తన డ్యాన్స్ స్కిల్స్ ప్రశంసలు అందుకోవడంతో నోరా ఫీజులను వ్యూహాత్మకంగా పెంచేసింది. పరిశ్రమలో అత్యుత్తమ స్థానానికి ఎదిగింది. ఐటెం సాంగ్స్‌కి ఫీజులు పెంచే ఈ ట్రెండ్ నోరా ఫతేహీ ప్రారంభించలేదు. తన కంటే ముందు చాలా మంది ఐటమ్ క్వీన్స్ ఉన్నారు.
ఇంతకుముందు సన్నీ లియోన్ కూడా నోరా రేంజులో ఇంత పెద్ద అదే మొత్తాన్ని వసూలు చేసింది. సమంతా రూత్ ప్రభు పుష్పలోని ఊ అంటావా పాటకు రూ. 5 కోట్లు అందుకున్నారని కథనాలొచ్చాయి. నయనతార సైతం తమిళంలో ప్రత్యేక గీతంలో నర్తించినందుకు కోట్లాది రూపాయల పారితోషికం అందుకుంది. మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా సరిలేరు నీకెవ్వరు సహా పలు చిత్రాల్లో ఐటమ్ నంబర్లు చేసినందుకు 80లక్షల నుంచి కోటిన్నర అందుకుందని కథనాలొచ్చాయి. ఐటమ్ పాటలు బాక్సాఫీస్ హిట్ మంత్రంగా మారడంతో ఈ భామలందరికీ అది కలిసొస్తోందని చెప్పాలి.
మార్కెటింగ్ వ్యూహంలో ఐటెం సాంగ్ అంతర్భాగంగా మారడంతో నోరా ఫతేహి సహా ఇతర భామలకు అది మంచి అవకాశంగా మారింది. భామల రేంజును ఐటమ్ పాటలు పెంచుతున్నాయే కానీ తగ్గించడం లేదు. నోరా ఫతేహి నుంచి ఏదైనా సింగిల్ ఆల్బమ్ లేదా డ్యాన్స్ నంబర్ వస్తోంది అంటే అందరిలో ఒకటే ఉత్సుకత. ఇప్పుడు సౌత్ నార్త్ లో ఐటం నంబర్లలో నర్తించేందుకు నోరా సిద్ధంగా ఉంది. అయితే దక్షిణాదిన ఏ సినిమాలో అవకాశం అందుకోనుందో వేచి చూడాలి.