నార్త్ లుక్కు పేరుతో తెలుగు ఆర్టిస్టులను పట్టించుకోరా?
ఇటీవలి కాలంలో పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక ఇది మరింతగా ఎక్కువైంది.
By: Tupaki Desk | 30 March 2024 12:30 PM GMTతెలుగు సినిమాల్లో పరభాషా నటుల డామినేషన్ ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇంతకుముందు కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ లాంటి తెలుగు నటులు బహిరంగంగానే పరభాషా నటుల వెల్లువను విమర్శించారు. మన దర్శకనిర్మాతల ఆలోచన సరికాదని దుయ్యబట్టారు. తెలుగులో ప్రతిభావంతులను ప్రోత్సహించాలని కూడా కోరారు. కానీ వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పరభాషా నటుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. అవసరం మేర దిగుమతి చేసుకుంటూనే ఉన్నారు.
ఇటీవలి కాలంలో పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక ఇది మరింతగా ఎక్కువైంది. ఎటు చూసినా పరభాషా నటుల వెల్లువే. ఇప్పుడు భాషతో ఏ సంబంధం లేదు. నటీనటులు లేదా సాంకేతిక నిపుణులు ఎక్కడి వారైనా ఏ భాషలో అయినా పని చేయొచ్చు. ఇంతకుముందు లాగా ప్రాంతీయ సినిమా జాతీయ సినిమా అనేదేమీ లేదు. హిందీ సినిమాలకు ధీటుగా, బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా లేదా సౌత్ సినిమా డామినేషన్ స్పష్ఠంగా కనిపిస్తోంది. దీంతో నార్త్ లో కూడా మైండ్ సెట్లు మారాయి. అక్కడ నిర్మాతలు కూడా సౌత్ స్టార్లకు తమ సినిమాల్లో అవకాశాలిస్తున్నారు. ఇప్పుడు సినిమాల మేకింగ్ సరళి అమాంతం మారింది.
అయితే ఎన్ని మార్పులు వస్తున్నా ఇవేవీ గ్రహించని కొందరు తెలుగు ఆర్టిస్టులు మాత్రం తమకు అవకాశాలు రావడం లేదని కలతకు గురవుతున్నారు. ఆవేదనను దాచుకోకుండా బహిరంగంగా చర్చిస్తున్నారు. ఒక ప్రముఖ ఆర్టిస్టు తెలుగు మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం వాట్సాప్ గ్రూప్ లో ఇలా తన ఆవేదనను వెల్లగక్కారు.
``ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో తెలుగు సినిమాలు తీస్తూ.. ఎవరిని చూసినా.. నార్త్ లుక్కు కావాలి...నార్త్ లుక్కు కావాలి.. అంటున్నారు.. అదేంటో గత 70 ఏళ్ల నుంచి తీసిన సినిమాలలో అప్పటి దర్శకులు ఏనాడు కూడా నార్త్ లుక్కు కావాలని అడగలేదు.. ఇప్పటివారు నార్త్ వారి జపం తప్ప మన తెలుగువారిని పట్టించుకోవడం లేదు.. హీరోయిన్స్ వారే కావాలి.. విలన్స్ వారే కావాలి.. మనం నార్త్ వాళ్లకు ఎన్ని అవకాశాలు ఇస్తున్న మనం నార్త్ వైపు వెళ్తే మనల్ని చిన్నచూపు చూస్తారు... అయినా సరే మన వాళ్లకు తెలిసి రాదు ఖర్మ!!`` అంటూ వాపోయాడు.
అయితే అతడి ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. తెలుగులో తెలుగు భాషా నటులకు తొలి ప్రాధాన్యతనివ్వాలి. ఆ తర్వాత పరభాషా నటీనటులను ఎంపిక చేయాలి. దీనిని దర్శకనిర్మాతలు అర్థం చేసుకోవాలంటే ఆర్టిస్టులు కూడా ఎక్కువగా శ్రమించాలి. తమను తాము ఎక్కువగా ఫోకస్ చేసుకోవడంపైనా వారు దృష్టి పెట్టాలి. అలాగే లుక్స్ పరంగా, నటన పరంగా నార్త్ ఆర్టిస్టులకు ధీటుగా మనవాళ్లు కేర్ తీసుకుని పోటీపడాల్సి ఉంటుంది. గ్లోబల్ ట్రెండ్ లో ఇప్పుడు కేవలం బాలీవుడ్ నుంచి విలన్లు పుట్టుకరావడమే కాదు, మునుముందు బాలీవుడ్ హీరోలే ఇక్కడ స్ట్రైయిట్ హీరోలుగా ఏలినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే మన అగ్ర హీరోలు (ప్రభాస్, బన్ని, చరణ్, ఎన్టీఆర్) నార్త్ లోను హవా సాగిస్తున్న సంగతిని మనం గమనించాలి.