పదేళ్ల నుంచి ఎన్టీఆర్ కాలర్ ఎగరేసేలా చేస్తూనే ఉన్నాడు!
ప్రతీ హీరో జర్నీలో కొన్ని సినిమాలకు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. జూ. ఎన్టీఆర్ కెరీర్లో అలా స్పెషల్ సినిమా అంటే అందరికీ ముందు గుర్తొచ్చే సినిమా టెంపర్.
By: Tupaki Desk | 13 Feb 2025 1:30 PM GMTప్రతీ హీరో జర్నీలో కొన్ని సినిమాలకు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. జూ. ఎన్టీఆర్ కెరీర్లో అలా స్పెషల్ సినిమా అంటే అందరికీ ముందు గుర్తొచ్చే సినిమా టెంపర్. ఏ ముహూర్తాన ఆ సినిమా మొదలైందో, ఏ ముహూర్తాన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇది మీ ఎన్టీఆర్ కాదు, నందమూరి వంశం నుంచి మేం లాంచ్ చేస్తున్న మరో నందమూరి తారక రామారావు అన్నాడో, ఏ ముహూర్తాన ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు మీరు కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తానని మాటిచ్చాడో కానీ ఆ ముహూర్తంలో తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టున్నారు.
ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్ టెంపర్ కు ముందు, టెంపర్ కు తర్వాత అని చెప్పొచ్చు. టెంపర్ ముందు ఎన్టీఆర్ నాలుగు సంవత్సరాల పాటూ వరుస ఫ్లాపులు చూశాడు. ఆ నాలుగేళ్లలో ఎన్టీఆర్ 6 సినిమాలు చేస్తే అందులో బాద్‌షా తప్ప మిగిలినవన్నీ ఫ్లాపులుగానే నిలిచాయి. రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను బాగా డిజప్పాయింట్ చేశాయి.
అలాంటి టైమ్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ సినిమా చేశాడు తారక్. ఎన్టీఆర్ లాగానే పూరీ కూడా టెంపర్ కు ముందు ఫ్లాపుల్లోనే ఉన్నాడు. దానికి తోడు ఎన్టీఆర్- పూరీ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ఆంధ్రావాలా ఫ్లాప్ గా నిలవడంతో ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే సినిమా నుంచి టీజర్ వచ్చిందో ఒక్కసారిగా టెంపర్ పై అందరికీ భారీ అంచనాలేర్పడ్డాయి.
థియేటర్లలో ఫ్యాన్స్ ఆకలి మొత్తాన్ని ఎన్టీఆర్ తీర్చేశాడు. పూరీ చెప్పినట్టే టెంపర్ సినిమాతో కొత్త ఎన్టీఆర్ ను ఆడియన్స్ కు పరిచయం చేశాడు. సినిమా చూశాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ సగర్వంతో కాలర్ ఎగరేశారు. అప్పట్నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ ప్రతీ సినిమాతో తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేస్తూనే ఉన్నాడు. ఫిబ్రవరి 13, 2015న టెంపర్ రిలీజైంది. అంటే ఈ మూవీ రిలీజై ఇవాల్టికి పదేళ్లు పూర్తైంది.
ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర ఇలా ప్రతీదీ హిట్టే. అందుకే ఎన్టీఆర్‌కు, ఆయన ఫ్యాన్స్ కు టెంపర్ సినిమా చాలా స్పెషల్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటూ నార్మల్ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా ఎంతగానో మెప్పించింది.