నవంబరులో అందరి కళ్ళు ఆ సినిమాలపైనే!
ఈ నెల మొదటి శుక్రవారం మరే తెలుగు మూవీ విడుదల కాలేదు.
By: Tupaki Desk | 1 Nov 2024 6:43 PM GMTదీపావళి పండక్కి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టపాసుల మోత గట్టిగానే మోగింది. అక్టోబర్ నెలాఖరున నాలుగు సినిమాలు రిలీజైతే, వాటిల్లో మూడు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ‘లక్కీ భాస్కర్’, ‘క’, ‘అమరన్’ చిత్రాలు మంచి వసూళ్లను రాబడుతూ, దూసుకుపోతున్నాయి. నవంబర్ లో ఇంకొన్ని రోజులు ఈ సినిమాల సందడే కనిపించనుంది. ఈ నెల మొదటి శుక్రవారం మరే తెలుగు మూవీ విడుదల కాలేదు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని మల్టీఫ్లెక్స్ లలో ‘సింగం ఎగైన్’, ‘భూల్ భూలయా’ వంటి రెండు హిందీ సినిమాలు ఆడుతున్నాయి.
మామూలుగానే తెలుగు చిత్ర పరిశ్రమలో నవంబర్ నెలను డ్రై సీజన్ గా భావిస్తుంటారు. క్రిస్మస్, సంక్రాంతికి రిలీజులు ప్లాన్ చేసుకునే స్టార్ హీరోలెవరూ.. నవంబర్ లో రావడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. కాకపోతే కోవిడ్ పాండమిక్ తర్వాత పరిస్థితి కాస్త మారింది. ప్రతీ సంవత్సరం ఈ నెలలోనూ పెద్ద సినిమాలు, కాస్త క్రేజ్ ఉన్న చిత్రాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. ఈసారి కూడా కొన్ని నోటెడ్ చిత్రాలు రెండో శుక్రవారం నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాయి.
నవంబర్ 8న ''అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'' అనే సినిమా విడుదల కానుంది. నిఖిల్ సిద్దార్థ, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోహీరోయిన్లుగా.. సుధీర్ వర్మ తెరకెక్కించిన మూవీ ఇది. ‘స్వామిరారా’, ‘కేశవ’ తర్వాత దర్శక హీరోల కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో అంతో ఇంతో బజ్ ఉంది. కాకపోతే అందుకు తగ్గట్టుగా ప్రచారం చేయడం లేదు. ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో ప్రమోషనల్ కంటెంట్ వదులుతున్నారు కానీ, టీం ఆఫ్ లైన్ ప్రమోషన్స్ కి దిగడం లేదు. విడుదలకు ఇంకా వారం టైం ఉంది కాబట్టి, ఈ గ్యాప్ లో ఏమైనా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తారేమో చూడాలి.
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "ధూం ధాం" ఈ నెల 8వ తేదీనే రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు ఆకట్టుకున్నాయి. అదే రోజున ''జితేందర్ రెడ్డి'' అనే సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. 1980లో కరీంనగర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ‘బాహుబలి’ ఫేమ్ రాకేశ్ వర్రే హీరోగా నటించారు. వీటితో పాటుగా ‘జాతర’, ‘ఈసారైనా?!’, ‘రహస్యం ఇదం జగత్’ వంటి మరో మూడు చిన్న సినిమా అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాయి. వీటి కంటే ఒక్క రోజు ముందుగా, అంటే నవంబర్ 7న 'బ్లడీ బెగ్గర్' అనే తమిళ్ డబ్బింగ్ మూవీని రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారు.
నవంబర్ మూడో వారంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ''మట్కా'' రాబోతోంది. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్ లతో ఢీలా పడ్డ మెగా హీరో.. ఈ సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. ఇది నవంబర్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
అదే రోజున మరో పాన్ ఇండియా మూవీ ''కంగువ'' కూడా రిలీజ్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ ఫాంటసీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో దిశా పటానీ హీరోయిన్ గా నటించగా.. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న సూర్య.. అందుకు అనుగుణంగా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజైన టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ అనూహ్య స్పందన లభించింది. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన తాజా చిత్రం ''దేవకీ నందన వాసుదేవ''. హను-మాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథతో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోడానికి మట్కా, కంగువ చిత్రాలతో పాటుగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ‘లెవన్’ అనే క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్ 2’ తెలుగులో రిలీజ్ కానుంది.
విశ్వక్ సేన్ నటించిన ''మెకానిక్ రాకీ'' సినిమా నవంబర్ 22న విడుదల కానుంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రద్ధా శ్రీనాధ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా నటించిన ‘జీబ్రా’ సినిమా అదే రోజున థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఈ రెండు చిత్రాలతో పాటుగా ‘రోటి కపడా రొమాన్స్’ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఇలా నవంబర్ నెలలో చాలా సినిమాలు వస్తున్నాయి కానీ, వాటిల్లో ఐదారు చిత్రాలు మాత్రమే రిలీజ్ కు ముందు జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి వీటిల్లో ఏయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద గట్టిగా ప్రభావం చూపిస్తాయో చూడాలి.